Thursday 17 October 2013

జగన్ కాంగ్రెస్ దత్త పుత్రుడు

కాంగ్రెస్‌కు దత్త పుత్రుడు!

Published at: 18-10-2013 09:23 AM
 New  0  0 
 
 

ఆయన అండతోనే రాష్ట్ర విభజన
పవిత్ర గ్రంథంపై ప్రమాణం చేశారు
రాష్ట్రాన్ని పణంగా పెట్టి పదవుల బేరం: లగడపాటి
న్యూఢిల్లీ, అక్టోబర్ 17 : కాంగ్రెస్‌కు దత్తపుత్రుడు దొరికాడని, ఆయన అండదండలను చూసుకునే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. దత్తపుత్రుడి అండ చూసుకునే సొంతపార్టీ నాయకులను అరువు పుత్రులుగానూ, బరువు పుత్రులుగానూ భావిస్తోందని తప్పుపట్టారు. అందుకే సీఎం, ఎంపీలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో నామమాత్రంగా అయినా విభజనపై మాట్లాడకుండా నిర్ణయం తీసుకుందని చెప్పారు. దత్త పుత్రుడు ఉన్నాడులే..ఇక వీళ్లతో పనేంటి అన్న ధోరణితో హైకమాండ్ ముందుకెళ్లిందన్నారు. ఇంక కాంగ్రెస్ నాయకులు ఎంత గొంతు చించుకున్నా, ఎంత గోల చేసినా, కాళ్లా వేళ్లా పడినా ప్రయోజనం ఉండదన్నారు. ఆ దత్తపుత్రుడు ఎవరని ప్రశ్నించగా.. 'ఆ దత్తపుత్రుడు పాతపుత్రుడో.. కొత్త పుత్రుడో కానీ రాష్ట్రాన్నే పణంగా పెట్టి పదవుల్ని పొందాలని చూస్తున్న పుత్రుడు' అని ఘాటుగా విమర్శించారు.
ఆ దత్తపుత్రుడు, కాంగ్రెస్ పార్టీ కలసిపోయి పనిచేయటమే తమను బాధిస్తోందన్నారు. ఒకప్పుడు స్వంత ప్రయోజనాల కోసం పోరాడిన ఆ దత్తపుత్రుడు ఇప్పుడు రాష్ట్రాన్ని, ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి పదవి కోసం లాలూచీ పడుతున్నాడని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కనుక లాలూచీ పడితే కేంద్ర మంత్రి, గవర్నర్ వంటి పదవుల్ని పొందొచ్చని.. కానీ రాష్ట్రం సమై క్యత కోసం అధిష్ఠానాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురిస్తూ ముందుకు సాగుతున్నాడని ప్రశంసించారు. పదవిని కూడా త్యాగం చేసేందుకు సిద్ధపడి సమై క్యంకోసం సీఎం పోరాడుతుంటే.. దత్తపుత్రుడు మాత్రం పదవి కోసం రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నాడని విమర్శించారు. 'నేను అండగా ఉన్నాను. విభజించేయండి.
ఎన్నికల్లో గెలిచాక చూసుకుందాం' అని దత్తపుత్రుడు హామీ ఇచ్చారన్నారు. దీంతో సొంత నాయకుల్ని లెక్క చేయకుండా కాంగ్రెస్ పార్టీ విభజన చేసిందన్నారు. దత్తపుత్రుడిపై ఆధారపడి రెండుసార్లు అధికారం ఇచ్చిన ప్రజల్ని మోసం చేయటం భావ్యం కాదని అధిష్ఠానానికి సూచిస్తున్నామన్నారు. జూలై 30కి నెల రోజుల ముందు నుంచీ తెరవెనుక జరిగిన కసరత్తులతో కాంగ్రెస్ పార్టీకి భరోసా లభించిందన్నారు. పవిత్ర గ్రంథంపై వాగ్దానాలు తీసుకుని, దత్తపుత్రుడిపై ఆధారపడి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఎంపీలంతా రాజీనామాల ఆమోదానికి స్పీకర్‌పై ఒత్తిడి చేస్తే విభజన ప్రక్రియ ఆలస్యమవుతుందని, తద్వారా తెలంగాణ బిల్లును అడ్డుకోవచ్చన్నారు.
అపోహలు తొలగించుకోండి
అంతా అయిపోయింది కాబట్టి బేరసారాలకు లొంగిపోదామని అనుకోవటం తప్పని చెప్పారు. విభజన సులువు కాదని, సంఖ్యాబలం సమైక్యాంధ్రకే అనుకూలంగా ఉందని కాబట్టి కలసికట్టుగా పోరాడితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుకోవచ్చని తెలిపారు. సోనియాగాంధీకి సమాధి కట్టడం తప్పని, సమైక్యవాదులు మనుసులు మార్చి, కనువిప్పు కలిగించాలే తప్ప దాడులు చేస్తామంటూ ఉద్యమించకూడదని లగడపాటి అన్నారు. విభజనకు సీఎం సహకరిస్తారని దిగ్విజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆయన సహకరిస్తున్నాడో లేదో ప్రజలంతా చూస్తున్నారన్నారు. అసెంబ్లీకి తీర్మానం వచ్చినా, ముసాయిదా వచ్చినా.. దానిని ఓడించిన తర్వాతే పదవి నుంచి తప్పుకోవాలని సీఎం చూస్తున్నారని ఆయన చెప్పారు. అలాంటి ముఖ్యమంత్రి జోలికి ఎవరు వచ్చినా సమైక్యాంధ్ర జోలికి వచ్చినట్లేనని అభివర్ణించారు. టీడీపీ, వైసీపీలు దొంగనాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు.
వ్యక్తిగత విమర్శలపై స్పందించను
కాగా, లగడపాటి విమర్శలపై స్పందించటమంటే పెంటపై రాయి వేసినట్లేనని జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా.. తనపై ఎవరు వ్యక్తిగత విమర్శలు చేసినా స్పందించబోనని అన్నారు. అయితే ప్రజల్ని మాత్రం దగా చేయొద్దని, మోసం చేయొద్దని కోరారు. కొందరు వేర్పాటువాదులు, పార్టీలు పై కి ఒకలాగా లోపల ఒకలాగా వ్యవహరిస్తూ.. సమై క్యవాదం ముసుగులో దొంగనాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. తాను చెప్పాల్సినవన్నీ ప్రజలకు బాగానే అ ర్థమవుతున్నాయని, కాబట్టే కొందరు వ్యక్తులు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటూ తనపై వ్యక్తిగతంగా దాడి చేస్తున్నారని విమర్శించారు. కాగా..ఎవరి ఆస్తులు ఎంత ఉన్నాయో తేల్చేందుకు కేసీఆర్‌తో ముఖాముఖి చర్చకు తాను సిద్ధమని ఆయన సిద్ధంగా ఉన్నారా అని లగడపాటి సవాల్ విసిరారు. విజయవాడలో పురందేశ్వరి సమావేశం పెట్టడాన్ని ప్రస్తావించగా.. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతానంటే పురందేశ్వరి విజయవాడలో పోటీ చేయొచ్చన్నారు.
371 డీ, ఈ కవచకుండలాలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంతా అయిపోయిందని, కాబట్టి సీమాంధ్రకు మేళ్లు కోరుకుంటే మంచిదని కొందరు సీమాంధ్ర నేతలు భావిస్తున్నారని, అయితే, కర్ణుడికి కవచకుండలాల్లాగా రాష్ట్రానికి ఆర్టికల్ 371 డీ, ఈలు ఉన్నాయని చెప్పారు. ఈ అంశంపై 2010లోనే తాను న్యాయ సలహా తీసుకున్నానని, ఇదే విషయాన్ని శ్రీకృష్ణ కమిటీకి సమర్పించానని, న్యాయ శాఖ మంత్రికి ఇచ్చానని, ఇప్పుడు మంత్రుల బృందానికి కూడా సమర్పించానని తెలిపారు. రాజ్యాంగ సవరణతో 371 డీ, ఈల ద్వారా సంక్రమించిన ప్రత్యేక అధికారాలను తొలగించకుండా రాష్ట్రాన్ని విభజించలేరని స్పష్టం చేశారు. వీటిని తొలగించటం కూడా అంత చిన్న విషయం కాదని, ఇందుకు పార్లమెంటులో భారీ మెజార్టీ కావాల్సి ఉంటుందన్నారు.
- See more at: http://www.andhrajyothy.com/node/11780#sthash.ZKSIqPLs.dpuf

No comments:

Post a Comment