Thursday 24 October 2013

నన్నూ చంపేస్తారేమో! :రాహుల్

నన్నూ చంపేస్తారేమో! :రాహుల్

Published at: 24-10-2013 09:09 AM
 1  1  0 
 
 

నానమ్మను, నాన్నను చంపేశారు
కోపం తగ్గడానికి ఏళ్లు పడుతుంది
రెచ్చగొట్టేందుకు ఒక్క నిమిషం చాలు
బీజేపీ చిచ్చుపెట్టి చంపుతోంది
చేతిలో సెల్‌ఫోన్లు ఉన్నట్టే..రాజకాయాధికారమూ ఉండాలి
ఎన్నికల పోరు మొదలైంది..మళ్లీరాహుల్ సెంటిమెంట్ అస్త్రం

చురు, అక్టోబర్ 23: రాహుల్ గాంధీ మరోసారి 'కన్నీటి' ప్రసంగం చేశారు. సెంటిమెంట్ అస్త్రం సంధించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ తన 'బాధోద్వేగాలను' జనం ముందుంచారు. "మా నాన్నమ్మను చంపేశారు. మా నాన్ననూ చంపేశారు. ఏదో ఒకరోజు నన్ను కూడా చంపేయవచ్చు''... అని అన్నారు. బీజేపీపై విరుచుకుపడ్డారు. రాహుల్ బుధవారం రాజస్థాన్‌లోని చురులో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అత్యంత సన్నిహితులైన వారిని కోల్పోవడం ఎంత బాధాకరమో తనకు బాగా తెలుసునన్నారు. గతంలో ఒకసారి నాన్నమ్మ, తండ్రి హత్యల గురించి రాహుల్ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఇటీవల... తల్లి సోనియా కన్నీళ్లగురించి కూడా చెప్పారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా ప్రసంగం చేశారు. "1984 అక్టోబర్ 31న నాన్నమ్మ ఇందిర హత్య జరిగే రోజుదాకా నేను ఆడుతూ పాడుతూ తిరిగేవాడిని. ఆ దుర్ఘటన నా జీవితాన్ని మార్చివేసింది. నాన్నమ్మను ఆమె సొంత అంగరక్షకులే చంపేశారు. నిజానికి... ఆమెను దీపావళి రోజున గ్రనేడ్ విసిరి చంపాలనుకున్నారు. మీ నాన్నమ్మ ఎక్కడ నిద్రిస్తుంది వంటి వివరాలు అడిగారు. తర్వాత ఆమెను కాల్చి చంపేశారు. ఆమెను చంపినవారిపై నా కోపం తగ్గేందుకు 15 సంవత్సరాలు పట్టింది'' అని రాహుల్ వివరించారు. 1991లో తన తండ్రిని చంపినప్పుడు కూడా ఒక విధమైన కోపం వచ్చిందన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల జీవితాలు అర్ధాంతరంగా ముగియకపోతే... ఈ దేశ ముఖచిత్రం మరోలా ఉండేదని వ్యాఖ్యానించారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీపై 'ప్రత్యక్ష దాడి'కి దిగారు.
"ప్రజల ఆగ్రహావేశాలతో బీజేపీ ఆడుకుంటుంది. మత సామరస్యాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తుంది'' అని రాహుల్ పేర్కొన్నారు. "ఘర్షణలతో వణికిపోయిన ముజఫర్‌నగర్‌లో నేను పర్యటించాను. హిందువులతో, ముస్లింలతో మాట్లాడాను. వారి కష్టాల్లో నన్ను నేను చూసుకున్నాను. బీజేపీ రాజకీయాలంటే అందుకే నాకు కోపం. బీజేపీ వాళ్లు చేసేదేమిటి? గుజరాత్‌లో, ఉత్తరప్రదేశ్‌లో, కశ్మీర్‌లో చిచ్చు పెడతారు. వాటిని మేం ఆర్పాల్సి వస్తోంది'' అని రాహుల్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ పేదల కోసం రాజకీయాలు చేస్తుందని, సరైన రాజకీయాలు చేస్తుందని తెలిపారు. బీజేపీ మాత్రం దేశ సామరస్య చిత్రాన్ని ఛిద్రం చేసిందని, బీజేపీ రాజకీయాలవల్లే జనం మరణించారని తీవ్రంగా విమర్శించారు. ఈ హింసలో విలువైన ప్రాణాలు పోతున్నాయని... సన్నిహితులను కోల్పోయినప్పుడు కలిగే బాధ ఏమిటో తనకు తెలుసునని తెలిపారు.
ఇదే సందర్భంగా ఇందిర, రాజీవ్ హత్యల గురించి ప్రస్తావించారు. సిక్కులు కూడా పెద్దసంఖ్యలో హాజరైన ఈ సభలో రాహుల్... ఇందిర హంతకులైన బియాంత్‌సింగ్, సత్వంత్ సింగ్ పేర్లను కూడా ప్రస్తావించారు. వారిని 'స్నేహితులు'గా సంబోధించారు. "వాళ్లిద్దరూ నాకు బ్యాడ్మింటన్ నేర్పించారు. గ్రెనేడ్ విసిరితే ఎలా కాపాడుకోవాలో బియాంత్‌సింగ్ చెప్పాడు. వాళ్లు నాన్నమ్మను గ్రెనేడ్‌తో చంపాలనుకున్నారని ఆ తర్వాత అర్థమైంది'' అని తెలిపారు. "కొన్నాళ్ల క్రితం పంజాబ్‌కు చెందిన ఓ ఎమ్మెల్యే నన్ను కలిశారు. చాలాసేపు చర్చించారు. తిరిగి వెళ్లేముందు... 'ఇలా మనిద్దరం ఒక గదిలో కూర్చుంటామని ఎప్పుడూ అనుకోలేదు. 20 ఏళ్లక్రితం ఇలా కలిసి ఉంటే నిన్ను చంపేసేవాడిని. అప్పట్లో నాకు చాలా కోపం ఉండేది' అని అన్నారు. ఇప్పుడు నన్ను ఆలింగనం చేసుకోవడానికి కూడా సిద్ధమే. ఆగ్రహం చల్లారడానికి సంవత్సరాలు పడుతుంది. కానీ... రెచ్చగొట్టేందుకు ఒక్క నిమిషం చాలు'' అని రాహుల్ పేర్కొన్నారు.
రాజకీయాలదే తప్పు...
రాహుల్ గాంధీ మరోమారు రాజకీయ వ్యవస్థను తప్పుపట్టారు. రాబోయే పదేళ్లలో దీనిని మార్చాల్సి ఉందన్నారు. ఆ బాధ్యత యువతదే అని తెలిపారు. "బీజేపీ, కాంగ్రెస్, బీఎస్సీ, సమాజ్‌వాది.. ఏదైనా సరే! అవన్నీ 300 నుంచి 400 మంది నడిపేవే. ఇది సరికాదు. వ్యవస్థను లక్షలాదిమంది యువత నడపాలి'' అని ఆకాంక్షించారు. రాజకీయాల్లో కోటాలు పోవాలన్నారు. "రాజీవ్‌గాంధీ ల్యాండ్‌లైన్ ఫోన్లలో కోటాను తొలగించారు. ఇప్పుడు మీ అందరి చేతుల్లో సెల్‌ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు రాజకీయాల్లోనూ కోటా పద్ధతి పోవాలన్నది నా ఆకాంక్ష. మీ చేతుల్లో సెల్‌ఫోన్లు ఉన్నట్లే... రాజకీయ అధికారం కూడా ఉండాలి'' అని రాహుల్ పేర్కొన్నారు. 2014 ఎన్నికల తర్వాత దేశంలో రాజకీయ మార్పు సందేశం వినిపిస్తుందని తెలిపారు. "ఇది కాంగ్రెస్ నుంచే వస్తుంది. ఇతర పార్టీలు అనుసరించాల్సి వస్తుంది. 2014 ఎన్నికల పోరాటం మొదలైంది. ఈ ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు... భవిష్యత్తు గురించి మీలో ఆలోచనలు రేకెత్తించడం కూడా నా బాధ్యతే'' అని రాహుల్ ఉద్ఘాటించారు.
కాంగ్రెస్ సరైన రాజకీయాలు చేస్తుందని తెలిపారు. "బీజేపీ ఎప్పుడు చూసినా రోడ్ల గురించి మాట్లాడుతుంది. కానీ... వాళ్లకంటే మూడురెట్లు ఎక్కువ రహదారులు మేం వేశాం. అంతేకాదు, ఉపాధి కల్పించాం. ఆహార భద్రత ఇచ్చాం. భూమిపై హక్కులు కల్పించాం. అదికూడా... చట్టబద్ధంగా'' అని తెలిపారు. ధనికులు, పేదలకు మధ్య అంతరం గురించి కూడా తనదైన శైలిలో ప్రస్తావించారు. "ఓ సాధారణ మహిళ టీవీలో పెద్దలు ప్రయాణించే విమానాలు చూస్తుంది. పెద్దపెద్ద కార్లు చూస్తుంది. పక్కనే ఇంట్లో తన పిల్లలు చేయడానికి పనిలేకుండా, ఆకలి కడుపులతో ఖాళీగా ఉండటమూ ఆమెకు కనిపిస్తుంది. విమానాలు, పెద్దపెద్ద కార్లను మేం ఎక్కేదెప్పుడని ఆ పిల్లలు ప్రశ్నిస్తారు. యువతలోనూ ఆ బాధ కనిపిస్తోంది. పేదలు, ధనికులు, సమాజంలోని అన్ని వర్గాలు, మతాల వారిని ఒక్కటి చేయాలన్నదే మా ఆకాంక్ష. పేదలు, ధనికులకు మధ్య భాగస్వామ్యం ఉండాలి'' అని రాహుల్ పేర్కొన్నారు.
"నా చిన్నతనంలో నాన్న మాటంటే శిలాశాసనమే. ప్రతిసారీ నాన్నమ్మ నన్ను వెనకేసుకొచ్చేది. నాకు పాలకూర అంటే ఎంతమాత్రం ఇష్టం ఉండేది కాదు. నాన్న మాత్రం అది తినాల్సిందే అనేవారు. నాన్నమ్మ న్యూస్ పేపర్ తెరిచి చదువుతున్నట్లుగా ఉంటే.. నేను ఆ పేపర్ వెనుక కూర్చుని పాలకూర బారి నుంచి తప్పించుకునేవాడిని. 1984 అక్టోబర్ 31న ఎప్పట్లాగానే స్కూలుకు వెళ్లాను. కానీ... ఉన్నట్టుండి టీచర్ నన్ను ఇంటికి వెళ్లాలని చెప్పింది. నాకోసం వచ్చిన ఆయాతో మాట్లాడాను. ఆమె ఏమీ చెప్పలేకపోయింది. అమ్మా, నాన్న బాగున్నారు కదా అని అడిగాను. బాగున్నారని చెప్పింది. తర్వాత... మా నాన్నమ్మను చంపేసినట్లు నా సెక్యూరిటీ అధికారి చెప్పాడు. అది వినగానే నా కాళ్లు వణికిపోయాయి. నన్ను, ప్రియాంకను ఇంటికి తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లే దారిలోనే... నాన్నమ్మ రక్తం కనిపించింది. ఒక గదిలో... నా స్నేహితుల (బియాంత్, సత్వంత్ సింగ్) రక్తం ధారకట్టింది.''
- రాహుల్
అలా చెప్పడం అమ్మకు నచ్చలేదు
ఆహార భద్రత బిల్లు లోక్‌సభలో ఓటింగ్‌కు వచ్చినప్పుడు అనారోగ్యం కారణంగా ఓటు వేయలేకపోయినందుకు తన తల్లి కళ్లనీళ్లు పెట్టుకుందంటూ రాహుల్ చెప్పడం సోనియాకు నచ్చలేదట. ఈ విషయాన్ని ఆయన బుధవారం ఎన్నికల ప్రచారంలో వెల్లడించారు. కాగా.. చురు, అల్వార్ ప్రసంగాల్లో రాహుల్ భావోద్వేగాలతో ప్రసంగించిన తీరు ఆయన గుండెలోతుల్లోంచి మాట్లాడతారనడానికి నిదర్శనమని, ఆయన గుండెచప్పుడు దేశమంతటా ప్రతిధ్వనించి అనేక హృదయాలకు చేరుతుందని కాంగ్రెస్ పార్టీ ప్రశంసించింది.
చెప్పుకోడానికి ఏమీ లేకనే : బీజేపీ
పాట్నా, అక్టోబర్ 23: ఓట్లకోసం భావోద్వేగ ప్రసంగాలు చేయడమేమిటంటూ రాహుల్‌పై బీజేపీ మండిపడింది. యూపీఏ ప్రభుత్వం గురించి చెప్పుకోవడానికి ఏమీ లేక రాహుల్ ఇలా మాట్లాడుతున్నారని పేర్కొంది. "నాన్నమ్మ హత్య, తండ్రి హత్య, తల్లి అనారోగ్యం గురించి ఎన్నికల ప్రచారంలో చెప్పడం... కాంగ్రెస్‌కే ఓటు వేయాలని భావ్వోగభరిత విన్నపాలు చేయడం దురదృష్టకరం. ఆయన కుటుంబం చేసిన త్యాగాల గురించి ఈ దేశానికి ఇప్పటికే తెలుసు. దానిని రాహుల్ మళ్లీమళ్లీ చెప్పడం తగదు. ఆధునిక భారత దేశం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ చేసిందేమీలేదని ఆయన ప్రసంగంతో స్పష్టమైపోయింది'' అని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. స్వార్థ రాజకీయాల కోసమే రాహుల్ కుటుంబ త్యాగాలగురించి ప్రస్తావిస్తున్నారని బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ విమర్శించారు. రాహుల్‌గాంధీ ఓట్ల కోసం తన కుటుంబం గురించి ఉద్వేగంగా మాట్లాడటం మానేసి, దేశాన్ని సంక్షోభాల బారి నుంచి తప్పించి ముందుకు నడిపే విధానాలపై మాట్లాడితే బాగుంటుందని సీపీఐ సీనియర్ నేత ఏబీ బర్ధన్ సూచించారు. కాగా.. అక్టోబర్ 17న రాహుల్‌గాంధీ మధ్యప్రదేశ్‌లోని షాదోల్ జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు గిరిజన మహిళలను కించపరిచేలా మాట్లాడారంటూ ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రభాత్‌ఝా భోపాల్‌లోని స్థానిక కోర్టులో వ్యాజ్యం వేశారు. బుధవారం ఈ కేసును విచారించిన జుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ విశాల్ శర్మ.. దీనిపై నవంబర్ 19న ప్రభాత్‌ఝా స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/13874#sthash.x1yFD4K6.dpuf

No comments:

Post a Comment