Wednesday 2 October 2013

కర్నూలు రాజధానికి నేటికి 60 ఏళ్లు

కర్నూలు రాజధానికి నేటికి 60 ఏళ్లు

Published at: 01-10-2013 07:33 AM
 New  0  0 
 
 

నెహ్రూ చేతుల మీదుగా ఆవిర్భావం
చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిన భవనాలు
నేడు సమైక్యాంధ్ర కోసం ఉద్యమంలోకి
కర్నూలు, సెప్టెంబర్ 30 : ఆంధ్ర రాష్ట్రం రాజధానిగా కర్నూలుకి నేటికి (మంగళవారం) 60 ఏళ్లు. తెలుగు మాట్లాడే ప్రజలకు తొలి రాష్ట్రం ఏర్పడి ఆరు పదుల కాలం గడిచిపోయింది. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ స్వయంగా వచ్చి రాజధానిని ఆవిష్కరించారు. ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా, నీలం సంజీవరెడ్డి ఉప ముఖ్యమంత్రిగా మంత్రివర్గం ఏర్పాటైన నాటి కార్యక్రమానికి నెహ్రూ హాజరవడం విశేషం. ఆనాడు రాష్ట్ర రాజధానిగా కర్నూలును నిర్ణయించడంలో సీమాంధ్ర జిల్లాలలోని నేతలు కీలకపాత్ర పోషించారు.1953 దాకా మద్రాసు ప్రెసిడెన్సీలో మిళితమై ఉన్న సీమాంధ్రలోని 11 జిల్లాలను కలిపి తెలుగు మాట్లాడే వారికోసం ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే అదే ప్రాంతంలో ఇప్పుడు (సెప్టెంబర్ 29) సమైక్యం కోసం భారీ ఎత్తున ప్రజాగర్జన జరగడం గమనార్హం.
కర్నూలు రాజధానిగా..
అప్పటికే అభివృద్ధిలో ముందంజలో ఉన్న బెజవాడలాంటి నగరాలను కాదని కర్నూలును ఎంపిక చేయడంలో అప్పటి పాలకుల దూరదృష్టి స్పష్టంగా కనిపిస్తోంది. కొత్తగా ఏర్పాటయ్యే రాష్ట్రంలో కాంగ్రెస్‌దే ఆధిపత్యం ఉండాలన్నది అప్పటి నేతల ఆలోచనగా అర్థమవుతోంది.
ప్రకాశం పంతులను ఒప్పించిన నెహ్రూ..
రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రకాశం పంతులు బాధ్యతలు స్వీకరించడానికి స్వయంగా నెహ్రూ చొరవ చూపారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కాకముందు మద్రాసు ప్రెసిడెన్సీలో 1946లో రెవెన్యూ శాఖమంత్రిగా పనిచేసిన టంగుటూరి ప్రకాశం పంతులు అప్పట్లో జమిందారీ చట్టాన్ని తెచ్చి సంచలనం సృష్టించారు. దీంతో భూస్వామ్య వ్యవస్థకు కొంత కళ్లెం పడినట్టైంది. నెహ్రూ ఆంధ్ర రాష్ట్ర అవతరణతో ప్రకాశం పంతులును సీఎం చేయాలని యోచించారు. కానీ అప్పటికి పంతులు కృషికార్ పార్టీలో ఉన్నారు. ఆయనతోపాటు ఎన్‌జీరంగా కూడా అదేపార్టీలో ఉండేవారు. అప్పట్లో నీలం సంజీవరెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉండేవారు. ఈ పరిస్థితులలో నీలం సంజీవరెడ్డిని రంగంలో దించిన నెహ్రూ..ప్రకాశం పంతులును పార్టీలోకి ఆహ్వానించారు. పంతులుతో ఫోన్లో స్వయంగా నెహ్రూ మాట్లాడారు. కాంగ్రెస్‌లో చేరితే ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తామనే ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం. ఆ మేరకు 1953 అక్టోబరు 1న ఏర్పాటైన ఆంధ్ర రాష్ట్రానికి ప్రకాశం పంతులును ముఖ్యమంత్రిని చేశారు. ఆ కార్యక్రమానికి స్వయంగా నెహ్రూ హాజరై రాష్ట్రాన్ని ఆవిష్కరించారు.
ఆవిష్కరించిన తొలి ప్రధాని
కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ 1953 అక్టోబరు 1న జరిగింది. కర్నూలులో ప్రస్తుతమున్న ఎస్టీబీసీ కళాశాలలో ఆంధ్ర రాష్ట్రావతరణ రోజున నెహ్రూ సాయుధ దళాల వందనాలను స్వీకరించారు. అప్పటిదాకా రాయలసీమలోని కడప, చిత్తూరు జిల్లాలు తమిళనాడులోను.. అనంతపురం, కర్నూలు నిజాం పాలనలోనూ ఉండేవి. అప్పట్లోనే చరిత్ర కలిగిన రాయలేలిన సీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలు నిజాం పాలన నుంచి విముక్తి పొంది తమిళనాడులోనే కలవాలనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ తరుణంలో తెలుగుమాట్లాడే ప్రజలంతా ఒకటిగా ఉండాలనే వాదన ముందుకొచ్చింది. అది క్రమంగా బలపడింది. అందులో భాగంగానే శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. తమిళనాడు పరిధిలోని కడప, చిత్తూరు జిల్లాలను తెలుగు మాట్లాడే ప్రాంతాలతో కలిపి కర్నూలు రాజధానిగా తొలిరాష్ట్రం ఏర్పాటైంది. అంటే ఆరు దశాబ్దాల క్రితమే కర్నూలు రాజధాని వైభవాన్ని సంతరించుకుంది.
12 మందితో తొలి మంత్రి వర్గం..
తొలి రాష్ట్ర రాజధాని కర్నూలులో ఏర్పాటైన తరుణంలో అప్పటి కాంగ్రెస్ పాలకులు 12 మందితో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు, ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి, స్పీకర్‌గా నల్లపాటి వెంకటరామయ్య బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక శాఖ మంత్రిగా తెన్నేటి విశ్వనాథం, విద్యాశాఖమంత్రిగా ఎస్‌బీటీ పట్టాభిరామారావు, ఆరోగ్యశాఖకు కళావెంకట్రావు, నగరపాలక శాఖకు కల్లూరు చంద్రమౌళీ, రెవెన్యూ శాఖకు కడప కోటిరెడ్డి, వ్యవసాయం, అటవీశాఖలకు నెల్లూరు తిమ్మారెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖకు దామోదరం సంజీవయ్య (కర్నూలు), విద్యుత్ శాఖకు సర్దార్ గౌతులచ్చన్న మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు.
1955లో రాజకీయ సంక్షోభం
1955లో టంగుటూరు ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా ఉన్న తరుణంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆ సమయంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో సీఎం ప్రకాశం పంతులు రాజీనామా చేశారు. అప్పటిదాకా పంతులు శిష్యుడు నాయకంటి శంకరరెడ్డి ఓటుతో అవిశ్వాసం నెగ్గడంతో సీఎం గద్దె దిగాల్సిన పరిస్థితి ఏర్పడింది. తన రాజకీయ గురువు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ తనకు మంత్రి పదవి దక్కలేదనే అసంతృప్తితో శంకరరెడ్డి అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేసినట్టు సమాచారం. ఆ స్థానంలో బెజవాడ గోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించి మంత్రివర్గాన్ని కూడా తమకు అనుకూలంగా మార్చుకున్నారు. బెజవాడ గోపాలరెడ్డి ముఖ్యమంత్రిగా ఏర్పాటైన ఆంధ్రరాష్ట్ర మంత్రి వర్గంలో ఉప ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డే కొనసాగారు. కార్మిక, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా సర్దార్ గౌతు లచ్చన్న, స్థానిక పరిపాలన శాఖ మంత్రిగా ఏబీ నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రిగా దామోదరం సంజీవయ్య, స్పీకర్‌గా ఆర్. లక్ష్మీనరసింహ దొర, డిప్యూటీ స్పీకర్‌గా పసల సూర్యచంద్రరావు పనిచేశారు.
కర్నూలులో వారసత్వ కట్టడాలు..
కర్నూలులో నేటి జిల్లా కోర్టు నాడు అసెంబ్లీగా ఉండేది. ప్రస్తుత ఎస్టీబీసీ కళాశాల ఆనాటి ముఖ్యమంత్రి నివాసంగా ఏర్పాటైంది. కేవీఆర్ కళాశాల నాటి రాజ్‌భవన్‌గాను, టౌన్ మోడల్ జూనియర్ కళాశాల శాసన సభ్యుల నివాసాలుగాను, మెడికల్ కళాశాల పురుషుల నివాసగృహం న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌గాను, మెడికల్ కళాశాల సచివాలయంగాను, జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయం నాటి ఏపీపీఎస్సీ కార్యాలయంగాను, జిల్లా పరిషత్ పరిపాలన భవనం అప్పట్లో లోకల్ అడ్మినిస్ట్రేషన్ సెక్రటరీయట్‌గాను ఏర్పాటు చేసుకున్నారు. ఉద్యోగుల నివాసాల కోసం కర్నూలులో అప్పట్లో ఎ.క్యాంప్, బి.క్యాంప్, సి.క్యాంప్‌లుగా ఏర్పాటు చేసి స్థాయిల వారీగా నాలుగువేల గుడారాలు ఏర్పాటు చేశారు. దీంతో అప్పట్లో కర్నూలును టెంట్ క్యాపిటల్ అని పిలిచారు.
- See more at: http://www.andhrajyothy.com/node/5734#sthash.DK0IPoTw.dpuf

No comments:

Post a Comment