Sunday, 27 October 2013

కేంద్రంతో జగన్ కుమ్మక్కు నిజం

కేంద్రంతో జగన్ కుమ్మక్కు నిజం

Published at: 28-10-2013 06:39 AM
 New  0  0 
 
 

దత్తపుత్రుడు బలపడితే విభజన వేగవంతం
ఇదే వాళ్ల ఆలోచన
అందుకే సమైక్య శంఖారావం
వైసీపీ బలహీనపడితే ప్రక్రియ ఆగిపోతుంది
టీఆర్ఎస్‌తోనూ లాలూచీ
జగన్, కేసీఆర్ తోడు దొంగలు
సభను అడ్డుకోకపోవడమే నిదర్శనం
వైసీపీకి బలం లేదని అధిష్ఠానానికి ఆలస్యంగా అర్థమైంది : లగడపాటి
హైదరాబాద్, విజయవాడ, అక్టోబర్ 27: జగన్ పార్టీ ఎంత బలపడితే విభజన ప్రక్రియ అంత వేగవంతమవుతుందని, బలహీనపడితే ప్రక్రియ ఆగిపోతుందని కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. కేంద్రంతో జగన్ కుమ్మక్కయ్యారని, అధిష్ఠానం ఆయన్ని దత్తపుత్రుడిగా భావిస్తోందని పేర్కొన్నారు. ఇక వైసీపీ, టీఆర్ఎస్ లాలూచీ పడ్డాయన్న విషయాన్ని శనివారం నాటి జగన్ సభను చూసిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడని అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. సమైక్య సభ బలపడాలని జగన్ ప్రయత్నించారని, అయితే ఆయన పార్టీ బలపడటం లేదని అధిష్ఠానానికి ఆలస్యంగా అర్థమైందన్నారు. రాష్ట్రం జగన్ గుప్పిట్లో ఉందన్న భ్రమతో కాంగ్రెస్ అధిష్ఠానం విభజన ప్రకియను వేగవంతం చేస్తోందన్నారు.
సమైక్యవాదంతో ముందుకెళ్తున్న ఏపీఎన్జీవో సభకు అడ్డంకులు సృష్టించిన టీఆర్ఎస్.. జగన్‌తో కుమ్మక్కయినందునే ఆయన సభకు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేదన్నారు. జగన్, కేసీఆర్ తోడు దొంగల్లా కూడబలుక్కుని హైదరాబాద్‌లో శంఖారావం సభను నిర్వహించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బిల్లు వచ్చినా, తీర్మానం వచ్చినా ఓడిస్తామని, ఆ తర్వాత రాజీనామా చేయడానికి ముఖ్యమంత్రితో సహా సీమాంధ్ర నేతలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మూడునెలలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారని, ఇందులో నాయకులు లేరని పేర్కొన్నారు. దీనిపై పత్రికల్లో వచ్చిన సమాచారాన్ని ఢిల్లీకి పంపినట్లు తెలిపారు. తెలంగాణ ఏర్పడాలన్నా, ప్రక్రియ ఆగిపోవాలన్నా కాంగ్రెస్‌కు మాత్రమే సాధ్యమని, అందుకే ఢిల్లీ పెద్దలను ఒప్పించేందుకు తమ వంతు కృషి చేస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించడానికి, ప్రజల గుండెల్లోని భావనను తెలియజేసేందుకు యత్నిస్తున్నామన్నారు. ప్రజల భావోద్వేగాలను తేలిగ్గా తీసుకోవద్దని అధిష్ఠానానికి చెప్పామన్నారు.
ఆ శక్తి ఇప్పుడెక్కడిది?
ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణ ఇచ్చే శక్తి తనకు లేదని, తెచ్చేవాణ్ని కాదని, ఇచ్చేవాణ్ని కాదని... కేంద్ర ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చని జగన్ చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆనాడు లేని శక్తి ఇవాళ ఎక్కడి నుంచి వచ్చిందని, ఆనాడు చేయని దీక్షలు ఇప్పుడెలా చేస్తున్నారని లగడపాటి ప్రశ్నించారు. కేంద్రంతో లాలూచీపడి దత్తపుత్రుడిగా మారి రాష్ట్రాన్ని విడగొట్టడానికి సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్, జేఏసీ నుంచి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఉద్యోగులు నిర్వహించిన సభను జగన్ మీడియా చూపించలేదన్నారు. సీట్లను వీళ్లెక్కడ తన్నుకుపోతారోనని భయపడ్డారని మండిపడ్డారు. సామాన్య ఉద్యోగులు ఉద్యమిస్తూ సభ పెడితే చూపించే సంస్కారం జగన్ మీడియాకు లేకపోయిందన్నారు. జగన్‌తో కేంద్ర నాయకత్వం లాలూచీ పడుతోందన్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని లగడపాటి వ్యాఖ్యానించారు. సీమాంధ్ర నుంచి 25 సీట్లు తెస్తామని వైసీపీ, తెలంగాణ నుంచి 15 సీట్లు తెస్తామని టీఆర్ఎస్.. కాంగ్రెస్ నాయకత్వానికి చెప్పాయన్నారు. ఈ లోపాయికారి ఒప్పందాన్ని ప్రజలు చీదరించుకోవడంతో సీట్లు రావని కేంద్రం ఇప్పుడు ఆందోళన చెందుతోందన్నారు.
దత్తపుత్రుడనుకున్న వారికి శక్తి తగ్గిపోతున్నదని ఢిల్లీ పెద్దలు గమనిస్తున్నారని లగడపాటి వ్యాఖ్యానించారు. సోనియా, రాహుల్‌ను మాట వరుసకు, మొహమాటంగా మాత్రమే జగన్ విమర్శించారన్నారు. విభజన కోసం పోరాడిన టీఆర్ఎస్‌పై, కేసీఆర్‌పై సభలో పల్లెత్తు మాట అన్నారా? అని ప్రశ్నించారు. ప్రజల జీవితాలను పణంగా పెట్టి ఎలాంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నారో దీంతో వెల్లడవుతోందన్నారు. కరీంనగర్ జిల్లా జగన్ పత్రికను చూస్తే టీఆర్ఎస్‌కు జగన్ ఏ విధంగా వత్తాసు పలుకుతున్నాడో అర్థమవుతోందని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రం కోసం తాము ధర్మ పోరాటం చేస్తున్నామని లగడపాటి అన్నారు. ముఖ్యమంత్రి దేన్నీ లెక్క చేయకుండా ముందుకెళ్తున్నారని ప్రశంసించారు. ఆయన పదవుల కోసం పాకులాడకుండా సమైక్యవాదాన్ని భుజానికెత్తుకున్నారన్నారు. 2014లోగా ఏ శక్తి కూడా రాష్ట్ర విభజన చేయలేదన్నారు. రాజకీయ భవిష్యత్తు నాశనమైనా పట్టించుకోబోమన్నారు.
సాక్షి ప్రతినిధులతో వాగ్వాదం
లగడపాటి మాట్లాడుతున్న సందర్భంలో 'సాక్షి' ప్రతినిధి ప్రశ్న వేయడంతో ఆయన ఆగ్రహించారు. తాను ప్రెస్‌మీట్ పెట్టానని, ఇది మీట్‌ది ప్రెస్ కాదని లగడపాటి మండిపడ్డారు. తాను మాట్లాడటం పూర్తి చేయకముందే ప్రశ్నలేంటని అసహనం వ్యక్తంచేశారు. సాక్షి వాళ్లను తాను ప్రెస్‌మీట్‌కు పిలవలేదని, ఇష్టం లేకుంటే బయటకు వెళ్లొచ్చన్నారు. అయితే ఇతర మీడియా ప్రతినిధులు వారించడంతో ప్రెస్‌మీట్ కొనసాగించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/15291#sthash.wnZIC3T2.dpuf

No comments:

Post a Comment