నీటి హక్కుల పునఃపంపిణీ - కె. బాలగోపాల్
ఎన్.టి.రామారావు ముఖ్యమంత్రి అయిన తరువాత రాయలసీమ నాయకులు ఆయన మీద బాగా ఒత్తిడి పెట్టారు. ఆయనకేమీ తెలియదు. తను దేవుడిని అనుకొనేవాడు ఆయన. అందుకే తనకు ఓటేశారని, తను ఏమైనా చెయ్యవచ్చని అనుకున్నాడు. రాజ్యాంగమూ, చట్టమూ, అవార్డుల వంటివి ఉన్నాయని పట్టించుకోలేదు ఆయన. బచావత్, తెలుగు పేరు కూడా కాదు అది, దేవుడి పేరు అసలే కాదు, ఎందుకు పట్టించుకోవాలి అనుకున్నాడేమో. అలాంటి ఎన్.టి. ఆర్.ను పట్టుకొని ఇదే రాజశేఖర రెడ్డి, ఇదే మైసూరా రెడ్డి, ఇదే రమణారెడ్డి, ఇవ్వాళ కొందరు కాంగ్రెసులో కొందరు టీడీపీలో, కొందరు ప్రజారాజ్యంలో ఉన్నారు గానీ, ఆనాడు వాళ్ళందరూ కూడా చాలా ఒత్తిడి పెట్టి మిగులు జలాలను కడప, కర్నూలు జిల్లాలకు కేటాయింపజేసుకున్నారు. ఆ జిల్లాలకు నీటి అవసరం లేదని నేను అనడం లేదు. వాస్తవంగా కూడా అవి బాగా వెనుకబడిన ప్రాంతాలు. అయితే మనం అక్రమంగా పోతే ఆ అక్రమాన్ని వేరే వాళ్ళు కూడా చేయగలరన్న విషయం మరచిపోకూడదు. అక్రమానికి ఎప్పుడూ నియమం ఉండదు. అది నియమ రహితంగా ఉండటం కూడా ప్రాంతీయ ద్వేషాలను రెచ్చగొడుతుంది...
దాంతో సహజంగానే మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుంచి డిమాండ్ వచ్చింది. నదికి అటువైపున రాయలసీమ అయితే ఇటువైపు తెలంగాణ. రాజకీయాలలో భాగంగా తెలంగాణ, రాయలసీమ అని చర్చిస్తున్నాం కానీ నైసర్గికంగా చూస్తే గోదావరి బేసిన్, కృష్ణా బేసిన్ అనేది సహజమైనటువంటి విభజన. కృష్ణా బేసిన్‌లోకి మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి కాక రాయలసీమలో కొంత భాగం వస్తుంది. రాయలసీమలోని మిగతా భాగం మొత్తం పెన్నా బేసిన్‌లో ఉంది. కానీ పెన్నానదిలో నీళ్ళు చాలా తక్కువ కాబట్టి రాయలసీమ వాళ్ళు ఎప్పుడూ కూడా కృష్ణానది నుంచి నీళ్ళు తీసుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. వేరే మార్గం లేదు కూడా. అనుసరించే పద్ధతుల పట్ల కోపమే తప్ప తీసుకోవడానికి వీలులేదు అంటే క్షామమూ, చావులూ తప్ప ఏమీ ఉండవు రాయలసీమలో. అందుకనే 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు అంటే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం వేరు కావాలనే డిమాండ్ వచ్చినప్పుడు రాయలసీమ వాళ్ళకు చాలా అనుమానం ఉండింది. ఎందుకంటే అంతకు ముందు బ్రిటిషు వాళ్ళు ఏం చేశారంటే కృష్ణానది పైన రాయలసీమ ప్రాంతంలో పెద్ద డ్యాం కట్టి వాళ్ళకు నీళ్ళిచ్చుకుంటూ తమిళనాడుకు నీళ్ళు తీసుకుపోవాలనే ఆలోచన చేశారు. తమిళనాడు వాస్తవానికి మనకంటే వర్షాభావ రాష్ట్రం. ఒక్క తంజావూరు దగ్గరున్న కావేరి డెల్టా తప్ప మిగతా రాష్ట్రం అంతా చాలా వెనుకబడి ఉంటుంది. ఇతరత్రా వాళ్ళు -ముఖ్యంగా ఇండ్రస్టియల్‌గా -చాలా డెవలప్ అయ్యారు. అది వేరే విషయం.
వాళ్ళకున్నటువంటి అడ్మిన్రిస్టేటివ్ యోగ్యత వల్ల వాళ్ళు బాగుపడ్డారే కానీ వర్షం రీత్యా చూస్తే చాలా వర్షాభావం ఉన్న రాష్ట్రం తమిళనాడు. అప్పటి మద్రాసు రాష్ట్రం ఏమి ఆలోచన చేసిందంటే రాయలసీమలో ఎక్కడో ఒక చోట పెద్ద డ్యాం ఒకటి కట్టి రాయలసీమకు కొంత ఇస్తూ తమిళనాడుకు ఎక్కువ నీళ్ళు తీసుకెళ్ళాలని. మద్రాసు రాష్ట్రంలో ఉంటేనే ఆ నీళ్ళు మాకు వస్తాయి. ఆంధ్రులతో కలిస్తే, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే మాకు అవి ఇవ్వరు అన్నటువంటి సందేహం ఆ రోజు రాయలసీమ నాయకులలో ఉండింది. కాబట్టే వాళ్ళు ఒత్తిడి పెట్టారు. కృష్ణానది జలాలలో రాయలసీమ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇస్తేనే ప్రత్యేక ఆంధ్రా రాష్ట్రానికి మేము ఒప్పుకుంటాం, లేకపోతే ఒప్పుకోమని వాళ్ళు అప్పుడు గొడవ పెట్టారు. అప్పుడు కుదరిన ఒప్పందాన్నే శ్రీ బాగ్ ఒడంబడిక అంటారు. శ్రీబాగ్ అనేది ఒక నాయకుడి ఇల్లు. ఆ ఇంటిపేరు అది. అక్కడ ఒక అగ్రిమెంట్‌లా జరిగింది. ఆంధ్రా ప్రాంత నాయకులు అంటే సర్కారు జిల్లాల నాయకులు, కృష్ణానది జలాల వినియోగంలో రాయలసీమ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామనే హామీ ఇచ్చే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు వారిని ఒప్పించటం జరిగింది. మళ్ళీ 1956లో తెలంగాణ వాళ్ళూ అదే అడిగారు. ఆంధ్రనాయకులు మళ్ళీ అదే హామీ ఇచ్చారు. రాయలసీమ అవసరాలకు మొదటి ప్రాధాన్యం ఇస్తామని వాళ్ళకు 1953లో హామీ ఇచ్చి, మీకే మొదటి ప్రాధాన్యం ఇస్తామని 1956లో తెలంగాణ వాళ్ళకు చెప్పి, చివరికి ఇద్దరికీ ఇవ్వకుండా సర్కారు జిల్లాలకు నీళ్ళు వాడుకోవడం కొనసాగించారన్నది వాస్తవం...
రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ఏం చేశాడంటే పునాదిరాళ్ళు వేసినటువంటి మిగులు జలాల ప్రాజెక్టులన్నిట్నీ కట్టడం మొదలుపెట్టాడు. అవి తెలుగు గంగ కాక మరి ఏడు ఉన్నాయి. వాటన్నిటికీ నీళ్ళు ఇవ్వాలంటే కర్ణాటక, మహరాష్ట్రలకు పూర్తిగా మానేసి మనమే తీసుకోవాలి కృష్ణానది నీళ్ళన్నీ. ఆ ఎనిమిది ప్రాజెక్టులు ఏమిటీ అంటే మహబూబ్‌నగర్‌కు రెండు-నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం. భీమా ఏమో అంతకు ముందే ఆదా చేశాము నీళ్ళు అని చెప్పి తెచ్చుకున్న ప్రాజెక్టు. అనుమతి తెచ్చుకుంది 1980లలో అయితే 2008లో మొదలుపెట్టారు దానిని కట్టడం. కోపాలు వస్తాయంటే రాకుండా ఉంటాయా? అదే రాయలసీమకు నీళ్ళు తీసుకెళ్ళే శ్రీశైలం కుడిగట్టు కాలువ మాత్రం దాదాపు పూర్తి అయిపోయింది. నాలుగైదు సంవత్సరాలలో పూర్తి చేసుకున్నారు దానిని. భీమా నిజానికి నికర జలాల ప్రాజెక్టే. అయినా తెలుగు గంగ తరువాతే మొదలుపెట్టారు దానిని. నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు కాక నల్గొండ జిల్లాకు శ్రీశైలం ఎడమ గట్టు కాలువ అనే ప్రాజెక్టు ఒకటి, నాగార్జునసాగర్ వద్ద ఎలిమినేటి మాధవరెడ్డి కాలువ అనే ప్రాజెక్టు ఇంకొకటి కట్టడం మొదలుపెట్టారు. ఇవి నాలుగూ తెలంగాణకు.
రాయలసీమకూ ఇంకో రెండున్నాయి. అన్నీ శ్రీశైలం నుంచే మొదలవుతాయి. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలంటే వేరే మార్గమేమీ లేదు. ఒకటి హంద్రీ-నీవా ప్రాజెక్టు. ఇది కర్నూలు మీదుగా అనంతపురం జిల్లాకు నీళ్ళు తీసికెళ్ళే ప్రాజెక్టు. ఇంకొకటి గండికోట లేక గాలేరు-నగరి. కడప జిల్లాకు పోతుంది. తెలుగు గంగ ముందే ఉంది. కాబట్టి తెలుగు గంగ, హంద్రీ-నీవా, గండికోట లేక గాలేరు-నగరి మొత్తం మూడు అయ్యాయి. అవి మూడూ రాయలసీమకు అయితే ఇంకొకటి ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, కంభం ప్రాంతాలకు నీళ్ళు తీసుకెళ్ళే వెలిగొండ ప్రాజెక్టు. ఈ ప్రాంతం బాగా వెనుకబడినటువంటి కరువు ప్రాంతం. అంటే మిగులు జలాల మీద మొత్తం ఎనిమిది ప్రాజెక్టులు. ఒకొక్కదానికి నలభై, నలభైఅయిదు, యాభై టీయంసీలు... స్థానిక ఎమ్మెల్యే ఇష్టం, ఎంతైనా ప్రామిస్ చేస్తాడు. అతనికేమీ ఇబ్బంది లేదు. వాటన్నిటినీ పూర్తి చేయాలంటే 300, 350 టీయంసీల నీళ్ళు కావాలి. మనకేమో చుక్కలేదు. మనకిచ్చిన 800 టీయంసీలు అయిపోయినాయి కదా.అయినా ఈ ప్రాజెక్టులన్నీ కడుతున్నారు. మేము మొదటి నుంచీ చెపుతున్నది ఏమిటంటే, అన్నీ కరువు ప్రాంతాలే, నీళ్ళు కావల్సిన ప్రాంతాలే, ఇవ్వడం అవసరమే. కానీ సవ్యమైన మార్గం అనుసరించు అని...
2000 సంవత్సరంలో బచావత్ అవార్డు టైము అయిపోయినప్పుడు కర్ణాటక మన మీద ఫిర్యాదు చేసింది. అప్పటికి ఇంకా రాజశేఖరరెడ్డి హయాం మొదలుకాలేదు కానీ, చంద్రబాబునాయుడు నాగార్జున సాగర్ మీద ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టును మొదలుపెట్టాడు. బచావత్ అవార్డుకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలతో ప్రాజెక్టు కట్టేసుకుంటున్నదని కర్ణాటక ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఒక ట్రిబ్యునల్‌ను నియమించింది. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి బ్రిజేశ్ కుమార్‌ను ట్రిబ్యునల్ చైర్మన్‌గా నియమించింది. కర్ణాటక మొట్టమొదట వేసిన అప్లికేషన్ ఏమిటీ అంటే ఈ ఎనిమిది ప్రాజెక్టులను ఆపమని ఆదేశం ఇవ్వండీ అని. కారణం "because it is contradictory to bachawat award''. ఏం చెప్పారు మనవాళ్ళు? ఆ 8 ప్రాజెక్టులకూ మేము నీటి హక్కులు అడగము. ఉంటే తీసుకొంటాము లేకపోతే లేదు అని చెప్పారు. దాంతో ట్రిబ్యునల్ కర్ణాటక అప్లికేషన్‌ను డిస్‌మిస్ చేసింది. మన పేపర్లో వార్త ఏమొచ్చింది? కర్ణాటక వాళ్ళ అభ్యర్థనను త్రోసిపుచ్చిన బ్రిజేశ్‌కుమార్ కమిషన్ అని. ఏమి తోసిపుచ్చింది అనంటే ఆంధ్రప్రదేశ్ 'అక్రమంగా కట్టుకుంటున్న ప్రాజెక్టులు ఆపండీ' అని వాళ్ళంటే మన వాళ్ళు 'మేము హక్కులు అడగం కదా ఎందుకు ఆపాలి' అన్నారు. దానితో డిస్‌మిస్ చేశారు. లా లో దీన్నిinfructuous application అంటారు. హక్కులు అడగని విషయం కాబట్టి, అందులో చట్టం నిర్ణయించాల్సిన అంశమేమీ లేదు కాబట్టి దాన్ని డిస్మిస్ చేశారు బ్రిజేశ్‌కుమార్ గారు.దీన్ని పట్టుకుని 'కర్ణాటక వాళ్ళ అభ్యర్థనను తోసిపుచ్చిన రెండవ కృష్ణా ట్రిబ్యునల్ ' అని పేపర్లో వార్తలు రాసుకున్నాం మనం.
ఇవ్వాళ పరిస్థితి ఏమిటి? ఈ ట్రిబ్యునల్ అవార్డు ముప్పై ఏళ్ళో నలభై ఏళ్ళో అమలులో ఉంటుంది. అంటే కరువు ప్రాంతాల కోసం తాము కడుతున్న ప్రాజెక్టులకు ముప్పై నలభై ఏళ్ళ వరకు ఎలాంటి నీటి హక్కులుండవు అని ఒప్పుకొని వచ్చాడు రాజశేఖర రెడ్డి. దురదృష్టం ఏమిటంటే ఈ ఎనిమిది ప్రాజెక్టులలో నాలుగు తెలంగాణలో, మూడు రాయలసీమలో, ఒకటి ఆంధ్రాలో ఉన్నా, ప్రాంతీయ వైషమ్యాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే ఈ మూడు ప్రాంతాలలో ఏ ఒక్కటీ దీని గురించి మాట్లాడడం లేదు. వీళ్ళందరూ ఒకటిగా ఉండి ఉంటే ఈ ఎనిమిది ప్రాజెక్టుల ఆయకట్టుదారులు- అంటే ఈ ఎనిమిది ప్రాజెక్టుల ద్వారా నీళ్ళు పొందబోయే రైతాంగం అంతా కూడా ముందుకు వచ్చి ఆందోళన చేయగలిగి ఉండేది. ఎవ్వరూ మాట్లాడకపోవడం వల్ల రాజశేఖరరెడ్డిగారే దానిని అవార్డు చేసి వెనక్కి రాగలిగారు.
మరైతే ఏం చేయాలి అన్న ప్రశ్న వస్తుంది. నికర జలాలు లేవని మీరే అంటున్నారు. ఇవి కరువు ప్రాంతాలని కూడా మీరే అంటున్నారు. ఆయన ఏదో ఒక రకంగా మిగులు జలాల పేరు మీద ప్రాజెక్టులు కట్టేసి అప్పుడప్పుడైనా నీళ్ళు ఇస్తానంటే అదీ వద్దంటున్నారు. అనవసరంగా ఖర్చు అంటున్నారు, మరేం చేయాలి అని మమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేయవచ్చు. దీనికి మేము మొదటినుంచి చెప్తున్న జవాబు ఏమిటంటే, ఇంతవరకు నేను వాస్తవాలు చెప్పుకుంటూ వచ్చాను. ఇక్కడ మా మానవ హక్కుల వేదిక తరఫు నుంచి మేము చెప్తున్న జవాబు ఏమిటీ అంటే నీటి హక్కుల్ని పునఃపంపిణీ చేద్దాం అని ఏరకంగా చేయాలనేది మళ్ళా చెపుతాను మనకొచ్చిన 800టీయంసీల కేటాయింపు ఇవ్వాళ ఏ రకంగా హక్కులుగా వాడుకోబడుతున్నాయో, అంటే కృష్ణా డెల్టాకు ఇంత, నాగార్జునసాగర్‌కు ఇంత... అలా ఆ కేటాయింపును పునః పంపిణీచేస్తే ఒక 200టీయంసీలను మిగిలించవచ్చు. ఆ 200 టీయంసీలతో ఈ ఎనిమిది ప్రాజెక్టులకు 25, 30 టీయంసీల చొప్పున నీళ్ళు ఇచ్చినా కూడా ఉపయోగమే. ఒక లక్షా యాభైవేల ఎకరాలకో, 2 లక్షల ఎకరాలకో ఆరు తడి పంటకైనా నీళ్ళొస్తాయి. ఆ మేరకైనా నీళ్ళుంటాయి. తాగు నీటికైనా వస్తాయి. ఇదీ మా ప్రతిపాదన.
- కె. బాలగోపాల్
(2009 జూన్ 27న మానవహక్కుల వేదిక విశాఖపట్నం జిల్లా సభల సందర్భంగా చెప్పిన 'జలపాఠాలు'లోని కొన్ని భాగాలు ఇవి)
(నేడు బాలగోపాల్ నాల్గవ వర్ధంతి)
- కె. బాలగోపాల్
(2009 జూన్ 27న మానవహక్కుల వేదిక విశాఖపట్నం జిల్లా సభల సందర్భంగా చెప్పిన 'జలపాఠాలు'లోని కొన్ని భాగాలు ఇవి)
(నేడు బాలగోపాల్ నాల్గవ వర్ధంతి)
No comments:
Post a Comment