ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోంది : చంద్రబాబు
న్యూఢిల్లీ, అక్టోబర్ 2 : ఇండియా సూపర్ పవర్‌గా అవతరిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బుధ వారం ఉదయం ఢిల్లీలో జరిగిన సిటిజన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబు ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ఆర్థిక సంక్షోభానికి కేంద్రమే కారణమని విమర్శించారు.
ఉత్తరాఖండ్ బాధితులకు సాయం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కంటే తానే ముందున్నానన్నారు. గాంధీ, మోదీ ఇద్దరూ గుజరాత్‌లో పుట్టడం కాకతాళీయమే అని ఆయన అన్నారు. ప్రధానిగా పీవీ ఎన్నో సంస్కరణలు తెచ్చారని కొనియాడారు. ఈ సదస్సులో పాల్గొన్న గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ, చంద్రబాబు పరస్పరం పలకరించుకున్నారు.
నేడు ఒకే వేదిక మీదకు బాబు, మోదీ
హైదరాబాద్, అక్టోబర్ 1 : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ బుధవారం ఒకే వేదికను పంచుకోబోతున్నారు. సుమారు దశాబ్దం తర్వాత వీరిద్దరూ కలిసి ఒక కార్యక్రమంలో పాల్గొనబోతుండటం విశేషం. టీడీపీ, బీజేపీలు రాజకీయంగా చేరువయ్యే అవకాశం ఉందన్న ప్రచారం నేపధ్యంలో వీరిద్దరూ కలవబోతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. సిటిజెన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ వివిధ కళాశాలల విద్యార్థులతో ఢిల్లీ లోఢి రోడ్డు త్యాగరాజ ఇండోర్ స్టేడియంలో బుధవారం కార్యక్రమం నిర్వహిస్తోంది.
దీనిలో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేయనున్నారు. ముగింపు ఉపన్యాసం మోదీ చేస్తారు. వీరిద్దరి మధ్యలో మరి కొందరు వక్తలు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మోదీ కలుసుకొని మాట్లాడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు బుధవారం ఉదయం ఢిల్లీ చేరుకొని..గురువారం తిరిగి వస్తారు. తిరిగి వచ్చిన తర్వాత ఈ నెల ఏడో తేదీ నుంచి ఆయన తన బస్సు యాత్రను పునరుద్ధరించనున్నారు. ప్రకాశం జిల్లాలో పర్చూరు నియోజకవర్గం నుంచి ఆయన పర్యటన మొదలవుతుంది. ఈ నెల 12వ తేదీ వరకూ ఈ యాత్ర ఉంటుంది.
No comments:
Post a Comment