Monday 25 May 2015

నా విశ్వసనీయత వల్లే ఫ్రీగా సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌:బాబు

నవ్యాంధ్రలో ప్రజా రాజధాని
నా విశ్వసనీయత వల్లే ఫ్రీగా సింగపూర్‌ మాస్టర్‌ ప్లాన్‌:బాబు

సీఎంతో ఈశ్వరన్‌ బృందం భేటీ
రాజధాని బృహత్‌ ప్రణాళిక అందజేత
 
హైదరాబాద్‌, మే 25 (ఆంధ్రజ్యోతి): ‘‘భవిష్యత్తు రాజధాని కేవలం పరిపాలనా రాజధానిగా కాకుండా, డైనమిక్‌గా ఉంటుంది. ఆర్థిక, సామాజిక, ఉపాధి అవకాశాలతో సమగ్ర నిర్ణాయక కేంద్రంగా ఉంటుంది. 21వ శతాబ్దిలోనే మేటి ప్రజా రాజధానిగా అమరావతి భాసిల్లుతుంది. ప్రతి తెలుగు వాడూ గర్వంగా తలెత్తుకునేలా ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరాన్ని నిర్మిస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాజధాని నగరం అంటే కేవలం పరిపాలన, భవనాలు మాత్రమే కాదని, ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలతో నిండుగా ఉంటుందన్నారు. అమరావతి ప్రజా నగరంగా ఆహ్లాదకరం (లవబుల్‌)గా, స్మార్ట్‌ రోడ్‌లతో స్మార్ట్‌ సిటీగా, అతి గొప్ప ప్రజా రవాణాతో భాసిల్లుతుందని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ బృందం సోమవారం ఉదయం సచివాలయంలో భేటీ అయింది. రాజధాని నగర బృహత్‌ ప్రణాళికను అందజేసింది. బృహత్‌ ప్రణాళిక వివరాలను చంద్రబాబుకు వివరించింది. ఈ వివరాలను సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి చంద్రబాబు విలేకరులకు వివరించారు. సింగపూర్‌ ప్రభుత్వం ఇప్పుడు రాజధాని బృహత్‌ ప్రణాళికను అందజేసిందని, జూలై 15వ తేదీలోగా సీడ్‌ కేపిటల్‌ ప్రణాళికను ఇస్తుందని, అది అందిన తర్వాత రాజధాని నగర నిర్మాణ పనులు వేగవంతమవుతాయని వివరించారు. అప్పుడు దసరా రోజు జరిపే శంకుస్థాపనకు ప్రధాని మోదీని, సింగపూర్‌ ప్రభుత్వాన్ని ఆహ్వానిస్తామన్నారు. ‘‘వాస్తవానికి, ప్రపంచస్థాయి రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. కానీ, రాజధాని నగర నిర్మాణంలో పూర్తి సహకారం అందిస్తామని సింగపూర్‌ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇందుకు విశ్వసనీయతను పరిగణనలోకి తీసుకుంది. వ్యక్తిగతంగా నాకు, తెలుగు దేశం పార్టీకి, ప్రభుత్వానికి ఉన్న విశ్వసనీయత కారణంగానే మాస్టర్‌ ప్లాన్‌ను ఉచితంగా డిజైన్‌ చేసేందుకు అంగీకరించింది’’ అని వివరించారు. ‘‘భావితరాలకు అనుగుణమైన అన్ని హంగులతో రాజధాని నగర ప్రణాళికను రూపొందించారు. కోటీ 30 లక్షల మంది వరకూ జీవనం సాగించేలా రూపకల్పన చేశారు. స్థూలంగా చూస్తే సమగ్ర ప్రణాళిక బాగుంది. అక్కడక్కడ కొన్ని మార్పులు చేర్పులూ చేయాల్సి ఉంది. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి ఉపాధి, ఆర్థిక, సామాజికాభివృద్ధి సాధించేలా చూడాలన్నదే నా ఆకాంక్ష’’ అని వివరించారు. ఫలానా ఏడాది నాటికి రాజధాని నగరం పూర్తవుతుందంటూ తాను ఇప్పుడే తేదీలను వెల్లడించలేనని చంద్రబాబు చెప్పారు. పారదర్శకంగా రాజధాని నగర నిర్మాణం జరుగుతుందని, స్విస్‌ చాలెంజ్‌ విధానంలో, పోటీతత్వంతో కూడిన టెండర్‌ విధానంలో పనులు అప్పగిస్తామని చెప్పారు. ‘‘రాజధానిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాజధానిని నిర్మించేందుకు ప్రయత్నిస్తాం. రాజధాని నిర్మాణమనేది ఒక్కసారే జరుగుతుంది. అందుకే భవిష్యత్‌ తరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మిస్తున్నాం’’ అని చెప్పారు. రాజధాని నిర్మాణానికి చైనా, జపాన్‌ సహా సహకరించేందుకు ముందుకొచ్చే అన్ని దేశాల సహాయం తీసుకుంటామన్నారు. రాజధాని నిర్మాణానికి నిధులతోపాటు అనేక సమస్యలు ఉన్నాయని అంగీకరించిన చంద్రబాబు.. కేంద్రం నుంచి ఇతోధికంగా సాయం అందుతుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. రాజధానితోపాటు రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి వచ్చే వరకు కేంద్రం సహకరించాలని కోరారు. ఆర్థికంగా వేగవంతంగా అభివృద్ధి సాధించేలా ఏపీ రాజధాని ఉంటుందన్నారు.

No comments:

Post a Comment