Wednesday 20 May 2015

టీడీపీకి చెందిన 6 గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

టీడీపీకి చెందిన 6 గురు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
  • తెలంగాణ అభ్యర్థిపై నేడు నిర్ణయం
హైదరాబాద్‌, మే 20(ఆంధ్రజ్యోతి): ఏపీ మండలిలో భర్తీ కావాల్సి ఉన్న 6 ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను టీడీపీ బుధవారం ఖరారు చేసింది. ఎమ్మెల్యే కోటా కింద భర్తీ చేయాల్సిన రెండు సీట్లకు ఎంఏ షరీఫ్‌ (పశ్చిమ గోదావరి), జూపూడి ప్రభాకరరావు (ప్రకాశం), గవర్నర్‌ కోటా కింద నాలుగు సీట్లకు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి(నెల్లూరు), పంచుమర్తి అనురాధ(విజయవాడ), టీడీ జనార్థనరావు(కృష్ణా), గౌనివారి శ్రీనివాసులు(చిత్తూరు) ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కోటా కింద రెండు సీట్లలో ఒకటి ఆరేళ్ళ పదవీకాలం ఉన్న రెగ్యులర్‌ సీటు.
 
దానిని పార్టీ మైనారిటీ నేత షరీఫ్‌కు ఇచ్చారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు మృతితో ఖాళీ అయిన స్ధానానికి రెండేళ్ళ పదవీకాలం మాత్రమే ఉంది. దానిని ఇటీవలే టీడీపీలోకి వచ్చిన మాల మహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావుకు ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా సీట్లకు అభ్యర్థుల పేర్లను మాత్రం పొలిట్‌బ్యూరో సమావేశం తర్వాత అధికారికంగా ప్రకటించారు. వీరు గురువారం నామినేషన్‌ వేస్తారు. గవర్నర్‌ కోటా సీట్ల అభ్యర్థులను ఎంపిక చేసినా వారి పేర్లను అధికారికంగా ప్రకటించలేదు. ఆ పేర్లు గవర్నర్‌కు పంపి, ఆయన ఆమోదించిన తర్వాత ప్రకటిస్తారు. స్థానిక సంస్థల కోటా కింద భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీ సీట్లకు కూడా అభ్యర్థులను ఖరారు చేశారు.
 
వీరిలో ముద్దు కృష్ణమ(చిత్తూరు), పయ్యావుల కేశవ్‌ (అనంతపురం), మాగుంట శ్రీనివాసులరెడ్డి (ప్రకాశం), రెడ్డి సుబ్రమణ్యం (తూర్పు గోదావరి), పప్పల చలపతిరావు (విశాఖ), నెల్లిమర్ల సత్యం (విజయనగరం), శిల్పా చక్రపాణి రెడ్డి (కర్నూలు), బచ్చల అర్జునుడు(కృష్ణా), యలమంచిలి రాజేంద్ర ప్రసాద్‌ (కృష్ణా) ఉన్నారు. కృష్ణా జిల్లాకు ఇద్దరు అభ్యర్ధులను ఖరారు చేయడంపై కూడా కొంత గందరగోళం నెలకొంది. ఎమ్మెల్సీల్లో అవకాశం ఇవ్వలేకపోయిన మల్లెల లింగారెడ్డి(కడప), వర్ల రామయ్య(కృష్ణా), జేఆర్‌ పుష్పరాజ్‌ (గుంటూరు), రవిచంద్ర యాదవ్‌ (నెల్లూరు)లకు మంచి కార్పొరేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు.
 
తెలంగాణ అభ్యర్థి నేడు ఖరారు

తెలంగాణలో ఒక ఎమ్మెల్సీ సీటుకు పోటీ పెట్టాలని నిర్ణయించిన టీడీపీ... దానికి అభ్యర్థిని మాత్రం ఖరారు చేయలేదు. తుది పోటీలో నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రరెడ్డి మిగిలారు. దీనిపై నిర్ణయం కోసం ఎర్రబెల్లి దయాకరరావు, రేవంత్‌ రెడ్డి, గరికపాటి మోహనరావులతో ఒక కమిటీని చంద్రబాబు నియమించారు. అంతకు ముందు ఆయన తెలంగాణకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలందరితో విడివిడిగా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకొన్నారు. ఈ సీటు గెలవడానికి ఇంకా రెండు ఓట్లు తక్కువ పడటంతో వాటిని సమీకరించడం ఎలా అన్నదానిపై త్రిసభ్య కమిటీ తర్జనభర్జన పడింది. పరిస్థితిని సమీక్షించి గురువారం ఉదయం తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. పోటీ పెట్టడం ఖాయమని, ఏ అభ్యర్థితో వెళ్తే ఫలితం లభిస్తుందో పార్టీ నేతలు తమలోతాము కూర్చుని నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు వారికి సూచించారు.
 
పొలిట్‌బ్యూరోలో అనేక మలుపులు
 
అభ్యర్థుల ఎంపికపై పొలిట్‌బ్యూరోలో విస్తృత చర్చ జరిగింది. ఉభయ రాషా్ట్రల నేతలు ఉన్న ఈ సమావేశంలో చంద్రబాబు బహిరంగంగా అనేక కోణాలపై పార్టీ నేతలందరి అభిప్రాయాలు తీసుకొని అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ కసరత్తులో సమీకరణాలు కుదరకపోవడంతో కొందరి పేర్లు ఆఖరి నిమిషంలో తప్పి పోయాయి. చీరాల నియోజకవర్గ ఇన్‌చార్జి వావిలాల సునీత పేరు ప్రముఖంగా వచ్చినా అప్పటికే అదే జిల్లాకు చెందిన జూపూడి పేరు ఖరారు కావడంతో ఆమెకు ఛాన్స్‌ దక్కలేదు. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నేతలకు కూడా కార్పొరేషన్‌ పదవుల్లో పెద్ద పీట వేయాలని నిర్ణయించారు. మైనారిటీ వర్గాల నుంచి అభ్యర్థి ఎంపికలో రాయలసీమకు చెందిన ఖలీల్‌ భాషాపై చాలాసేపు చర్చ జరిగింది.
 
 
కానీ, ఆ జిల్లా నేతల నుంచి ఆయనకు సానుకూలత రాకపోవడంతో చివరకు పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన మైనారిటీ నేత షరీఫ్‌ను ఎంపిక చేశారు. సునీత పేరును పక్కన పెట్టడంతో మహిళా కోటా కింద విజయవాడ మాజీ మేయర్‌ పంచుమర్తి అనురాధ ఖరారయ్యారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి పేరు ఖరారు కావడంతో రాయలసీమ నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన వారికి అవకాశం దొరకలేదు. ప్రత్యమ్నాయంగా ఆ ప్రాంతం నుంచి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్షుడు, బావుల్లో పూడిక తీసే బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులును ఎంపిక చేశారు.
 
పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అంబికా కృష్ణ పేరు పరిశీలనకు వచ్చినా అదే జిల్లా నుంచి షరీఫ్‌ పేరు ఖరారు కావడంతో ఆయనకు అవకాశం దక్కలేదు. క్షేత్ర స్థాయిలో పనిచేసేవారిలో విజయవాడ అర్బన్‌ అధ్యక్షుడు వెంకన్న పేరు కూడా వచ్చినా అప్పటికే అదే జిల్లాకు చెందిన టీడీ జనార్ధనరావు, అనురాధల పేర్లు ఖరారు కావడంతో ఆయనకూ అవకాశం దక్కలేదు. పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా పదేళ్ళుగా పనిచేస్తున్న టీడీ ఎంపికపై పొలిట్‌బ్యూరోలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
 
స్థానిక సంస్థల కోటా కింద ఎమ్మెల్సీ సీట్ల భర్తీకి ఇంకా నోటిఫికేషన్‌ వెలువడకున్నా అభ్యర్థులు తమ పని తాము చేసుకోవడం కోసం వారి పేర్లను కూడా ఖరారు చేశారు. ఎమ్మెల్యే కోటా, గవర్నర్‌ కోటాలో ఆరు సీట్లు ఉండగా బీసీలకు రెండు, దళితులకు ఒకటి, మైనారిటీలకు ఒకటి, అగ్ర వర్ణాలకు రెండు ఇచ్చారు.
 
 ఎంపికలపై సంతృప్తి
ఈసారి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తెలుగుదేశం పార్టీ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమైంది. పార్టీలో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వారికి అవకాశాలు వచ్చాయని, ఉన్నంతలో ఎంపికలు బాగానే ఉన్నాయన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వచ్చాయి. అడిగిన వారందరికీ ఇవ్వలేకపోవచ్చునని, కానీ చేసిన ఎంపికలు ఫర్వాలేదనిపించాయని కొందరు నేతలు వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment