Wednesday 2 October 2013

టీడీపీతో పొత్తున్నా మాట మార్చం - BJP

టీడీపీతో పొత్తున్నా మాట మార్చం

Published at: 02-10-2013 08:20 AM
 New  0  0 
 
 

తెలంగాణకు కట్టుబడ్డాం.. ఏది ఏమైనా మా వైఖరి మారబోదు
కొత్త పొత్తులపై ఆసక్తితో ఉన్నాం: జైట్లీ
ఏపీ పొత్తులపై నిర్ణయం తీసుకోలేదు: రాజ్‌నాథ్
అసలు చర్చలే మొదలుకాలేదు: సీతారామన్
న్యూఢిల్లీ, అ క్టోబర్ 1 : తెలంగాణపై తీసుకున్న విధాన నిర్ణయాన్ని ఏదిఏమైనా తమ పార్టీ మార్చుకోబోదని బీజేపీ అగ్రనేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నాయకులను కలిసినంత మాత్రాన తెలంగాణ విషయంలో తాము వైఖరిని మార్చుకుంటున్నట్లు కాదని వివరించారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో భారతీయ యువమోర్చా జాతీయ మీడియా వర్క్‌షాప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విషయంలో పార్టీ వైఖరి స్పష్టంగా ఉందని పునరుద్ఘాటించారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పొత్తుల పట్ల తాము ఆసక్తిగా ఉన్నా మని, మునుముందు ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. బీఎస్పీతో పొత్తుకి ఆస్కారమే లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గతంలో తాము బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నామని, దానికి భారీ మూల్యం చెల్లించామని, గుణపాఠం కూడా నేర్చుకున్నామని గుర్తుచేశారు. పొత్తులు లేని రాష్ట్రాల్లో ఓట్ల శాతాన్ని పెంచుకోవాలన్నదే తమ వ్యూహమని వివరించారు.
దేశవ్యాప్తంగా ప్రజలు మోదీ నాయకత్వం పట్ల సానుకూలంగా స్పందిస్తున్నారని, రాబోయే లోక్‌సభ ఎన్నికలు దేశ నాయకత్వానికి రెఫరెండం వంటివని అభిప్రాయపడ్డారు. కాగా, చంద్రబాబు, నరేంద్ర మోదీలు ఒకే వేదికను పంచుకోవటం యాదృచ్ఛికమని బీజేపీ ప్రతినిధి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇదే కార్యక్రమంలో కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నాయకులు కూడా పాల్గొంటున్నారని ఆమె వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల గురించి స్పందిస్తూ.. తాము టీడీపీతో కానీ, వైసీపీతో కానీ ఇంత వరకూ ఎలాంటి చర్చలు జరపలేదని, అయితే పొత్తులు పెట్టుకోవటం పట్ల ఆసక్తిగా ఉన్నామని వివరించారు. "మోదీని ప్రధానమంత్రి అభ్యర్థిగా తాము ప్రకటించినప్పుడు.. బీజేపీతో జత కట్టేందుకు ఎవరూ ముందుకు రారంటూ దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు మాతో పొత్తు పెట్టుకునేందుకు పార్టీలు ఆసక్తి చూపటమే ఆ దుష్ప్రచారానికి సమాధాన''మని నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ కూడా ఇదే విషయం చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో కలిసి పోటీ చేయాలా లేదంటే జగన్ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదని కోల్‌కాతాలో ఆయన వివరించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/6201#sthash.7GtOsVtN.dpuf

No comments:

Post a Comment