Saturday, 26 October 2013

ఢిల్లీ కోటను బద్దలు కొడదాం - Jagan

ఢిల్లీ కోటను బద్దలు కొడదాం

Published at: 27-10-2013 04:35 AM
 New  0  0 
 
 

30 ఎంపీ సీట్లు సాధించి ప్రధానిని నిర్ణయిద్దాం
ఇటలీ వెళ్లిపో..అని పార్లమెంటులో తీర్మానం చేస్తే సోనియాకు నచ్చుతుందా?
కొడుకును ప్రధానిని చేయడానికి మాతో ఆటలా?
రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్న కిరణ్, బాబు
అన్యాయం చేస్తే విప్లవ జెండాలు పట్టుకుంటాం
సమైక్య శంఖారావంలో జగన్
(హైదరాబాద్ - ఆంధ్రజ్యోతి):"రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని పార్లమెంటు శీతాకాల సమావేశాల వరకు పోరాడదాం. అవసరమైతే 2014 వరకు పోరాటం చేద్దాం. రాష్ట్రంలో 30 ఎంపీ సీట్లు గెలిపించుకుందాం. ఢిల్లీ కోటను బద్దలు కొడదాం. ఢిల్లీలో రాజకీయాలను మనమే శాసిద్దాం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే వ్యక్తినే ప్రధానిని చేద్దాం. ఆ తర్వాత రాష్ట్రాన్ని ఎవరు విడదీస్తారో చూద్దాం'' అని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ ఆధ్వర్యంలో శనివారం ఎల్బీ స్టేడియంలో జరిగిన సమైక్య శంఖారావంలో శంఖాన్ని పూరించి ఆయన మాట్లాడారు. ఢిల్లీ అహంకారానికి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి జరుగుతున్న పోరాటం మనదన్నారు. మౌనంగా ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను.. భవిష్యత్తులో మరికొన్ని రాష్ట్రాలను ఓట్లు, సీట్ల కోసం ముక్కలు చేస్తారని, అందరం కలిసికట్టుగా ఎదుర్కొంటేనే ఓట్లు, సీట్ల రాజకీయాలను నిలువరించవచ్చని సూచించారు. "విభజనకు సహకరించి చరిత్రహీనులుగా మిగులుతారా? ప్రజలకు తోడుగా ఉంటారా?'' అని సోనియా, కిరణ్, చంద్రబాబులను ప్రశ్నించారు. శంఖారావంలో ఈ ముగ్గురిపైనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
"1968లో రాజీవ్ గాంధీతో మీకు (సోనియా) పెళ్లయింది. 1983లో భారతదేశ పౌరసత్వం తీసుకున్నావు. ఇప్పుడు.. పౌరసత్వం తీసుకున్న వారంతా దేశం విడిచి వెళ్లాలనే బిల్లు పార్లమెంట్‌లో వస్తే సోనియాకు నచ్చుతుందా? ఈ మాట అంటేనే కాంగ్రెస్ వాళ్లు కల్లు తాగిన కోతుల్లా రెచ్చిపోతారు. 30 ఏళ్లకే నీకు ఇంతటి మమకారం ఉంటే.. 60 ఏళ్లుగా కలిసున్న మమ్మల్ని విడదీసే ప్రయత్నం చేస్తుంటే మాకెంత బాధ ఉంటుంది? నీ కొడుకుకు ప్రధాని ఉద్యోగం కోసం మా పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం ఎంతవరకు న్యాయం?'' అని సోనియాను నిలదీశారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వైఎస్ రెండుసార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలో కూర్చోబెడితే రాహుల్‌ను ప్రధానిని చేయడం కోసం ఇప్పుడు తెలుగు ప్రజలతో చెలగాటమాడతారా అంటూ విమర్శించారు. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర తెలుసా అని సోనియాను ప్రశ్నించారు. మీ అత్త ఇందిరా గాంధీ ప్రధాని హోదాలో పార్లమెంటులో చేసిన ప్రసంగం చదువుకో అంటూ ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇందిర చేసిన కొన్ని వ్యాఖ్యలను ఉటంకించారు. తెలుగు జాతిని చీల్చాలనుకోవడం న్యాయమేనా? బలమైన రాష్ట్రాన్ని బలహీనం చేయడం సబబేనా అని సోనియాను ప్రశ్నించారు. "రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ 80 రోజులుగా అన్ని వర్గాలవారు ఉద్యమాలు చేస్తున్నారు.
ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విభజించాలని చూస్తున్న సోనియాకు ఈ ఆందోళనలు పట్టలేదు. ప్యాకేజీలు అడుగుతున్న చంద్రబాబుకు తట్టలేదు. సోనియా గీత దాటకుండా మోసం చేస్తున్న కిరణ్‌కు పట్టలేదు. వీళ్లంతా మనుషులేనా!? నీళ్ల పరిస్థితిని గమనించారా? సీడబ్ల్యూసీ తీర్మానం చేసినప్పుడే ముఖ్యమంత్రి పదవికి కిరణ్ రాజీనామా ఎందుకు చేయలేదు. సోనియా ఆదేశించినప్పుడే చేస్తారు. అంతా అయిపోయాక, ప్రజల వద్దకు వెళ్లి మొసలి కన్నీరు కారుస్తారు. అసెంబ్లీని సమావేశపరచాలని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని తీర్మానం చేద్దామని కిరణ్‌ను కోరాం. దాంతో దేశంలో అలజడి వస్తుందని చెప్పాం. గవర్నర్‌కు విన్నవించాం. నేను, మా అమ్మ దీక్షలు చేశాం. సీఎం కార్యాలయం వద్ద ధర్నాలు చేశాం. ముసాయిదా బిల్లు రాకముందే సమైక్యానికి అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేద్దామన్న మా ప్రయత్నం అరణ్య రోదనే అయింది'' అని విమర్శించారు. కిరణ్, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ కనీవినీ ఎరుగని విధంగా అసెంబ్లీ తీర్మానాన్ని పక్కన పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చే స్తోందని విమర్శించారు. అందరం కలిసికట్టుగా విభజించు పాలించు రాజకీయాలను అడ్డుకోవాలని, ఇప్పుడు మేలుకోకపోతే భవిష్యత్తు అంధకారమవుతుందని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పిలుపునిచ్చారు.
మీరా నాయకులు!?
"రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడే ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక జలాశయాలు నిండిన తర్వాత రాష్ట్రానికి నీళ్లు వస్తున్నాయి. ట్రిబ్యునళ్లు, కోర్టులు ఉన్నా రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు. మధ్యలో ఇంకో రాష్ట్రం వస్తే శ్రీశైలం, నాగార్జున సాగర్ తదితర ప్రాజెక్టులకు నీళ్లెక్కడి నుంచి వ స్తాయి? కృష్ణా ఆయకట్టులో రోజూ కొట్టుకునే పరిస్థితి రాదా? పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా చేసినా నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు తాగేందుకు మంచి నీళ్లు కూడా దొరకవు. అన్నీ తెలిసి ప్యాకేజీలు, ట్రిబ్యునళ్లు, కోర్టులు అంటారా? మీరా పాలకులు!? రాష్ట్రం ఒక్కటిగా ఉండగానే మహారాష్ట్ర, కర్ణాటక మన జీవితాలతో ఆడుకుంటున్నాయి. విభజన సంకేతాలు వచ్చిన వెం టనే నికర జలాలపై వాటా, మిగులు జలాలపై హక్కును పెం చుకునే ప్రయత్నాలను చేస్తున్నాయి. మీకు కనబడడం లేదా? కావేరీ వివాదాన్ని చూడడం లేదా? కళ్లుండీ చూడలేని కబోదులనే మిమ్మ ల్ని అడుగుతున్నా. మీరా నాయకులు!?'' అని ధ్వజమెత్తారు.
హైదరాబాద్‌ను నాశనం చేస్తున్నారు
"పదేళ్లలో హైదరాబాద్‌ను విడిచి వెళ్లాలట. చదువుకుంటున్న పిల్లలు తమ చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం ఎక్కడికెళ్లాలని కాలర్ పట్టుకుని అడిగితే సోనియా, కిరణ్, చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? వీళ్ల పాపానికి మూడేళ్లుగా రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. గతంలో మూడు, నాలుగు స్థానాల్లో ఉన్న హైదరాబాద్ ఇప్పుడు 12వ స్థానానికి దిగజారింది. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ఏటా 57 వేల మందికి క్యాంపస్ ఉద్యోగాలు వచ్చేవి. ఇప్పుడు 25 వేలు కూడా రావడం లేదు. హైదరాబాద్‌ను చేతులారా నాశనం చేస్తున్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో సగం హైదరాబాద్ నుంచే వస్తుంది. అది రాకపోతే జీతాలివ్వడానికైనా డబ్బులుంటాయా?'' అని ప్రశ్నించారు. విభజన తర్వాత చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, చిన్న చిన్న ఇళ్లు కట్టుకున్న వారి ఆస్తుల విలువ సగానికి తగ్గిపోతే దానిని సోనియా ఇస్తారా? చంద్రబాబు ఇస్తారా? అని ప్రశ్నించారు.
"రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చంద్రబాబును ఎన్జీవోలు కోరారు. విభజన కోసం కేంద్రానికి ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలని విన్నవించారు. కానీ, నిర్దయగా వెనక్కు తీసుకోను అని చంద్రబాబు చెప్పారు. పైగా బెంగళూరు, చెన్నైలలో తెలుగువారు బతుకుతున్నారుగా అని ప్రశ్నించారు. మీరు, మీతోపాటు మిగిలినవారు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోతుందని, రాజీనామా చేయాలని కోరితే నిర్దయగా చేయను అన్నారు.
రాష్ట్ర విభజన కోసం ఢిల్లీలో చంద్రబాబు దీక్ష చేశారు. ఢిల్లీలో ఎవరెవరితో సంప్రదించారో కానీ ఆయన దీక్ష పూర్తయ్యేలోగానే ఇక్కడ ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరించి, మాట్లాడి.. మొత్తంగా ఉద్యోగులందరినీ సమ్మె నుంచి విరమింపచేసే పనిని కిరణ్ పూర్తి చేశారు. వీళ్లు మనుషులేనా?'' అని ప్రశ్నించారు. పట్టపగలే నిజాయితీ లేని రాజకీయాలు చేస్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. "మనం మనుషులమా? ఆట వస్తువులమా? రాజకీయ చదరంగంలో పావులం అనుకుని అన్యాయం చేస్తే ఊరుకోం. వందేమాతర గేయం అందుకుంటాం. విప్లవ జెండాలు పట్టుకుంటాం. మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేందుకు కూడా వెనకడుగు వేయం'' అని జగన్ హెచ్చరించారు.
సమైక్య సభకు వెళ్తున్న బస్సులపై దాడి
సభకు వెళ్తున్న బస్సులపై తెలంగాణ ఉద్యమకారులు శనివారం రాళ్ల దాడి చేశారు. వరంగల్ సమీపంలోని భట్టుపల్లి-కడిపికొండ రోడ్డు గుండా వెళ్తున్న బస్సులను అడ్డుకునేందుకు రోడ్డుకు అడ్డంగా డ్రమ్ములు పెట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన ఆందోళనకారులు బస్సులపై రాళ్లదాడికి దిగారు. దీంతో బస్సుల్లోని ప్రయాణికులను కిందకు దింపిన పోలీసులు వారిని కాలినడకన కాజీపేటకు పంపించారు. అక్కడి నుంచి బస్సుల్లోకి ఎక్కించి హైదరాబాద్‌కు పంపించారు
- See more at: http://www.andhrajyothy.com/node/15004#sthash.g5LZZUsr.dpuf

No comments:

Post a Comment