Friday 29 May 2015

కేసీఆర్.. 2లోపు తేల్చుకుందాం రా

కేసీఆర్.. 2లోపు తేల్చుకుందాం రా
గ్రేటర్ ఎన్నికలు జరిపితే అభివృద్ధి ఎవరిదో తేలిపోతుంది: బాబు
  • సమస్యలన్నీ పరిష్కరించుకుందాం
  • మన వల్ల కాకుంటే కేంద్రం వద్దకు
  • కోర్టులకెళ్లినా ప్రయోజనం ఉండదు
  • కేసీఆర్‌కు చంద్రబాబు పిలుపు
  • ముగిసిన మహానాడు
  • కేంద్ర కమిటీ అధ్యక్షుడిగా బాబు ఎన్నిక
  • టీడీపీ అంటే టీఆర్‌ఎస్‌ వాళ్లకు భయం
  • అందుకే మా ఎమ్మెల్యేల కొనుగోలు
  • ఏపీలో నవ నిర్మాణ దీక్ష తెలంగాణకు
  • వ్యతిరేకం కానే కాదు: టీడీపీ అధినేత
హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): ‘రెండు రాష్ట్రాల నడుమ తలెత్తిన సమస్యల పరిష్కారానికి జూన్‌ 2 లోగా ఇద్దరం కూర్చుందాం.. మాట్లాడుకుందాం. పరిష్కారం కాకుంటే పెద్దమనుషులతో మాట్లాడుదాం. అదీ కుదరదంటే కేంద్రం వద్దకు వెళదాం’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. కొట్టుకుంటే సమస్యలు పరిష్కారం కావని, కోర్టులకెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండబోదన్నారు. టీడీపీ కేంద్ర కమిటీ అధ్యక్షునిగా శుక్రవారం ఎన్నికైన అనంతరం మహానాడు వేదికపై నుంచి ఆయన మాట్లాడారు. రెండు రాష్ట్రాలూ కలిసి ఉంటే కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవసరమని, ఇందుకు తెలంగాణ కూడా ముందుకు రావాలని కోరారు. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్నాయని, ఈ క్రమంలోనే ఇప్పుడు విద్యుత్తు విషయంలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. ‘నీటి విడుదలపై వివాదం రేగితే గవర్నర్‌ వద్ద సమావేశమయ్యేందుకు నేనే చొరవ తీసుకున్నా. ఆ సందర్భంలో ఏపీకి అన్యాయం జరిగితే ఢిల్లీకి వెళదామని కేసీఆర్‌ అన్నారు’ అని చంద్రబాబు గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకోవాలని, రాజకీయాలు వేరు, పార్టీలు వేరు అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘‘దమ్ముంటే గ్రేటర్‌ హైదరాబాద్‌’ ఎన్నికలు నిర్వహించండి. హైదరాబాద్‌ నగరాన్ని ఎవరు అభివృద్ధి చేశారో ప్రజలే తేలుస్తారు’’ అని చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. కేంద్ర కమిటీ అధ్యక్షునిగా ఎన్నికవ్వడానికి ముందు మహానాడు వేదికపై నుంచి ప్రసంగించిన చంద్రబాబు టీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగారు. గతంలో హైదరాబాద్‌ నగర పాలక సంస్థకు ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్‌ 17 ఏళ్లు కాలయాపన చేస్తే ఎన్టీఆర్‌ అధికారం చేపట్టిన వెంటనే ఎన్నికలు నిర్వహించారని, ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌ పాలకులు ఎన్నికలు నిర్వహించకుండా అధికారులతో పాలన చేయించేందుకు ప్రయత్నిస్తే తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఎన్నికలు నిర్వహించానని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ బాటలోనే టీఆర్‌ఎస్‌ పార్టీ సాగుతోందని విమర్శించారు. నీతివంతమైన రాజకీయాలకు మారుపేరైన టీడీపీ ఎన్నికలకు ఎప్పుడూ భయపడలేదన్నారు.
టీడీపీ కార్యకర్తలు తనకు ప్రాణంతో సమానమని, వారిని ప్రాణాన్ని అడ్డం పెట్టుకుని కాపాడుకుంటానని చంద్రబాబు స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నాయకులు ప్రలోభాలతో నలుగురు నాయకులను కొనుగోలు చేసి తెలంగాణలో టీడీపీని లేకుండా చేయగలనని భ్రమపడుతోందని ఎద్దేవా చేశారు. ‘టీడీపీని ఫినిష్‌ చేస్తామన్న వాళ్లంతా ఫినిష్‌ అయిపోయారు. ఎన్నో సంక్షోభాలను టీడీపీ ఎదుర్కొంది. ప్రతి సంక్షోభం పార్టీని బలోపేతం చేసింది. టీఆర్‌ఎస్‌ నేతలకు టీడీపీ అంటే నిద్రలో కూడా భయమే. అందుకే రోజూ టీడీపీ నేతల కొనుగోళ్లకు తాపత్రయపడుతున్నారు’ అని విమర్శించారు. టీడీపీలో పుట్టి పెరిగిన నేతలు ఇప్పుడు టీడీపీ గురించి పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని, ఎవరెన్ని చేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. తనది ఉడుం పట్టని, తెలంగాణలో టీడీపీని గెలిపించి తీరుతానన్నారు. ప్రజాసమస్యలపై పోరాడుతూ పార్టీశ్రేణులు ప్రజలకు చేరువ కావాలన్నారు.
‘హైదరాబాద్‌ను, తెలంగాణను అభివృద్ధి చేసింది మనం. అదే మన విశ్వసనీయత. హైదరాబాద్‌లో భూముల కబ్జాలకు అన్ని పార్టీలూ ప్రయత్నించాయి. వాటిని కాపాడింది టీడీపీ ఒక్కటే. ఓయూకి ఒక చరిత్ర ఉంది. ఆ భూములు తీసుకొని ఏవేవో చేస్తామంటే అంగీకరించే సమస్యే లేదు. పేదలకు ఇళ్లు కట్టాలి. భూములు ఎక్కడైనా కొని కట్టండి. కానీ వర్సిటీ భూముల జోలికి రావద్దు’ అని హెచ్చరించారు. జూన్‌ 2న ఏపీలో చేపట్టనున్న నవ నిర్మాణ దీక్ష తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు. ‘ఆంధ్ర, తెలంగాణ నాకు రెండు కళ్లు. నేను మొదటి నుంచి ఈ మాట చెబుతూనే ఉన్నాను. నాకు రెండు నాలుకలు లేవు. విభజన శాసీ్త్రయంగా జరగలేదు. కాంగ్రెస్‌ దగాకోరు రాజకీయాలు, వైసీపీ కుట్ర రాజకీయాలకు ఏపీ బలైంది. ఆ విషయాలు చాటుతూనే అభివృద్ధి సాధనకు పునరంకితం కావడానికే ఈ దీక్ష. తెలుగువారు ఎన్ని రాష్ట్రాల్లో ఉన్నా... ఎన్ని దేశాల్లో ఉన్నా వారందరి సంక్షేమం టీడీపీ లక్ష్యం. తెలుగుజాతి కోసం ఉన్న పార్టీ టీడీపీ ఒక్కటే’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

No comments:

Post a Comment