Tuesday 22 October 2013

నదులున్నా నీరు రాదు - జీవానందరెడ్డి

నదులున్నా నీరు రాదు - డాక్టర్ సజ్జల జీవానందరెడ్డి

Published at: 23-10-2013 00:52 AM
 New  0  0 
 
 

కేంద్ర మంత్రివర్యులు జైపాల్‌రెడ్డి ఇలా అన్నారు: 'గోదావరి, కృష్ణా నదుల్ని ఎవరూ ఎత్తుకెళ్లలేరు'. అయితే అమాత్యుల వారికి అర్థం కానిది, నీటిని ఎత్తుకెళ్తారనే సత్యం. ఈ విషయాలనే నేను రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, సోనియాగాంధీకి నివేదించడం జరిగింది. ఆ నివేదనలోని కొన్ని ముఖ్యాంశాలను ఇక్కడ చర్చించుకుందాం. మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మంత్రివర్గ బృందానికి సమర్పించేందుకు తయారుచేసిన నీటి కేటాయింపుల గణాంకాలు అసంపూర్ణంగా, అసంబద్ధంగా ఉన్నవనే చెప్పాలి (ఈ నెల 19న దినపత్రికలలో వచ్చిన వార్తల ఆధారంగా నేనీ అభిప్రాయానికి వచ్చాను). ఇవి తప్పుడు నివేదికలు మాత్రమే. ఇక్కడ మనకు వచ్చే కాలంలో లభ్యమయ్యే నీటిని గురించి చర్చించలేదు. ఈ విషయాలను మరింత సాకల్యంగా చూద్దాం.
ఇప్పుడు ప్రభుత్వం తయారుచేసిన నీటి పంపకాలు బచావత్ ట్రిబ్యునల్ చెప్పిన గణాంకాల ప్రకారమే అయినా ఇక్కడ కూడా ఎన్నో విషయాలను పరిగణనలోకి తీసుకోలేదనే చెప్పాలి. బచావత్ ట్రిబ్యునల్ శాస్త్రీయ పద్ధతిలో కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో లభ్యమయ్యే నీటిని 78 సంవత్సరాల కాలంలో (1894-95 నుంచి 1970-71) గణించి, ఆ నీటి లభ్యత గణాంకాలను ఉపయోగించుకొని వివిధ సంభావ్యతల (ప్రాబబిలిటీస్) దగ్గర లభించే నీటి లభ్యతను గణించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా (మన దేశంలో కూడా) వాడుకలో ఉన్న నమ్మకమైన (డిపెండబిల్) ప్రాబబిలిటీని 75 శాతంగా నిర్దారించడం జరిగింది. 75 శాతం అంటే, 100 సంవత్సరాలలో కనీసం 75 సంవత్సరాలలో లభ్యమయ్యే నీరు అన్న మాట. ఈ 75 శాతం ప్రాబబిలిటీ దగ్గర వచ్చిన నీటిని మూడు రాష్ట్రాలకు పంచడం జరిగింది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం మన రాష్ట్ర వర్షపాతంలో 132 సంవత్సరాల వలయం ఉంది. ఇలాంటిదే కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని వర్షపాతంలో కూడా ఉంది. అంటే 66 సంవత్సరాలలో సగటు కంటే తక్కువ వర్షపాతం ఎక్కువ సంవత్సరాలలో కురుస్తుందన్న మాట.
దీని తరువాత వచ్చే 66 సంవత్సరాలలో సగటు కంటే ఎక్కువ వర్షపాతం ఎక్కువ సంవత్సరాలలో కురుస్తుందన్న మాట. ఇది ప్రతి 132 సంవత్సరాలకు పునరావృతం అవుతూపోతుంది... మన అరవై సంవత్సరాల తెలుగు క్యాలండర్‌లాగ. బచావత్ తీసుకున్న 78 సంవత్సరాల నీటి లభ్యత మంచి-చెడు వర్షాల కలయిక. దీనిలో శాస్త్రీయత ఉంది. దీని ప్రకారం 75 శాతం దగ్గర నీటి లభ్యత 2060 టీఎంసీలు. దీనికి పునరుత్పత్తి ద్వారా వచ్చే 70 టీఎంసీలను కలిపి (2060+70=2130 టీఎంసీ) మూడు రాష్ట్రాలకు పంచడం జరిగింది. మన రాష్ట్ర వాటా 811 టీఎంసీలు. మన రాష్ట్రానికి 100 సంవత్సరాలలో 25 సంవత్సరాలు 811 టీఎంసీల కంటే తక్కువ నీరు వస్తుంది. అందుకే 100 సంవత్సరాలలో 75 సంవత్సరాలలో వచ్చే మిగులు జలాలను మన రాష్ట్రం వాడుకునే హక్కునిచ్చింది. దీనిలో కొంత సముద్రంలోకి పోతుంది. బచావత్ ట్రిబ్యునల్ నీరు ఉన్నప్పుడు కరువు పీడిత (మన రాష్ట్రంలో) 8 జిల్లాల్లో వాడుకునే వెసులుబాటు కల్పించింది. కానీ ఈ ప్రాజెక్టులు కట్టకపోవడంతో - ఇప్పుడు ఇవి నిర్మాణ దశలోఉన్నవి - కరువు పీడిత ప్రాంతాలు గత 25 సంవత్సరాలుగా నష్టపోవడం జరిగింది. జరుగుతున్నది. మిగులుజలాల వాడకం విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వాలు విధాన నిర్ణయాలను తీసుకొంది. ఇవి నీటి పంపకంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే ఇక్కడ నీటి వాడకం విద్యుత్ ఉత్పత్తికి లింకు కూడా ఉంది.
ఇలాంటి పరిస్థితులలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ ట్రిబ్యునల్ బచావత్ ట్రిబ్యునల్ పాటించిన శాస్త్రీయ విధానాన్ని నిర్లక్ష్యం చేసి అశాస్త్రీయంగా నీటి లభ్యతను నిర్ణయించి, అశాస్త్రీయంగా పంచడం జరిగింది. దీనిపై ఇంకా చర్చలు జరుగుతున్నవి. ఇక్కడ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మంచి వర్షాల కాలంలోని 47 సంవత్సరాల (1960-61నుంచి 2007-08) నీటి లభ్యత గణాంకాలను మాత్రమే తీసుకుంది. ఇక్కడ తక్కువ వర్షాకాలానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనితో సగటు నీటి లభ్యత బచావత్ ట్రిబ్యునల్ కంటే 185 టీఎంసీలు పెంచడం జరిగింది. (2578-293=185టీఎంసీలు). అంతేకాదు 75 శాతంకు బదులు 65 శాతం దగ్గర నీటి లభ్యతను తీసుకుంది. అంటే 65 శాతాన్ని నమ్మకంగా తీసుకుంది. ఇది ఎక్కడ కూడా వాడుకలో లేదు. దీని ప్రకారం 100 సంవత్సరాలలో 35 సంవత్సరాలు 65 శాతం దగ్గర నీటి లభ్యత రాదు అన్నమాట. కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ పంచింది '50' శాతం నమ్మకంగా తీసుకొని (=సగటు), అంటే 2578 టీఎంసీలను, మూడు రాష్ట్రాలకు పంచింది. దీని ప్రకారం మన రాష్ట్రానికి పంచిన నీరు 1001 టీఎంసీలు (811+190 టీఎంసీలు).
యాభై శాతం ప్రాబబిలిటీ అంటే 100 సంవత్సరాలలో 50 సంవత్సరాలు మాత్రమే 1001 టీఎంసీల నీరు మన రాష్ట్రానికి వస్తుంది. కానీ దీనికి మరలా ఎన్నో అడ్డంకులను చేర్చింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కర్ణాటకలోని అల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి అనుమతించడమే కాక (ఇంతకు ముందు దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఎత్తు పెంచుకోవడానికి అనుమతిస్తే, దీనిపై కోర్టు ఆంక్షలు పెట్టడం జరిగింది) అక్రమంగా కట్టుకున్న ప్రాజెక్టులను సక్రమంగా చేసింది. అలాగే మహారాష్ట్రకు విద్యుత్ ప్లాంటులకు నీరు మళ్ళించుకోవడానికి వీలు కల్పించడమే గాక అక్రమ కట్టడాలను సక్రమంగా చేసింది. ఇదే మన రాష్ట్ర విషయంలో చేయలేదు. వీటన్నింటి వల్ల మన రాష్ట్రానికి 1001 టీఎంసీలల నీరు మూడు సంవత్పరాలలో ఒక సంవత్సరం కంటే తక్కువ సంవత్సరాలలో మాత్రమే వస్తుంది. బచావత్ పంచిన నీటిపైన 448 టీఎంసీలు ఎక్కువగా పెంచి (2130+448=2578 టీఎంసీ) పంచడం జరిగింది. ఈ పెంపు వల్ల జరిగే పరిణామాన్ని 2000-2009 గణాంకాల ఆధారంగా చూద్దాం.
బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 2000 నుంచి 2009 వరకు సముద్రంలో కలిసిన నీరు (టీఎంసీ): 365, 252, 111, 013, 012, 023, 1273, 944, 907, 502. ఈ పది సంవత్సరాలు మంచి వర్షపాతంలోని భాగంలో భాగం. దీని తరువాత వచ్చేది తక్కువ వర్షాల భాగం. బ్రిజేష్ కుమార్ నీటి లభ్యత (2578 టీఎంసీలు) ప్రకారం సముద్రంలోకలిసే నీరు: -083, -0196, -436, -425, 825, 496, 459, 054. అంటే ఈ పది సంవత్సరాలలో మాత్రమే సముద్రంలో కలిసే నీరు నాలుగు సంవత్సరాలలో మాత్రమే ఉంది. అంటే మన రాష్ట్ర వాటా 1001 టీఎంసీలకు గాను లభించేది 918, 805, 664, 566, 565, 576, 1826, 1497, 1460, 1055. ఇవే 1001లో శాతంగా! 917, 80.4, 66.3, 56.5, 56.4, 57.5, 182.4, 149.5, 145.9, 105.4. కానీ నిజానికి లభించేది దీని కంటే చాలా తక్కువే. ఎందుకంటే (1) పై రాష్ట్రాల వారు ఎక్కువగా వాడుకోవడం, (2) వరదల వల్ల నీరు సముద్రంలోకి పోవడం (3) కొంతనీరు నది పరిరక్షణ కొరకు వదలడం వగైరాల వల్ల. నది పరిరక్షణకు నీటిని వదలకపోతే జరిగే అనర్థాలెన్నో. ఇందులో ముఖ్యమైనది ఇసుక దందా, దాని వల్ల భూగర్భ జలాలు దెబ్బ తినడం జరుగుతుంది.
అంటే రెండు రకాలుగా నష్టపోవడం జరుగుతుందన్న మాట. కర్ణాటకకు చెందిన కేంద్ర మంత్రి గారు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌ను నియమించడం వల్ల ఆ ట్రిబ్యునల్ వారికి మేలు చేకూర్చే దిశలో అశాస్త్రీయ విధానాన్ని ఎంచుకుంది. కానీ ఇంత అన్యాయం జరుగుతున్నా మన రాష్ట్ర నాయకులకు చీమ కుట్టినట్లు కూడా లేదు. వారికి కావలసింది పదవులు, ధనార్జన. అంతేకాదు కేంద్ర జల వనరుల సంస్థ దీనిపై ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దురదృష్టకరం. దీనికి తోడు మన రాష్ట్రంలో నీటి పారుదల శాఖ పక్క రాష్ట్రాలకు అనుకూలంగా పావులు కదుపుతున్నది. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం దీని వల్ల మన రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు నష్టపోవడం జరుగుతుంది. భూగర్భ జలాలు కూడా దెబ్బతింటాయి. కరువు పీడిత ప్రాంతాలు ఎడారులుగా మారుతాయి. అంటే రాష్ట్ర వ్యవసాయం తిరోగమనంలో పయనిస్తుంది. ఆహార ఉత్పత్తులు తగ్గి కరువు కాటకాలు విలయ తాండవం చేస్తాయి. వ్యవసాయాదారులు కూలీలుగా మారుతారు. విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఆకలి కేకలు-చావులు సర్వసాధారణమవుతాయి.
మన రాష్ట్ర నాయకులు వారి పదవీ వ్యామోహంతో ధనార్జనా పరులై రాష్ట్ర ప్రజల అవసరాలను తాకట్టు పెడుతున్నారు. కర్ణాటక-మహారాష్ట్రలకు చెందిన కేంద్ర మంత్రులు కేంద్రం నియమించిన మంత్రుల బృందంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనేది మనం మరువకూడదు. గతంలో మన రాష్ట్రానికి కేటాయించిన నీరు 75 శాతం సంవత్సరాలలో వస్తే రాబోయే కాలంలో ఇది 25 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. దీన్ని ఆపు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. లేకుంటే రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే.
- డాక్టర్ సజ్జల జీవానందరెడ్డి
- See more at: http://www.andhrajyothy.com/node/13241#sthash.vCiQr2oQ.dpuf

No comments:

Post a Comment