Thursday 17 October 2013

కేంద్ర కార్యాలయాల ముట్టడి

కేంద్ర కార్యాలయాల ముట్టడి

Published at: 18-10-2013 07:21 AM
 New  0  0 
 
 

మూసివేయించిన సమైక్యవాదులు
సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు
(ఆంధ్రజ్యోతి, న్యూస్‌నెట్‌వర్క్)
సీమాంధ్రలో సమైక్య ఉద్యమం కొనసాగుతోంది. ఒక పక్క ఉద్యోగులు సమ్మె విరమణ చేస్తున్నా సమైక్యవాదులు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఏపీఎన్‌జీవో సంఘం రాష్ట్ర నాయకత్వం పిలుపుమేరకు సీమాంధ్ర ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ముట్టడి, మూసివేత కొనసాగింది. కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు ఉదయం 9 గంటల నుంచి కేంద్రప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంక్‌లు, పోస్టాఫీసులు, టెలిఫోన్ కార్యాలయాలను మూసివేయించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమాలతో గంటల తరబడి వాహనాల రాకపోకలు స్తంభించాయి. రైతు గర్జన కార్యక్రమంలో భాగంగా నగర శివారుల్లోని నంద్యాల చెక్‌పోస్టు నుంచి కర్నూలు, కల్లూరు మండలాలకు చెందిన రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ కనుమూరి బాపిరాజు తన రాజీనామాను ఆమోదింప చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏపీఎన్జీవోలు, రైతులు ఆయన ఇంటినిముట్టడించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజీనామా చేయాల్సిందేనని కోరుతూ ఒక వినతిపత్రాన్ని ఆయన నివాస గృహం గోడకు అతికించారు. అనంతపురం జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని బ్యాంకులు మూతపడ్డాయి. న్యాయవాదులు ఈనెల 26 వరకు విధులను బహిష్కరించనున్నారు. మడకశిరలో ఉద్యోగులు రెండు గంటలపాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో,ధర్నా చేపట్టారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగుగంగ నుంచి తమిళనాడుకు సరఫరా అయ్యే మంచినీటిని గురువారం ఒక్కరోజు ఆపేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని, లేనిపక్షంలో తమిళనాడుకు తాగునీరు పూర్తిస్థాయిలో ఆపేస్తామంటూ ఇంజనీర్లు హెచ్చరించారు.
ఇక నెల్లూరు జిల్లావ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలైన బ్యాంకులు, తపాలా, ఎల్ఐసీ కార్యాలయాలను సమైక్యవాదులు మూయించేశారు. కావలిలో జేఏసీ నేతలు ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు చేత ప్రమాణపత్రం మీద సంతకం చేయించుకున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా ఇరిగేషన్ ఇంజనీర్లు తలపెట్టిన కాలువలకు నీటి బంద్ కార్యక్రమాన్ని పోలీసులు విఫలం చేశారు. ఇరిగేషన్ ఇంజనీర్లు, ఉద్యోగులు పెద్ద సంఖ్యలో విజయవాడ ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం నుంచి బయలుదేరి కృష్ణా నది వరకు ర్యాలీగా వెళ్లి బ్యారేజీ వద్ద హెడ్ స్లూయిస్ గేటును మూసివేసి కాలువలకు నీటిని బంద్ చేయాలని నిర్ణయించారు. దీంతో పోలీసులు గురువారం ఉదయం ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున మోహరించి ఇరిగేషన్ ఇంజనీర్ల జేఏసీ నాయకులను, ఇరిగేషన్ ఉద్యోగుల జేఏసీ నాయకులను ముందుకు కదలనీయలేదు. జేఏసీ నేతలు ముందుకెళ్లడానికి ప్రయత్నించడంతో వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీఎన్‌వోలు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా సమైక్యాంధ్రను కోరుతూ గురువారం విజయవాడలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, పోస్టల్, రైల్వే ఉద్యోగులు నాలుగు కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. సమైక్య యూత్ ఫోర్స్ నాయకుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విద్యార్థులతో భారీ ర్యాలీ జరిగింది. మరోవైపు ఎన్‌జీవోల ఉద్యమ అజండాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఎన్‌జీవోలు బంద్ చేయించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు, సత్యవేడు పట్టణాల్లో సమైక్యవాదులు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించారు. పలమనేరులో జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనకారులు జాతీయ రహదారిపై బైఠాయించి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. సమైక్యాంధ్ర కోసం కడప, రాజంపేట, రైల్వేకోడూరు, జమ్మలమడుగు ఎన్జీవోల ఆధ్వర్యంలో రిలే దీక్షలు చేపట్టారు. మైదుకూరులో డిగ్రీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. శ్రీకాకుళం జిల్లాలో గురువారం కూడా ఎన్జీవోలు సమ్మెను కొనసాగించారు. జిల్లా కేంద్రంలో చేపట్టిన దీక్షా శిబిరాలను కొనసాగించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తూర్పుగోదావరి జిల్లాలో దీక్షలు కొనసాగుతున్నాయి.గురువారం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు ఆందోళన కార్యక్రమాలను చేపట్టారు.
- See more at: http://www.andhrajyothy.com/node/11595#sthash.HEuhAs98.dpuf

No comments:

Post a Comment