Friday, 11 October 2013

వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్

వందేళ్ళ ఆంధ్ర, వెయ్యేళ్ళ తెలుగు -చలసాని ప్రసాద్

Published at: 11-10-2013 02:06 AM
 2  0  0 
 
 

ఆంధ్ర అనే పదం కన్నా తెలుగు అనే పదమే ప్రాచీనమైనది. ఆంధ్ర అనే మాటని వాడుకలో నించి తొలగించి తెలుగు అనే మాటనే వాడాలి. అలాగే హైదరాబాద్ అనే మాటకి బదులు భాగ్యనగరం అని వాడాలి. ఈ మార్పులు వెంటనే అమలులోకి రావాలి... ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల భాగ్యనగరం పెరగలేదు. అభాగ్యుల, అనాధల, అనేకుల శ్రమ ఫలితమే మన భాగ్యనగరం.
'ఆంధ్ర రాష్ట్రం
రాలడానికి పండుకాదు
పండడానికి కాయ కాదు
కాయడానికి పువ్వు కాదు
పూయడానికి మొగ్గ కాదు
మొగ్గడానికి తేలుకాదు
తేలడానికి పాముకాదు
పామడానికి కాలుకాదు
కాలడానికి ఖర్మ కాదు'
అని పంద్రాగస్టుకు ముందే పాడాడు శ్రీశ్రీ. ఇది ఇవాళ అక్షరాలా తెలంగాణకి వర్తిస్తుంది.
భాషాప్రయుక్త రాష్ట్రల ఏర్పాటునేమో ఆంధ్రుల దగ్గరే నేర్చు కున్నానన్నారు గాంధీగారు. మొదటి ప్రపంచయుద్ధానికి ముందే, అంటే 1913 మే 26న తొలి ఆంధ్ర మహాసభ గుంటూరు జిల్లా బాపట్లలో జరిగింది. ఈ సభకు అధ్యక్షత వహించింది సర్ బయ్యా నరసింహ శర్మ గారు. ఈయన అప్పటి వైస్రాయి కౌన్సిల్ మెంబరు. అంతేకాదు మన రావి శాస్త్రిగారి నాన్నకు సాక్షాత్తు మేనమామ. ఆనాటి నుంచీ ఆంధ్ర లోని అన్ని స్కూళ్ళలో ఆంధ్ర వారోత్సవాలు జరిగేవి. అటు తరువాత నలభైఏళ్ళకి గాని ఆంధ్రరాష్ట్రం (1953 అక్టోబర్ 1) ఏర్పడలేదు. పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి వల్లనే ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఇది జగమెరిగిన సత్యం. పొట్టి శ్రీరాములుని పొట్టన పెట్టుకుంది నెహ్రూయేనని శ్రీ శ్రీ అన్నాడు.
ఇప్పుడు హైదరాబాద్ సమస్యలాగానే అప్పుడు మద్రాసు సమస్య తలెత్తింది. తమిళనాడు కమ్యూనిస్టు పార్టీ ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ఏకగ్రీవంగా మద్రాసు తమిళనాడుదే నన్నాయి. తక్కిన రాజకీయ పార్టీలు గూడ గోడమీది పిల్లి వాటంగా కప్పదాట్లు వేశాయి. మద్రాసుకీ, తిరుపతికీ పోటీ వచ్చింది. నిజానికి తిరుపతి మనది కాదు. అక్షరాలా తమిళనాడుదే. అది వైష్ణవ సంప్రదాయం. తిరు అంటే శ్రీ అని అర్థం. తిరు శబ్దం తమిళ భాష లోదే. కాళహస్తి మనది. అది వీర శైవ సంప్రదాయం.
పొట్టి శ్రీరాములు ఆత్మాహుతి తరువాత ఒక పాట ప్రచారం లోకి వచ్చింది....
'తిరపతి కొండలు
అరవలవేనట
వెంకటేశుడు అయ్యంగారట
తెలుగన్నయ్యలూ
విన్నారా? తెలివి తెచ్చుకుని ఉన్నారా?'
ఇక్కడే ఒక ఉదంతం చెప్పాలి.
తెల్లవాడి ఏలుబడికి వ్యతిరేకంగా మన దేశంలో తీవ్రంగా పోరాడిన వారు పంజాబీలు, బెంగాలీలు, ఆంధ్రులు. వీరు ముగ్గురూ తెల్ల సింహాన్ని జూలు పుచ్చుకుని ఆడిస్తే తక్కిన వాళ్ళు దాని తోక పుచ్చుకుని వేలాడారు. అందుకే తెలుగువారు అడిగిన ఆంధ్ర రాష్ట్రం ఇవ్వకుండా అడగని ఒడిశా రాష్ట్రం (1936 ఏప్రిల్1) ఏర్పాటు జేశారు.
మన విశాఖపట్నం జిల్లాని కబళించి అందులో ఒక ముక్క, చెక్క ఒడిశాలో కలిపేశారు. గంజాం ప్రాంతాన్నీ, బరంపురం, పర్లాకిమిడినీ స్వాహా చేశారు. దీనిని నిరసిస్తూ ఆంధ్రులు కోర్టు కెళ్ళి లండన్ ప్రీవీ కౌన్సిల్ దాకా పోరాడారు. ప్రీవీ కౌన్సిల్ సభ్యులకు ఒడిశా గజపతిరాజులు లంచాలు మేపి కార్లు కొనిపెట్టి ఒడిశాకి అనుకూలంగా తీర్పు చెప్పించారు. ఇది జగమెరిగిన సత్యం. పర్లాకిమిడి ని కబళించినందుకు నిరసనగా మన 'గిడుగు పిడుగు' మహేంద్రతనయ నదిని దాటి పాతపట్నం వచ్చేసి పట్టుదలగా మళ్ళా అక్కడ అడుగు పెట్టలేదు. గిడుగు మరెవరో కాదు మన కాళీపట్నం రామారావుగారి నాన్నకి మేనమామ.
మళ్ళీ వెనక్కి వెళదాం. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక రాజధాని విజయవాడ అని అందరూ అనుకున్నారు. కానీ అప్పుడది కమ్యూనిస్టు పార్టీకి కంచుకోట. అక్కడి నుంచి హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ అంటే మన సరోజినీ నాయుడు తమ్ముడు కమ్యూనిస్టుల తోడ్పాటుతో లోక్ సభకి ఎన్నికయ్యాడు. తొలి జనరల్ ఎన్నికల్లో కృష్ణాజిల్లాలో కాంగ్రెస్‌కి చావుతప్పి కన్ను లొట్ట పోయింది. అసెంబ్లీ సీట్లన్నీ కమ్యూనిస్టు పార్టీ గెల్చుకుంది. కాంగ్రెసు ఒంటికాయ శొంఠికొమ్ము లాగా ఒకే ఒక్క సీటు గెలుచుకుంది.
సంజీవరెడ్డికి కమ్యూనిస్టులంటేనే కడుపు మంట. అంతేకాదు. ఒకసారి 'కమ్యూనిస్టులని పాతి పెట్టాలని' ఒక పత్రికా ప్రకటననిచ్చాడు. 'వర్షం పడితే మంచి పంటలు పండుతాయని' శ్రీశ్రీ అప్పుడే చమత్కరించాడు. ఈ కారణాల వలన రాష్ట్ర రాజధానిని కర్నూలుకు తీసికెళ్ళాడు. అంతేకాదు అప్పుడు బళ్ళారి జిల్లాలో హాలహర్వి సీతారామిరెడ్డి అని ఒక కాంగ్రెస్ నాయకుడు ఉండే వాడు. ఆయన నెహ్రూగారికి అత్యంత సన్నిహితుడు. రాష్ట్ర రాజకీయాలలో ఏనాటికయినా తనకి గట్టి పోటీ అవుతాడేమోననే అనుమానంతో బళ్ళారి జిల్లాని బెంగళూరుకి ధారాదత్తం చేశాడు. ఈ పాపం సంజీవరెడ్డిదే. గజపతిరాజులు పర్లాకిమిడిని మింగితే సంజీవరెడ్డి రాయలసీమను చీల్చాడు.
ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయ చరిత్ర అంతా చిందరవందరగా ఉంది. తమిళనాడులాగా మన రాష్ట్రాన్ని కూడా 1956లో తెలుగునాడు అంటే బాగుండేది. 'విశాలాంధ్రలో ప్రజారాజ్యం' అని సుందరయ్య గారు రాసిన పుస్తకం 1946లో వేల కాపీలు అమ్ముడు పోయింది. విశాలాంధ్ర అనే మాటను కమ్యూనిస్టులు కామన్ చేశారు గనక సంజీవరెడ్డి ఆ మాట వాడకుండా ఆంధ్రప్రదేశ్ అన్నాడు.
ఆంధ్ర అనే పదం కన్నా తెలుగు అనే పదమే ప్రాచీనమైనది. కనక ఆంధ్ర అనే మాటని వాడుకలో నించి తొలగించి తెలుగు అనే మాటనే వాడాలి. అలాగే హైదరాబాద్ అనే మాటకి బదులు భాగ్యనగరం అని వాడాలి. ఈ మార్పులు వెంటనే అమలులోకి రావాలి. పరిసర ప్రాంతాలు చాలా పురాతనమైనవి. అక్కడి రాళ్ళు హిమాలయాల కన్న ప్రాచీనమైనవని విదేశీ పరిశీలకులు కొందరు తేల్చారు. ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల భాగ్యనగర ంపెరగలేదు. అభాగ్యుల, అనాధల, అనేకుల శ్రమ ఫలితమే మన భాగ్యనగరం.
పేర్ల మార్పులు వెంటనే జరగాలి. ఆంధ్ర, హైదరాబాద్ అనే మాటల బదులు తెలుగు, భాగ్యనగరం అమలులోకిరావాలి. తెలంగాణ రాష్ట్రం సూర్యబింబం లాగా వెలగాలి. రాయలసీమ పేరు అలాగే ఉండాలి. పదహారు జిల్లాలు కోస్తా సీమగా వెలుగొందాలి. ఆంధ్ర అనే పదం పనికి రాదు కనుక విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలని ఉమ్మడిగా కళింగ సీమ అనాలి. మధు రాంతకం రాజారాం ఒకసారి ఒక మాటన్నారు: 'తిరుపతిలో ఉన్న తెలుగు వాడికి తెనాలి నుంచి అటువైపుదంతా ఉత్తరాంధ్ర లాగానే అనిపిస్తుంది'. కనక కళింగ సీమ అనడం సరయినది.
తెలంగాణ వేరు పడ్డాక తక్కిన ప్రాంతాలకి బెజవాడే రాజధాని. దాన్ని విజయవాడ అనడం కూడా తప్పే. అటు ఇంగ్లీషు వ్యామోహం, ఇటు సంస్కృత వ్యామోహం ఇన్నాళ్లుగా మనని పట్టి పల్లారుస్తున్నాయి. వీటి పీడని వీలైనంత త్వరలో వదిలించుకోవాలి.
బెజవాడ రాజధానిగా కోస్తా సీమ రాష్ట్రం నెలకొనాలి. రాజధానికి బెజవాడలో చాలా వనరులున్నాయి. కనక దుర్గమ్మ వారధి దాటాక ఎపిఎస్‌పి బెటాలియన్ కు చెందిన 200 ఎకరాల ఫైరింగ్ రేంజ్; ఉడా పరిధిలో 200 ఎకరాలు; నాగార్జున యూనివర్శిటీలో 200 ఎకరాలు. యూనివర్సిటీ ఎదురుగా వేల అపార్టుమెంట్లు తయారగా ఉన్నాయి గవర్నమెంటు అధికారుల క్వార్టర్సు కోసం; కొండపల్లిలో వందలాది ఎకరాలు ఉన్నాయి (గవర్నమెంటువి); నూజివీడులో 3000 ఎకరాలున్నాయి-గవర్నమెంటువి. అవసరమయితే నాగార్జున విశ్వవిద్యాలయాన్ని ఒంగోలుకి తరలించవచ్చు .
'ఇంటెలిజెంటిల్ మెన్ అంతా
గుంటూరుపురంలోనే వుంటారని
కొందరంటారు
కాదని వాదుకొస్తే తంతారు
ఎందుకు బ్రదర్ మనకీ తంటాలు? '
కనక బెజవాడ రాజధానిగా గుంటూరులో హైకోర్టు పెట్టి వెంటనే తెలుగు సీమ రాష్ట్రాన్ని తక్షణం ఏర్పాటు చేయాలి.
-చలసాని ప్రసాద్
విప్లవ రచయితల సంఘం
- See more at: http://www.andhrajyothy.com/node/9462#sthash.j3mYhRao.dpuf

No comments:

Post a Comment