Tuesday 22 October 2013

విభజన బిల్లు డొల్లే!

బిల్లు డొల్లే!

Published at: 23-10-2013 05:33 AM
 4  3  0 
 
 

సమస్యల ప్రస్తావన..పరిష్కారాలపై మౌనం
విభజన బిల్లు తీరేది...3 రాష్ట్రాలప్పుడు జరిగిందిదే
మీరూ మీరూ ప్చఉకోండి
పంచాయతీ వస్తే మా వద్దకు రండి
కేంద్ర ప్రభుత్వం సూచించే మార్గమిదే
'తదుపరి ఉత్తర్వులు' అంటూ దాటవేత
నిధులు, నీళ్ల పంపకాలపై అదే మాట
రాష్ట్రపతి, కాగ్, ఆర్‌బీఐ పాత్ర ప్రస్తావన
ఎక్కడి సంస్థలు అక్కడే ఉంటాయ్
ఏ బిల్లు చూసినా ఇదే కథ
హైదరాబాద్, అక్టోబరు 22:మేం బిల్లు పెట్టేస్తాం! మిగిలినవి మీరూ మీరూ తేల్చుకోండి! ఇది చదవగానే 'తాంబూలాలు ఇచ్చేశాం... తన్నుకు చావండి' అనే నానుడి గుర్తుకొస్తోంది కదూ! రాష్ట్ర విభజనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇలాగే ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. బిల్లులో ఏదీ తేల్చరు. ఏమీ నిర్దిష్టంగా చెప్పరు. 'మీరే తేల్చుకోండి' అనే సలహా ఇస్తారు. 'విభజన తదుపరి రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేస్తారు' అనే గంభీరమైన పదాలు మాత్రం ప్రయోగిస్తారని తెలుస్తోంది. ఏ రాష్ట్ర విభజన బిల్లు అయినా ఇలాగే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ బిల్లు కూడా ఇలాగే ఉంటుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
ఆ వర్గాల కథనం ప్రకారం... రాష్ట్ర విభజన బిల్లులో ఏముంటుంది? ఇరుప్రాంతాల ప్రజలు వెలిబుచ్చుతున్న భయాలు, ఆందోళనలకు బిల్లులో పరిష్కారాలు ఉంటాయా? ఆస్తులు, అప్పులు, నదీ జలాలు, విద్యుత్తు తదితర అన్ని అంశాలకు పరిష్కారం చూపిస్తారా? వంటి అనేక ప్రశ్నలు ఇప్పటికే తలెత్తాయి. 'ఔను... అన్ని ప్రశ్నలకు బిల్లులో సమాధానాలు ఉంటాయి' అని ఢిల్లీ పెద్దలు చెబుతూ వస్తున్నారు. అలాగే... అన్ని సమస్యలపై మంత్రుల బృందం చర్చిస్తోందని, బిల్లులో అన్ని అంశాలకు పరిష్కారాలు చూపుతామని, ఎవరూ ఆందోళన పడక్కరలేదని భరోసా ఇస్తున్నారు. కానీ... బిల్లుకు సంబంధించి ఇవన్నీ అబద్ధాలే అని చెప్పకతప్పదు. రాష్ట్ర పునర్ విభజన బిల్లులో కీలకమైన అంశాలు ఏమీ ఉండవు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ ఏర్పాటకు సంబంధించిన బిల్లులు ఇంచుమించు ఒకే నమూనాలో రూపొందాయి. వివాదాస్పద అంశాల ప్రస్తావనేదీ బిల్లులో ప్రస్తావించే అవకాశమే లేదు. బిల్లులో ప్రతీ అంశాన్ని ప్రస్తావిస్తారు! కానీ, పరిష్కారం మాత్రం చెప్పరు. 'సర్వరోగ నివారణి జిందా తిలిస్మాత్'లాగా... 'ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం తగు ఉత్తర్వులు జారీ చేస్తుంది' అన్న పదాలే ప్రతిచోటా కనిపిస్తాయి.
తూతూ మంత్రమే...
రాష్ట్ర పునర్ విభజన బిల్లులో వివిధ భాగాలు, షెడ్యూళ్లు ఉంటాయి. మొదటి భాగంలో 'ఫలానా పేరుతో ఫలానా ఫలానా అసెంబ్లీ నియోజకవర్గాలతో కొత్త రాష్ట్రం ఏర్పడుతుంది' అని పేర్కొంటారు. ఆ తర్వాత... రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన అంశాలను, రాజ్యాంగంలోని 1, 4 షెడ్యూళ్లలో ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఎక్కడెక్కడ సవరణలు చేయాలో ప్రస్తావిస్తారు. రెండు రాష్ట్రాల పరిధిలో ఎన్ని శాసనసభా స్థానాలు, ఎన్ని ఎమ్మెల్సీ స్థానాలు ఉంటాయో చెబుతారు. అవసరమైతే షెడ్యూల్డ్ కులాలు, తెగల రిజరేషన్ల మధ్య సమతుల్యత పాటించేందుకు వీలుగా ఆయా రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్ విభజనకు ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని బిల్లులో ప్రస్తావిస్తారు. అత్యంత కీలకమైన ఆస్తులు, అప్పులు, ఇతరత్రా వనరుల విభజన-పంపిణీపై మాత్రం నోరెత్తరు. రెండు రాష్ట్రాల మధ్య ఆదాయ వాటాల పంపిణీ అంశాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తారు. కానీ... ఇందులో ఏ వివరమూ ఉండదు. 'రాష్ట్రపతి తన ఉత్తర్వుల ద్వారా ఆదాయ వనరుల పంపిణీని నిర్ధారిస్తారు' అని మాత్రమే పేర్కొంటారు. ఆ తర్వాత మొత్తం ఆస్తులు, అప్పులను విభజించే అంశాలను పేర్కొంటారు.
అప్పు ఎంత ఉంది? ఆస్తులు ఎంత ఉన్నాయి? పంపిణీ ఎలా జరగాలన్న వివరాలేవీ ఉండవు. 'ఉభయ రాష్ట్రాలు పరస్పర అంగీకారం ద్వారా వీటిని పరిష్కరించుకోవాలి' అని ఒక ఉచిత సలహా ఇస్తారు. కాగ్ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన విధి విధానాలను ఆ తర్వాత ఉత్తర్వుల రూపంలో వెల్లడిస్తుందని చెబుతారు. రిజర్వ్ బ్యాంకు లేదా ఏ ఇతర బ్యాంకుల్లోనయినా నగదు నిల్వలు ఉన్నపక్షంలో... ఆయా రాష్ట్రాల జనాభా నిష్పత్తి ప్రకారం నగదును పంచుకోవాలి. అయితే, బ్యాంకులోనే పేపర్లపై మాత్రమే లావాదేవీలు జరగాలి. నిధులను నగదు డ్రా చేసుకోవడానికి వీలుండదు. ఆ తర్వాత... పన్నుల వసూలు ఎలా ఉండాలి? రాష్ట్ర ప్రభుత్వం వివిధ వ్యక్తులకు లేదా సంస్థలకు ఇచ్చిన రుణాలను ఎలా పంపిణీ చేసుకోవాలి? అన్న అంశాలను నామమాత్రంగా ప్రస్తావిస్తూ... 'వీటిపై కాగ్ సలహాతో కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేస్తుంది' బిల్లులో ప్రస్తావిస్తారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఏ ప్రాంతంలో ఉన్నవి ఆ ప్రాంతంలోనే పనిచేయాలి. వాటికి సంబంధించిన ఉత్త్పత్తి ఇరుప్రాంతాల మధ్య ఎలా పంపిణీ జరగాలో కేంద్రం ఆ తర్వాత నిర్ధారిస్తుంది. అలాగే, రెండు రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థ యథాతథంగా కొనసాగాలని... కేంద్రం చెప్పేదాకా ఎంట్రీ ట్యాక్సులు వేయకూడదని బిల్లులో చెబుతారు. ఆ తర్వాత.. జలాల పంపిణీపై వివిధ అంశాలను ప్రస్తావిస్తారు. కానీ, ఏది ఎలా చేస్తారనే విషయం మాత్రం ఉండదు. 'నదుల వారీగా లేదా మొత్తం మీద ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు ఉభయ ప్రాంతాల నేతలు, అధికారులతో చర్చించి జలాల పంపిణీ ఖరారు చేస్తుంది' అని చెబుతారు.
సభా సంగతులు...
కొత్త రాష్ట్రంలో శాసనసభతోపాటు శాసన మండలి కూడా ఉంటుంది. ఆయా ప్రాంతాల సభ్యులతో కొత్త సభలు ఏర్పడి మొదటి సమావేశం జరిగే వరకు ఉభయ సభలకు చెందిన కొంతమంది సభ్యులతో కలిపి కొత్త రాష్ట్రానికి ప్రొవిజనల్ అసెంబ్లీని ఏర్పాటు చేస్తారు. అసలు అసెంబ్లీ తొలి భేటీ కాగానే ప్రొవిజనల్ అసెంబ్లీ రద్దవుతుంది. ఏతావాతా బిల్లును ఏ మూల నుంచి ఏ మూలకు చూసినా ఏ ఒక్క అంశంపైనా ఇలా చేయండి... ఇదీ పరిష్కారం అనే మాటే ఉండదు. ఏ రాష్ట్ర విజన బిల్లు అయినా ఇలాగే ఉంటుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కాకపోతే ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో మాత్రం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందనే అంశం అదనంగా ఉంటుంది. ఇక్కడకూడా... హైదరాబాద్‌కు ఏ స్టేటస్ ఇవ్వాలి? ఇక్కడి వ్యక్తులు, ఉద్యోగుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలి? వం టి వివరాలు మాత్రం బిల్లులో ఉండవు. 'రాష్ట్రపతి ఉత్తర్వుద్వారా ఈ అంశాలపై స్పష్టత ఇస్తాం' అనే పదాన్ని మాత్రం చేరుస్తారు.
అసెంబ్లీ పాత్ర స్వల్పమే...: రాష్ట్ర విభజన ప్రక్రియలో శాసనసభ పాత్ర చాలా స్వల్పమని అసెంబ్లీ వర్గాలు భావిస్తున్నాయి. ముసాయిదా బిల్లుపై అభిప్రాయ సేకరణ మాత్రమే ఉంటుందని... అంతకు మించి ఎలాంటి అధికారమూ సభకు ఉండదని ఈ వర్గాలు పేర్కొంటున్నాయి. "ఆర్టికల్-3 ప్రకారం కేంద్ర కేబినెట్, రాష్ట్రపతి, పార్లమెంటులకు మాత్రమే రాష్ట్ర విభజన ప్రక్రియలో ప్రమేయం ఉంటుంది. ముసాయిదా బిల్లుపై చర్చకు శాసనసభను సమావేశపరిచేందుకు 30 మంది సభ్యులు హాజరైతే చాలు'' అని అధికార వర్గాలు తెలిపాయి. ముసాయిదా బిల్లుపై ఎంతమంది మాట్లాడాలో శాసన సభ సలహా కమిటీ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. కొందరికి మాత్రమే మాట్లాడే అవకాశం లభిస్తే... కాంగ్రెస్ తరఫున అధిష్ఠానమే పేర్లను సూచిస్తుందని కూడా చెబుతున్నారు.
అదే జరిగితే... విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర ప్రాంత నేతలకు అవకాశం లభిస్తుందో, లేదో కచ్చితంగా చెప్పలేమంటున్నారు. 'అధిష్ఠానం నిర్ణయమే శిరోధార్యం' అనే వారికి మైకు దక్కుతుందనే భావన ఉంది. శాసనసభలో ముసాయిదా బిల్లుకు బదులు... సమైక్యాంధ్రపై తీర్మానం ప్రవేశ పెట్టాలని వైసీపీ డిమాండ్ చేస్తే .. అప్పటి ప్రాధాన్యాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చునని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ .. ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేస్తే... సహజ సంప్రదాయాల ప్రకారం తదుపరి ప్రభుత్వం ఏర్పడేంత వరకూ ఆయనను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని గవర్నర్ కోరే అవకాశం ఉంటుంది. అయితే.. ముఖ్యమంత్రి రాజీనామా వల్ల విభజన ప్రక్రియకు ఎలాంటి అంతరాయం కలుగదు. మొత్తానికి .. విభజన విషయంలో అసెంబ్లీ పాత్రకు, అభిప్రాయానికి ప్రాధాన్యం లేదని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
- See more at: http://www.andhrajyothy.com/node/13342#sthash.UB5u979d.dpuf

No comments:

Post a Comment