Thursday, 17 October 2013

విద్వేషాగ్నుల్లో నదీజలాలు - టి. లక్ష్మీనారాయణ

విద్వేషాగ్నుల్లో నదీజలాలు - టి. లక్ష్మీనారాయణ

Published at: 18-10-2013 01:00 AM
 New  0  0 
 
 

రాష్ట్ర విభజనపై జరుగుతున్న చర్చల్లో అంతర్భాగంగా నీటి సమస్యపై కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును తిరగదోడి, నీటి కేటాయింపులను ప్రాంతాల మధ్య పునఃపంపిణీ చేయాలని కొందరు అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నారు. సాధారణ వర్షపాతం మాత్రమే నమోదైన సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌కు జరిగే నష్టాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా డా.యం.వి. రమణారెడ్డి వంటి వారు ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంపును సమర్థించే ధోరణిలో ఆంధ్రజ్యోతిలో ఇటీవల వ్యాసం రాశారు. మరికొందరు నాలుకపై తేనె రాసుకొని తేనెలొలికిస్తూనే విద్వేషం వెళ్ళగక్కుతూ, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ, నీటి సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. ఆ కోవకుచెందిన కొన్నింటిపై స్పందించి ఈ వ్యాసం రాస్తున్నాను. కేంద్ర జలసంఘం మాజీ సభ్యులు, ఆర్. విద్యాసాగర్ రావు ఆంధ్రజ్యోతి దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ 'రాయలసీమకు న్యాయం చేయాలి' అన్న శీర్షికతో 2013 జూలై 22న ప్రచురించబడింది. అది ఆయన అభిమానులను గందరగోళానికి గురిచేసిందని వాపోతూ, 'నా వైఖరి మారలేదు' అన్న శీర్షికతో (ఆంధ్రజ్యోతి, ఆగస్టు 24) ఒక వ్యాసం రాశారు. అందులో కొన్ని చారిత్రక సత్యాలను, అర్ధ సత్యాలను ఉటంకిస్తూ సమస్యను 'మసిపూసి మారేడుకాయ' చేసే ప్రయత్నం చేస్తూ రాయలసీమ ప్రాంతం, ప్రకాశం జిల్లాకు తీవ్ర అన్యాయం చేసే ప్రయత్నం చేశారు.
(1) శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (యస్.ఆర్.బి.సి.)కి కేటాయించిన 19 టీఎంసీల నికర జలాలను వివాదాస్పదం చేసే ప్రయత్నం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ప్రామాణికంగా కృష్ణా నదిలో లభించే 2130 (2060+70పునరుత్పత్తి) నికరజలాలలో మన రాష్ట్రానికి 811(800+11 పునరుత్పత్తి) టీఎంసీలను కేటాయించింది. ఆ తీర్పు మేరకు తెలంగాణకు 266.86 టీఎంసీలు, కోస్తాకు 377.47 టీఎంసీలు, రాయలసీమకు 122.7 టీఎంసీలు దక్కాయి. 'రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపుల్లో స్వల్పంగా మార్పులు చేసింది. ఉదాహరణకు కేసీ కాలువ కేటాయింపుల్లో 8 టీఎంసీలు తగ్గించి, 11 టీఎంసీల రిటర్న్ ఫ్లోస్ వాటా సీమకు బదలాయించి వెరసి 19 టీఎంసీల నీటిని చూపించి శ్రీశైలం కుడిగట్టు కాలువకు కేంద్రం అనుమతి సంపాదించడం జరిగింది. ఇప్పుడు సీమకు లభించిన నికరజలాల కేటాయింపు 144.70 టీఎంసీలు' అని విద్యాసాగర్ రావు పేర్కొన్నారు. 'పరీవాహక ప్రాంతం దృష్ట్యా చూస్తే కృష్ణా బేసిన్‌లో సీమ 18.39 శాతం, పరీవాహక క్షేత్రం దృష్ట్యా సీమకు స్వల్పంగా వాటా తగ్గింది' అని కూడా చెప్పారు.
ఆ మాటంటూనే ఆయన ఎంతటి విశాల హృదయులంటే జల విద్యుత్ ప్రాజెక్టయిన శ్రీశైలం జలాశయం వద్ద ఆవిరి నష్టం పద్దు క్రింద బచావత్ ట్రిబ్యునల్ పేర్కొన్న 33 టీఎంసీలను నిష్పక్షపాతంగా కోస్తా, రాయలసీమ, తెలంగాణ, మూడు ప్రాంతాల మధ్య సమానంగా విభజించి, 11 టీఎంసీలను రాయలసీమ పద్దుకు జమ చేశారు. మరొకవైపున 19 టీఎంసీల నికరజలాల కేటాయింపుతో, కేంద్ర జల సంఘం ఆమోదంతో నిర్మించబడుతున్న శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్.ఆర్.బి.సి.)కు 11 టీఎంసీలను మాత్రమే శ్రీశైలం జలాశయం నుంచి తీసుకోవడానికి వీలుందని చెప్పకనే చెబుతూ, అలా సీమకు లభించిన నికర జలాలను 122.70+11+11=144.70 టీఎంసీలుగా తేల్చేశారు. మరి మిగిలిన 8 టీఎంసీల నీరెక్కడి నుంచి యస్.ఆర్.బి.సి.కి సరఫరా కావాలో ఆ సాగునీటి రంగ నిఫుణుడు ప్రస్తావించలేదు. కానీ తన ఇంటర్వ్యూలో మాత్రం 'రాయలసీమ కేటాయింపులలో ప్రధానంగా తుంగభద్ర నుంచి వచ్చే వాటా కాకుండా ట్రిబ్యునల్ తదనంతరం 'పోతిరెడ్డిపాడు' నుంచి కేంద్రం నుంచి అనుమతి పొందిన మరో 19 టీఎంసీలు శ్రీశైలం కుడి గట్టు కాలువకు కూడా దక్కుతాయి. అదనంగా మరో 15 టీఎంసీలు చెన్నైకి తాగునీటి కోసం కేటాయించడం జరిగింది. అంటే ఈ 34 టీఎంసీలు తప్ప మరో చుక్క కూడా నికర జలాల రూపంలో పోతిరెడ్డి పాడు ద్వారా విడుదలయ్యే అవకాశం లేదని' కరాఖండిగా చెప్పిన ఆయన ఆ మాటను కూడా మార్చేసి యస్.ఆర్.బి.సి.కి శ్రీశైలం నుంచి 11 టీఎంసీలకే అర్హతని రాశారు. శ్రీశైలం నిర్మాణంతో కె.సి.కెనాల్ ఆయకట్టులో కొంత భాగం ముంపునకు గురయ్యిందన్న విషయాన్ని ఇక్కడ గుర్తించాలి.
(2) విద్యాసాగర్ రావు వాదనలు చూస్తే రాష్ట్ర ప్రభుత్వం గతంలో చేసిన మరికొన్ని నీటి సర్దుబాట్లను కూడా ప్రశ్నార్థకం చేసే అవకాశం ఉంది. నిత్య కరవులతో సతమతమవుతున్న అనంతపురం జిల్లా దాహార్తిని తీర్చడానికి, తుంగభద్ర జలాశయం నుంచి కె.సి.కెనాల్‌కు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 10 టీఎంసీల నికర జలాలను పెన్నా అహోబిలం రిజర్వాయరు (పి.ఎ.బి.ఆర్)కు ఇచ్చి, ఆ మేరకు శ్రీశైలం జలాశయం నుంచి కె.సి. కెనాల్‌కు సర్దుబాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేసి, ఏకాభిప్రాయాన్ని సాధించిన తరువాతే పై నీటి సర్దుబాటు చేసింది. విద్యాసాగర్ రావు మాటే చెల్లుబాటై గతంలో రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు రద్దయితే ఈ 10 టీఎంసీల నీరు శ్రీశైలం జలాశయం నుంచి కె.సి.కెనాల్‌కు సరఫరా కాదు. తత్ఫలితంగా తుంగభద్ర జలాశయం నుంచి పెన్నా అహోబిలం రిజర్వాయరుకు చేసిన నీటి సర్దుబాటు రద్దవుతుంది. మరి ఎడారి చాయలు పొడ చూపుతున్న, రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడ్డ అనంతపురం జిల్లా భవిష్యత్తు ఎలా ఉంటుందో? ఆ సాగు నీటి నిపుణుడే సెలవిస్తే బాగుంటుంది.
(3) కృష్ణా డెల్టా ఆధునికీకరణ ద్వారా ఆదా అయ్యే 20 టీఎంసీల నికర జలాలను మహబూబ్‌నగర్ జిల్లాలో నిర్మాణంలో ఉన్న భీమా ఎత్తిపోతల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం సర్దుబాటు చేయడం ద్వారా కేంద్ర జలసంఘం అనుమతి పొందింది. కానీ కృష్ణా డెల్టా ఆధునికీకరణ మాత్రం జరగలేదు. ఈ విషయాన్నీ గమనంలో ఉంచుకోవాలి.
(4) కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి మహానది, గోదావరి నదుల అనుసంధానం ప్రక్రియ ద్వారా కొన్ని మిగులు జలాలు తరలించడం ఒక్కటే మిగిలి ఉన్న ఏకైక పరిష్కారమని సెలవిచ్చారు. మంచిదే. మరి, దానికంటే సులువైన గోదావరి-కృష్ణా - పెన్నా నదుల అనుసంధానానికి ఎందుకు మోకాలడ్డుతున్నారు? ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో సాకారం చేసుకోవచ్చు కదా? దానికి దోహదపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకోవడానికి సర్వశక్తులు ఉపయోగిస్తూ, నదుల అనుసంధానం గూర్చి మాట్లాడడం సబబేనా?
(5) కరవుకు ఆటపట్టుగా మారిన వెనుకబడ్డ రాయలసీమ నీటి సమస్యపై మొసలి కన్నీరు కార్చిన విద్యాసాగర్ రావు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44,000 క్యూసెక్కులు విస్తరించడం ద్వారా కృష్ణా నదినే రాయలసీమ ప్రాంతానికి మళ్ళించుకు పోతున్నారన్నంత ఆగిత్తంగా మాట్లాడారు. సీమ వాసులు నీటి దొంగలని మాట్లాడుతున్నారు. గడచిన నెల రోజులుగా శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలుగా నీటితో తొణికిసలాడుతున్నాయి. మరొకవైపున అమూల్యమైన నీరు భారీగా ప్రకాశం ఆనకట్ట నుంచి పొంగిపొర్లుతూ సముద్రంలో కలిసిపోతున్నది. కానీ తెలుగు గంగలో అంతర్భాగంగా నిర్మించిన వెలుగోడు (17 టీఎంసీలు), బ్రహ్మంగారి మఠం (17 టీఎంసీలు) రిజర్వాయర్లలో నీటిని నింపుకోలేక పోయాము. పెన్నా నదిపై నిర్మించిన గండికోట, సోమశిల, మద్రాసుకు, తిరుపతికి తాగునీటిని, శ్రీకాళహస్తి ప్రాంతంలో సాగునీరు అందించడానికి వీలుగా నిర్మించిన కండలేరు జలాశయానికి నీటిని తరలించుకోలేక పోయాము.
(6) రాయలసీమ ప్రజలు నీటి కోసం దేహీ అని శరణు జొస్తే కోస్తా, తెలంగాణ ప్రాంత ప్రజలు దయతలిచి కొన్ని నీళ్ళు ఇవ్వవచ్చు అం టూనే, తెలంగాణ ప్రాంతం వాళ్ళు నీళ్ళిచ్చే అవకాశం ఏమాత్రం లేదని నిర్మొహమాటంగా చెప్పేశారు. నాగార్జునసాగర్ కుడి కాలువ ఆధునికీకరణ ద్వారా నీటిని ఆదా చేసి, అలాగే కృష్ణా డెల్టాకు కేటాయించిన నీటిలో కొంత భాగాన్ని కోస్తా ప్రాం తం వారు కనికరించి ఇస్తే ఇవ్వవచ్చని హేళనగా వ్యాఖ్యానించారు. లేదా దుబాయ్‌లా బ్రతకొచ్చని ఎద్దేవా చేశారు. ఈ మాటలు నీటి సమ స్య పరిష్కారానికి దోహదపడతాయా! లేదా! మరింత జటిలం చేయడానికి ఉపకరిస్తాయో! విజ్ఞులు ఆలోచించాలి.
(7) నదీ పరివాహక ప్రాంత అవసరాలు తీరిన తరువాత, ఇంకా నీళ్ళు (నికర/మిగులు) మిగిలి ఉంటేనే మిగతా అవసరాలు తీర్చాల్సి ఉంటుందని మాట్లాడుతున్నారు. అది జాతీయంగా, అంతర్జాతీయంగా అమలులో ఉన్న న్యాయ సూత్రమే. దాన్ని ఉల్లంఘించాలని ఎవరూ కోరడం లేదు. కానీ కొందరు ప్రాంతీయ కోణంలోనే నీటి సమస్యను చూస్తూ పాక్షిక దృష్టితో అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉండే యస్.యల్.బి.సి., కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టుల అవసరాలకు ముందుగా కేటాయింపులు జరగాల్సి ఉంటుందని, పరివాహక ప్రాంతం బయట ఉన్న వెలిగొండ, హంద్రీ-నీవా, గాలేరు-నగరిలకు ఆ తరువాతే కేటాయింపులు చేయా ల్సి ఉంటుందని వాదిస్తున్నారు. యస్.యల్.బి.సి., కల్వకుర్తి, నెట్టెంపాడులకు మాత్రమే పోలవరం నిర్మాణం ద్వారా లభించే 45 టీఎంసీలను కేటాయించాలన్న డిమాండ్ సమంజసమని అనిపించుకొంటుందా?
(8) నదీ పరివాహక ప్రాంతంలో పైనున్న ప్రాంతాలు నీటిని వాడుకొన్న తరువాతే దిగువ ప్రాంతాలకు నీరందుతుందని విద్యాసాగర్ రావు మరికొందరు వాదిస్తున్నారు. ఇది ఏ న్యాయ సూత్రాలకు అనుగుణమైనది. పైపెచ్చు ఈ వాదన చాలా ప్రమాదకరమైనది. ఈ వాదనే చెల్లుబాటైతే, దిగువనున్న ప్రాంతాలు ఎడారి కాక ఏమవుతాయి? నిజమే, కృష్ణా నదీ జలాల పంపకం పరివాహక ప్రాంతాల ప్రాతిపదికన జరగకపోవడంతో తెలంగాణకు ఎక్కువ నష్టం, రాయలసీమకు కొంత నష్టం జరిగిందన్న భావన ఉన్నమాట వాస్తవం. కానీ, బచావత్ ట్రిబ్యునల్ తీర్పును మార్చే అవకాశమే లేదు కదా! మరి, ఆ తీర్పును సక్రమంగా అమలు చేయడానికి వీలుగా లోతైన అధ్యయనం తరువాత శ్రీశైలం జలాశయం వద్ద నీటి వినియోగానికి సంబంధించి నిర్దిష్టమైన విధి, విధానాలతో 1996 జూన్ 15న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో యం.యస్. నెం. 69లో పొందుపరచిన ప్రాధాన్యతా క్రమంలో నీటిని అందజేయడానికి ఆటంకాలు కల్పించకూడదు కదా? ఒకవేళ ఉల్లంఘిస్తే కొరివితో తల గోక్కోవడమే అవుతుంది.
(9) రాష్ట్రం కలిసున్నా, విడిపోయినా ట్రిబ్యునల్ కేటాయించిన 133.7 టీఎంసీలకు మించి రాయలసీమకు తరలించడానికి వీల్లేదని హూంకరిస్తున్నారు. అలాగే 11 టీఎంసీలకు మించి ఒక్క నీటి బొట్టును కూడా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తీసుకువెళ్ళడానికి అర్హత లేదని విద్యాసాగర్ రావు పదేపదే మాట్లాడడంతో రాయలసీమ వాసుల్లో భయాందోళనలు పెల్లుబుకుతున్నాయి. ఆ మాటకొస్తే! ఆ 11 టీఎంసీలకు కూడా భవిష్యత్తులో అభ్యంతరం పెట్టరనే గ్యారంటీ లేదు. కారణం, ఆ నీటి కేటాయింపు బచావత్ ట్రిబ్యునల్ చేసింది కాదు. ట్రిబ్యునల్ తదనంతర కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భీమా ప్రాజెక్టుకు లాగే యస్.ఆర్.బి.సి.కి కూడా సర్దుబాటు ద్వారా చేసిన కేటాయింపే.
10) రాయలసీమ ప్రాంతం కృష్ణా నదీ పరివాహక ప్రాంతం కాదని కొందరు అవగాహనారాహిత్యంతో మూర్ఖంగా వాదిస్తుంటారు. అలాంటి వారు కొందరు రాజకీయ నాయకులుగా కూడా చలామణి అవుతున్నారు. కృష్ణా నదికి తుంగభద్ర నది ఉపనదన్న కనీస పరిజ్ఞానం, కర్నూలు, అనంతపురం జిల్లాలు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయన్న తెలివి కొందరిలో కొరవడింది. రాయలసీమ వాసులు తమకు అడుగడుగునా అన్యాయాలే జరిగినా, తెలుగు జాతి ఉమ్మడి ప్రయోజనాల కోసం అపారమైన త్యాగాలు చేశారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమం సందర్భంలో 1937 సంవత్సరంలో జరిగిన పెద్ద మనుషుల ఒప్పందం 'శ్రీబాగ్ ఒడంబడిక' కాలగర్భంలో కలిసిపోయింది. కృష్ణా, తుంగభద్ర నదీ జలాల వినియోగంలో ప్రథమ ప్రాధాన్యతనిస్తామని అందులో లిఖిత పూర్వకంగా వాగ్దానం చేసి మొండి చేయి చూపెట్టారు. 1951లో కేంద్ర ప్రణాళికా సంఘం ఆమోదం కూడా పొందిన కృష్ణా-పెన్నార్ ప్రాజెక్టు ద్వారా ఏడున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు లభించే సువర్ణావకాశం తలుపుతట్టినా సీమవాసులు తృణప్రాయంగా త్యాగం చేశారు. సిద్ధేశ్వరం, గండికోట జలాశయాన్ని జల విద్యుత్ ప్రాజెక్టుగా నిర్మించి తీరని ద్రోహం చేశారు. అనంతర కాలంలో ప్రజల పోరాట ఫలితంగా దాన్ని సాగునీటి ప్రాజెక్టుగా మార్చారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా ఆంధ్ర రాష్ట్రం ఆవిర్భవించడంతో రాయలసీమలో అంతర్భాగంగా ఉన్న బళ్ళారితో పాటు తుంగభద్ర జలాశయాన్ని కోల్పోయారు. రాయలసీమ ప్రజలను నీటి దొంగలుగా చిత్రీకరించే ఉన్మాదం కొందరిలో ప్రకోపించింది. కనీసం సాగు నీటి రంగ నిపుణులైనా సంకుచిత భావాలకు బానిసలు కాకుండా నిత్యం కరువు బారిన పడుతున్న ప్రాంతాల నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారాలను సూచించాలే గానీ, ప్రాంతీయ దురభిమానంతో మాట్లాడడం సముచితం కాదు.
- టి. లక్ష్మీనారాయణ
డైరెక్టర్, నీలం రాజశేఖర రెడ్డి పరిశోధనా కేంద్రం
- See more at: http://www.andhrajyothy.com/node/11514#sthash.k9gyo9bN.dpuf

No comments:

Post a Comment