ఆ పేర్లు బయటపెట్టు
లేదా ముస్లింలకు బహిరంగ క్షమాపణ చెప్పు
రాహుల్‌పై నరేంద్రమోదీ నిప్పులు
ఈసీకి బీజేపీ ఫిర్యాదు!
ఎస్పీ,జేడీయూ,ముస్లిం మత పెద్దల ధ్వజం
'యువరాజు' వ్యాఖ్యలపై ఈసీ దృష్టి
రాహుల్‌పై నరేంద్రమోదీ నిప్పులు
ఈసీకి బీజేపీ ఫిర్యాదు!
ఎస్పీ,జేడీయూ,ముస్లిం మత పెద్దల ధ్వజం
'యువరాజు' వ్యాఖ్యలపై ఈసీ దృష్టి
న్యూఢిల్లీ, అక్టోబర్ 25: ముజఫర్‌నగర్ అల్లర్లలో బాధిత ముస్లిం యువకులను పాకిస్థాన్ నిఘా సంస్థలు ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని నిఘా అధికారి ఒకరు తనతో చెప్పారంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ, జేడీయూ, ఎస్పీ సహా ముస్లిం మత పెద్దలు సైతం మండిపడుతున్నారు. గురువారం ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న నరేంద్ర మోదీ.. రాహుల్‌గాంధీని 'షెహజాదా (యువరాజు)' అంటూ వ్యంగ్యంగా సంబోధిస్తూ.... నిప్పులు చెరిగారు. ముజఫర్‌నగర్ ముస్లిం యువతతో ఐఎస్ఐ టచ్‌లో ఉందని చెప్పిన రాహుల్.. సదరు ముస్లిం యువకుల పేర్లను బయటపెట్టాలని, లేదా ముస్లింలపై అంత తీవ్రమైన, వారిని అపఖ్యాతిపాలు చేసే వ్యాఖ్యలు చేసినందుకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీకి ఏ హోదా ఉందని నిఘా సంస్థలు నేరుగా ఆయనకు ఈ విషయాన్ని చెబుతాయని మండిపడ్డారు. ఇదిలావుండగా, రాహుల్ దేశంలో మత విద్వేషాలను రేకెత్తించే ప్రయత్నిస్తున్నారంటూ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు బీజేపీ సిద్ధమైంది.
ఈ మేరకు ఆ పార్టీ నేతలు సోమవారం ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. అసలు ఇంటెలిజెన్స్ అధికారులు ఒక కాంగ్రెస్ ఎంపీ (రాహుల్)కి ఈ విషయాన్ని ఎందుకు చెప్పారో, దీనిపై ప్రభుత్వం ఏయే చర్యలు తీసుకుందో హోం మంత్రి షిండే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరోగనక రాహుల్‌గాంధీకి ఈ విషయం చెప్పింది నిజమే అయితే.. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సి ఉందని, దీనిపై దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా అన్నారు. మరోవైపు.. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న సమాజ్‌వాదీ పార్టీ కూడా కాంగ్రెస్ యువరాజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఆయన తన వ్యాఖ్యలకు ఆధారాలు చూపాలని, చూపితే తాము దానిపై దర్యాప్తు జరిపిస్తామని ఎస్సీ నేత నరేష్ అగర్వాల్ అన్నారు. రాహుల్ వ్యాఖ్యలు ముస్లింలను అవమానించేలా ఉన్నాయని జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి ధ్వజమెత్తారు.
రాహుల్ వ్యాఖ్యలు ముస్లింలపై ద్వేషం రేకెత్తించేలా ఉన్నాయని సీపీఐ నేత అతుల్ రంజన్ అన్నారు. బాధితుల దుస్థితిని, బాధను అర్థం చేసుకోకుండా రాహుల్ గాంధీ రాజకీయాలకు పాల్పడుతున్నారని ప్రముఖ షియా మతపెద్ద మౌలానా సైష్ అబ్బాస్ నఖ్వీ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇండోర్‌లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఉన్నాయంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నరేంద్ర సింగ్ తోమార్ చేసిన ఫిర్యాదుకు ఆ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జైదీప్ గోవింద్ స్పందించారు. దీనిపై దృష్టి సారించాల్సిందిగా ఇండోర్ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. "ఈరోజు నేనిక్కడికి ఏడ్చి ఫిర్యాదులు చేయడానికి రాలేదు. ఏడిపించే కథలతో మిమ్మల్ని కన్నీళ్లు పెట్టించడానికి రాలేదు. మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, మీ కన్నీళ్లు తుడవటానికి వచ్చాను''...ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో గురువారం బీజేపీ నిర్వహించిన భారీ సభలో ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోదీ ఉపన్యాసంలో రాహుల్‌గాంధీపై పరోక్షంగా విసిరిన చెణుకులివి! ఇటీవలికాలంలో.. తన తల్లి, నానమ్మ త్యాగాల గురించి చెబుతున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలతో తన ఉపన్యాసాన్ని ప్రారంభించిన మోదీ క్రమంగా జోరు పెంచారు.
తన నానమ్మ హత్యకు గురైనప్పుడు తనకు చాలా కోపం వచ్చిందని రాహుల్‌గాంధీ చెప్పారని.. అయితే, 1984 ఊచకోతలో ప్రాణాలు కోల్పోయిన సిక్కుల కోసం ఆయనెప్పుడైనా కన్నీళ్లు కార్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌పార్టీకి ఈ దేశాన్ని పాలించడానికి 60 ఏళ్లు అవకాశమిచ్చారని.. తమకు 60 నెలలు ఇచ్చి చూడాలని ప్రజలను కోరారు. అప్పుడు తాను ఉత్తరప్రదేశ్ రాతనే కాదు.. దేశ తలరాతనే మార్చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీనే కాదు.. ఎస్పీ, బీఎస్పీలపైనా మోదీ విరుచుకుపడ్డారు.
No comments:
Post a Comment