అసెంబ్లీని కాదంటే అంతర్యుద్ధమే! :అశోక్‌బాబు
తీర్మానంపై ఎవరి ఇష్టం వారిదేనా?
పొంతన లేని దిగ్విజయ్, షిండే వ్యాఖ్యలు
రాజ్యాంగంపై అవగాహన లేనివాళ్లతో కమిటీ
కేంద్రం హామీ ఇచ్చేదాకా సమ్మె బాటలోనే
పొంతన లేని దిగ్విజయ్, షిండే వ్యాఖ్యలు
రాజ్యాంగంపై అవగాహన లేనివాళ్లతో కమిటీ
కేంద్రం హామీ ఇచ్చేదాకా సమ్మె బాటలోనే
హైదరాబాద్, అక్టోబర్ 11 : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని ఏపీఎన్జీవోల అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు తెగేసి చెప్పారు. తుఫాను వల్లనో, మరో కారణం వల్లనో సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు, విద్యుత్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించినా, తాము మాత్రం ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. విభజనకు వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేసినా, పార్లమెంటు పట్టించుకోకుండా ముం దుకుపోతే అంతర్యుద్ధం తప్పదని హెచ్చరించారు. శుక్రవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే వ్యతిరేకించాలని ప్రజాప్రతినిధులను కోరుతున్నామని, వారికి ఈరోజు నుంచే బహిరంగ లేఖలు కూడా రాస్తున్నామని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి కట్టుబడి ఉన్నామని ప్రజాప్రతినిధులు హామీ ఇవ్వాలని, అదే ప్రజలకు వారిచ్చే దసరా కానుక అని వ్యాఖ్యానించారు.
"విభజన తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందని ఏఐసీసీ నేత దిగ్విజయ్‌సింగ్ అం టారు. కాదు ఒక్కసారే వస్తుందని హోం మంత్రి షిండే చెబుతున్నారు. అసలు వీళ్లకు రాజ్యాంగం తెలుసా? ఇంత అవగాహన లేని వాళ్లు మంత్రివర్గ ఉప సంఘంలో ఉంటే ప్రజల పరిస్థితి ఏమిటి?'' అని మండిపడ్డారు. అసెంబ్లీ వ్యతిరేకించినా పార్లమెంటులో మొండిగా బిల్లు పెడితే అది రాజ్యాంగ వ్యతిరేకం అవుతుందన్నారు. "1972 జై ఆంధ్రా ఉద్యమం వల్లే 371 అధికరణం వచ్చింది. దాన్ని తొలగించే హక్కు కేంద్రానికి లేదు. రాష్ట్ర విభజన కోసమో, మరో దానికోసమో దానిని తొలగిస్తే ఉద్యోగులను హత్య చేసినట్టే''నని అన్నారు. ఆ అధికరణను తొలగిస్తే కోర్టుకు వెళతామని, దీనిపై ఇప్పటికే న్యాయవాదులతో మాట్లాడుతున్నామని వివరించారు. 20 వరకూ ఆందోళనలు కొనసాగుతాయన్న ఆయన, అందులోభాగంగా 15న అన్ని మండల కేంద్రాల్లో అవగాహన సదస్సులు, 17,18,19 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల దిగ్బంధం కొనసాగుతుందన్నారు. నెలాఖరులో ఢిల్లీ వెళ్లి జాతీయ నేతలను కలుస్తామన్నారు. టీచర్ల సమ్మె విరమణపై స్పందిస్తూ "టీచర్లు ఆగస్టు 21 తేదీ నుంచి సమ్మెలో ఉన్నారు. 70 రోజులుగా విద్యార్థులకు పాఠాలు చెప్పకపోవడం, సిలబస్ పూర్తి కాకపోవడం, 19 నుంచి టెన్త్ ఫీజులు కట్టాలంటూ తేదీలు ఇవ్వడం వల్ల వారు సమ్మె విరమించారు. అయితే, విరమణపై ఉపాధ్యాయ వర్గాలలో ఐక్యత లేదు. మాతో పాటే సమ్మె కొనసాగిస్తామని జిల్లాల నుంచి చాలామంది టీచర్లు కబురు పెడుతున్నారు'' అని చెప్పారు. విభజనని ఆపే విషయంలో సీఎం కిరణ్‌తో జరిగిన చర్చల్లోనూ స్పష్టమైన హామీ లభించలేదని, మళ్లీ చర్చలపై సర్కారు నుంచి ఆహ్వానమేదీ రాలేదని చెప్పారు.
No comments:
Post a Comment