Thursday 17 October 2013

ఏపీఎన్జీవోలు యూజ్‌లెస్ ఫెలోస్

జగన్ పార్టీతో చెలిమి కోసం కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేస్తారా!?

Published at: 18-10-2013 09:29 AM
 New  0  0 
 
 

సీమాంధ్ర నేతలంటే అంత చులకనా?
దిగ్విజయ్, అధిష్ఠానం పెద్దలను నిలదీద్దాం
సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల కమిటీ తీర్మానం
మూజ్‌లెస్ ఫెలోస్..ఏపీఎన్జీవోలపై కోండ్రు ధ్వజం
(హైదరాబాద్) "సీమాంధ్రలో జగన్ పార్టీతో చెలిమి కోసం కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేస్తారా!? జగన్‌తో స్నేహం కోసం సొంత పార్టీ నేతలనే విస్మరిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఒక ప్రాంతానికే ఇన్‌చార్జిలా వ్యవహరిస్తున్నారు. తెలంగాణపై రోజుకో ప్రకటన చేస్తున్నారు. వాస్తవానికి సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీని ఏం చేయదలచుకున్నారు!?'' అని ఢిల్లీ వెళ్లి దిగ్విజయ్ సింగ్ సహా అధిష్ఠానం పెద్దలను నిలదీయాలని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల కమిటీ తీర్మానించింది. మంత్రుల క్వార్టర్లలో పీసీసీ అధ్యక్షుడు బొత్స నియమించిన సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల కమిటీ గురువారం సమావేశమైంది. రాష్ట్ర విభజనకు ఏమాత్రం అంగీకరించేందుకు వీల్లేదని.. అసెంబ్లీకి తీర్మానం వచ్చినా.. బిల్లు వచ్చినా వ్యతిరేకించాల్సిందేనని అభిప్రాయపడింది. సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల పట్ల అధిష్ఠానం పెద్దలు వ్యవహరిస్తున్న తీరుపట్ల కమిటీ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
ఈ విధానం సరికాదని స్పష్టం చేయాలని భావించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు "రాష్ట్ర విభజనను నిరసిస్తూ 90 రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. మనం పలుమార్లు సమావేశమయ్యాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం తప్ప మరొక దానికి అంగీకరించేది లేదని మనం చెబుతున్నాం. కానీ, విభజన ప్రక్రియ ముందుకు సాగిపోతోంది. దీనిపై అందరూ సమీక్షించుకోవాలి. దిగ్విజయ్ రాష్ట్రానికి ఇన్‌చార్జి. కానీ, సీమాంధ్రలో పార్టీ పరిస్థితి ఏమిటో ఆయనకు తెలుసా? కొత్త పార్టీతో కలిసి కాంగ్రెస్‌ను విస్మరిస్తున్నారా!? ఈ విషయాలు తెలియాలి'' అని ఎమ్మెల్యే కన్నబాబు ప్రశ్నించారు. రాష్ట్ర విభజన విషయంలో ఢిల్లీ పెద్దలు సీమాంధ్ర నేతలను పట్టించుకోవడం లేదని మంత్రి పార్థసారథి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానంగా దిగ్విజయ్ వ్యవహార శైలి ఏమాత్రం బాగోలేదన్నారు. ఆయన హైదరాబాద్ వచ్చి సీమాంధ్ర ప్రజల మనోభావాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలని.. వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు.
కానీ, ఇలాంటి ప్రయత్నమేదీ జరగకుండా ఏకపక్షంగా విభజన ప్రక్రియ జరుగుతోందన్నారు. వీటిపై సోనియాను కలిసి మాట్లాడాలన్నారు. అధిష్ఠానం పెద్దలు సీమాంధ్ర కాంగ్రెస్ నేతలకు తగిన సమయమే ఇవ్వడం లేదని, ఇక సమస్యలను ఆలకించేదెప్పుడని మంత్రి టీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పురందేశ్వరి సహా కొందరు మంత్రులు రాష్ట్ర విభజన అనివార్యం అన్నట్లు మాట్లాడుతున్నారని, ఇది సరికాదని.. మంత్రులు, ఇతర నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడకుండా కట్టడి చేయాలని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. దీంతో, కాంగ్రెస్‌లో వ్యక్తిగత అభిప్రాయాలను వెల్లడించే స్వేచ్ఛ ఉందని, మంత్రులు తమకు తెలిసిన అంశాలను వివరిస్తుంటారని, అలా మాట్లాడడం సరికాదని మంత్రి ఆనం సూచించారు. ఢిల్లీ వెళ్లి సోనియాను, రాష్ట్రపతిని కలిసి రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని.. రాజ్యాంగం ప్రకారమే రాష్ట్ర విభజన ప్రక్రియ ముందుకు సాగాల్సి ఉందని కోరదామని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచడమే ప్ర«ధాన ధ్యేయమని, విధి లేని పరిస్థితుల్లో విభజన జరిగితే ఎదురయ్యే సమస్యలను కేంద్ర మంత్రుల బృందానికి వివరించాలని మంత్రి బాలరాజు చెప్పారు.
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్నందున కేంద్ర మంత్రుల బృందాన్ని తిరస్కరిద్దామని శైలజానాథ్ సూచించారు. దీనితో బాలరాజు విభేదించారు. పార్టీపరంగా కమిటీ వేసినందున ఏం చేయాలో పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం విశాఖలో కాంగ్రెస్ కార్పొరేటర్లు బస్సును అడ్డుకుని ఆందోళన చేస్తే వారిపై కేసులు పెట్టారని, అదే సమయంలో చిత్తూరు జిల్లాలో సోనియా బతికుండగానే ఆమెకు సమాధి కట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. దీంతో.. ఈ చర్యలను సమావేశం ముక్తకంఠంతో ఖండించింది. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సమైక్య ఆందోళనల పేరిట మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్లపై దాడులను మంత్రి బాలరాజు ఖండించారు. పీసీసీ చీఫ్ బొత్స, ఎంపీ హర్షకుమార్ తదితరుల ఇళ్లపై దాడులను సమష్టిగా ఖండించాలన్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ధిక్కరించి సీమాంధ్ర కాంగ్రెస్ నేతలంతా రాష్ట్ర సమైక్యతకు పోరాడుతుంటే ఏపీఎన్జీవోలు తమపైనే దాడులకు దిగడం ఏమిటని మంత్రి కోండ్రు ఆగ్రహం వ్యక్తం చేశారు.
"ఎవరికి ఉండాల్సిన 'సెల్ఫ్ రెస్పెక్ట్ వారికి ఉంటుంది. వీళ్లు మనల్ని డిక్టేట్ చేస్తారా? యూజ్‌లెస్ ఫెలోస్. టీడీపీ గానీ.. వైసీపీ గానీ విభజనకు సానుకూలంగా మాట్లాడలేదా? లిఖితపూర్వకంగా లేఖలు ఇవ్వలేదా?'' అని ఉద్యోగులపై ధ్వజమెత్తారు. అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, అంత మాత్రాన సోనియాపై విమర్శలు గుప్పిస్తే సహించబోనని హెచ్చరించారు. తాను పార్టీలోనే కొనసాగుతానని, ఇతర పార్టీలతో ముందస్తుగా మాట్లాడుకున్నవారే పార్టీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.సమైక్యం కోసం ఎన్ని ఆందోళనలు చేస్తున్నా ఢిల్లీ పెద్దలు పట్టించుకోవడం లేదని మంత్రి గంటా చెప్పారు.
- See more at: http://www.andhrajyothy.com/node/11788#sthash.F5M2cugQ.dpuf

No comments:

Post a Comment