విభజన బిల్లు నెగ్గదు!
పార్లమెంటుకి వెళ్లినా లాభం లేదు..
రాజ్యాంగాన్ని కాదని ముందుకెళ్లలేరు
రాష్ట్రానికి మూడో అధికరణ కవచం.. కాదనగల బలం కాంగ్రెస్‌కు లేదు
జాతీయ పార్టీలూ బిల్లును వ్యతిరేకిస్తామనీ చెబుతున్నాయి
అసెంబ్లీని కాదంటే ప్రజలు పార్లమెంటునూ కాదంటారు
అన్ని అర్హత లతోనే ఉద్యోగంలో చేరా.. మీట్ ద ప్రెస్‌లో అశోక్‌బాబు
రాజ్యాంగాన్ని కాదని ముందుకెళ్లలేరు
రాష్ట్రానికి మూడో అధికరణ కవచం.. కాదనగల బలం కాంగ్రెస్‌కు లేదు
జాతీయ పార్టీలూ బిల్లును వ్యతిరేకిస్తామనీ చెబుతున్నాయి
అసెంబ్లీని కాదంటే ప్రజలు పార్లమెంటునూ కాదంటారు
అన్ని అర్హత లతోనే ఉద్యోగంలో చేరా.. మీట్ ద ప్రెస్‌లో అశోక్‌బాబు
హైదరాబాద్, అక్టోబర్ 12 ; రాష్ట్ర విభజన బిల్లు అసెంబ్లీకి రాకపోయినా పార్లమెంటులో మాత్రం పాస్ కాబోదని ఏపీ ఎన్జీవోల అధ్యక్షుడు పరుచూరి అశోక్‌బాబు ధీమా వ్యక్తం చేశారు. "రాజ్యాంగంలోని మూడో అధికరణ కింద రాష్ట్రాన్ని విభజించే అధికారం కేంద్రానికి ఉంది. కానీ, ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రత్యేకంగా రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లో ఉన్నాయి. వాటిని తొలగించాలంటే పార్లమెంటులో 2/3 వంతు మెజారిటీ అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత మెజారిటీ కాంగ్రెస్‌కు లేదు'' అని వివరించారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో శనివారమిక్కడ నిర్వహించిన మీట్ ద ప్రెస్‌లో అశోక్‌బాబు పాల్గొన్నారు. సమైక్య ఉద్యమాన్ని ఉద్యోగులుగా తాము ప్రారంభించగా, ఆర్టీసీ కార్మికులు, ఇతర ఉద్యోగులు అంచెలంచెలుగా వచ్చి చేరారని గుర్తు చేశారు. తమ ఉద్యమం రాష్ట్ర ప్రభుత్వంపై కాదని..కేంద్రం, రాజకీయ వ్యవస్థలకు మాత్రమే తాము వ్యతిరేకమని చెప్పుకొచ్చారు. అందువల్లే ప్రజా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం జోలికి పోలేదని వివరించారు.
"తెలంగాణ ఉద్యోగులు 42 రోజులు సమ్మె చేసినందువల్లే తెలంగాణ ప్రకటించలేదు. కొన్నేళ్ల ఉద్యమం తర్వాతనే ప్రకటించారు. అలాగే ఇప్పుడు మేము ప్రారంభించిన ఉద్యమాన్ని ఎన్నికల తర్వాత కూడా కొనసాగిస్తూనే ఉంటాం'' అని చెప్పారు. తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీల నేతలను, తెలంగాణ వాదులను కలసి రాష్ట్రం సమైక్యంగానే ఉంచేందుకు సహకరించాలని కోరతామని తెలిపారు. ప్రజలను ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశ్యంతోనే సమ్మెను తాత్కాలికంగా విద్యుత్ ఉద్యోగులు, టీచర్లు, ఆర్టీసి కార్మికులు వాయిదా వేశారన్నారు. విభజన బిల్లు అన్ని రకాల ప్రక్రియలను దాటుకుని పార్లమెంటుకు వెళుతుందనుకుంటే మళ్లీ వాళ్లంతా మెరుపు సమ్మెకు దిగుతారని చెప్పారు. విభజనపై న్యాయపోరాటం చేస్తామని, ఈ విషయంలో ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించేందుకు ఎన్నో రకాల అడ్డంకులు ఉన్నాయి..దాని కన్నా సమైక్యంగానే ఉంచడం మంచిదన్న అభిప్రాయాన్ని జాతీయ రాజకీయ పార్టీలు వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు. అంతేకాదు..పార్లమెంటులో బిల్లు పాస్ అయ్యే సమయంలో వ్యతిరేకంగా ఓటు వేస్తామని హామీ ఇచ్చాయని వివరించారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలన్నా విచక్షణ అవసరమని, అందుకని ఆ అవకాశమూ ఉండదన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులతో కలసి అన్ని రాజకీయపార్టీలూ ఒకటే అజెండాతో ముందుకు రాగా..సమైక్య ఉద్యమం ఇందుకు భిన్నంగా ఉందని అశోక్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ నేతలు తమ పదవులను పట్టుకుని వేలాడుతున్నారని అసహనం వెలిబుచ్చారు. తమ ఉద్యమం వల్లే సీడబ్ల్యూసీ తీర్మానం తర్వాత కేబినేట్ నోట్ తయారు కావడానికి రెండు నెలల సమయం పట్టిందని తెలిపారు. "సీడబ్ల్యుసీ నిర్ణయం తర్వాత సీమాంధ్ర ప్రజలు మౌనంగానే ఉంటారని కేంద్రం భావించింది. ఎవరూ తిరగబడరని అంచనా వేసింది. కానీ మా ఉద్యమంతో ఆ అభిప్రాయాన్ని తిరగరాశాం. విభజన నిర్ణయం పట్ల అన్ని పార్టీలు తప్పు చేశాయనే విషయం ఇప్పటికి ప్రజ లకు అర్థమైంది. ఎంపీలు, కేంద్రమంత్రులు, రాజకీయ నాయకులు పూర్తిగా విఫలమయ్యారు. వారిలో ఐకమత్యం లేదు. కొం తమంది ముందుకు వచ్చినా, వారిని కేంద్రం భయపెట్టి కట్టిపడేసింది'' అని ఆరోపించారు. భారత రాజ్యాంగం ఎంత బలమైనదో, సంప్రదాయాలు అంతే బలమైనవని చెప్పుకొచ్చారు.
"అసెంబ్లీ తీర్మానం అనేది లేకుండా విభజిస్తే భవిష్యత్‌లో సివిల్ వార్‌ను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసెంబ్లీ తీర్మానాన్ని పార్లమెంటు కాదంటే పార్లమెంటును ప్రజలు కాదంటారు. కేబినెట్ నోట్ వరకూ మేం ఉద్యమించాం. ఇక రాజకీయ నాయకుల వంతు. సీమాంధ్రకు సంబంధించి అన్ని పార్టీలతో కలిపి 159 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారందరికీ లేఖలు రాశాం. సమైక్య రాష్ట్రం కోసం కట్టుబడి ఉండాలన్న మా పిలుపునకు మంచి స్పందన లభిస్తున్నది. ఇదే విషయమై పార్టీ అధినేతలను కూడా కలుస్తాం. మాకు సహాయపడతారా లేదా అని అడుగుతాం. వారి స్పందనని బట్టి ఒక అంచనాకు వస్తాం '' అని వివరించారు.
విభజన అంశం, కేవలం తెలంగాణ వ్యక్తులకు రాజకీయ పదవి కోసమే ముందుకొచ్చిందని అభిప్రాయపడ్డారు. అందువల్ల తెలంగాణ వ్యక్తికి సీఎం పదవి ఇవ్వాలని అన్ని పార్టీలను కోరతామని చెప్పారు. దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగం సంపాదించారన్న ఆరోపణలను అశోక్‌బాబు తోసిపుచ్చారు. "1977లో సర్వీసులో ఉండగా మా నాన్న చనిపోయారు. అప్పుడు నేను ఇంటర్ పూర్తి చేశాను. కారుణ్య నియామకం కింద ఆయన ఉద్యోగం నాకిచ్చారు. నా పోస్టింగ్ విజయవాడలో. అయితే ఏపీఎన్జీవోలో ఆఫీస్ బేరర్‌ను కావడంతో, నాకు ఓడి అవకాశం ఉంది. అందుకే హైదరాబాద్‌లో ఉంటున్నా. అంతేతప్ప ఉద్యోగం గురించి నేను హైదరాబాద్ రాలేదు. నా సీనియారిటీ అంతా విజయవాడలోనే ఉంది. నా పోస్టింగ్‌కు, నేనిక్కడ ఉండటానికి ఏ సంబంధమూ లేదు. జీతం కోసమే ఇక్కడ ఉంటున్నాను''అని వివరించారు.
No comments:
Post a Comment