Friday 18 October 2013

371 అధిక'రణం'!

371 అధిక'రణం'!

Published at: 19-10-2013 04:16 AM
 4  0  1 
 
 

అధికరణ విభజనకు అడ్డంకి అవుతుందా?..రద్దు లేదా సవరిస్తే తెలంగాణ రాష్ట్రమా!
371(డి)పై భిన్నమైన వాదనలు..సవరించకుండా ప్రక్రియ పూర్తికాదనే అభిప్రాయం
(హైదరాబాద్ , అక్టోబర్ 19):1975 అక్టోబర్ 18.... ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీలకు సంబంధించి అన్ని ప్రాంతాల వారికి రక్షణ కల్పిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయిన రోజు ఇది! ఇప్పుడు... 38 సంవత్సరాల తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వులు, వాటికి ప్రాతిపదిక అయిన 371(డి) అధికరణపై రాష్ట్రంలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. కారణం... ఆంధ్రప్రదేశ్ విభజనకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడమే! రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి అత్యంత కీలకమైన అంశంపై ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తున్నారు. 371(డి) చిక్కుముడిని అంత సులువుగా విప్పలేరని, అది విప్పకుండా రాష్ట్ర విభజన జరగదని కొందరు సమైక్యవాదులు తేల్చి చెబుతున్నారు.
కానీ, రాష్ట్ర విభజనకు ఇది అడ్డంకి కానేకాదని తెలంగాణవాదులు అంతే గట్టిగా నొక్కి వక్కాణిస్తున్నారు.
అసలు ఏమిటీ అధికరణ? రాష్ట్ర విభజనకు, ఈ అధికరణకూ సంబంధం ఏమిటి?
అందరి కోసం..
కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేకమైన హక్కులు, ప్రతిపత్తి కల్పించే నిబంధనలన్నీ 371వ అధికరణలో ఉన్నాయి. అందులో... 'డి' ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకం. 1969లో తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత వచ్చిన ముల్కీ నిబంధనలు, దీనికి వ్యతిరేకంగా మొదలైన జై ఆంధ్రా ఉద్యమం... 371(డి) అధికరణ నేపథ్యం ఇది! విద్య, ఉద్యోగ నియామకాలు, పదోన్నతులు, బదిలీల విషయంలో అందరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగంలోని 371వ అధికరణలో (డి)ని చేర్చారు. దీని ప్రాతిపదికగానే... 306 పేజీల రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్‌కు జోనల్ వ్యవస్థ ఏర్పడింది. రాష్ట్రస్థాయి పోస్టులు, జోనల్ పోస్టులు, జిల్లా స్థాయి పోస్టుల మధ్య స్పష్టమైన విభజన వచ్చింది. స్థానిక, స్థానికేతరుల కోటాలు ఏర్పడ్డాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఉద్యోగుల వివాదాల పరిష్కారానికి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఏర్పడింది. 371(డి) ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే సంబంధించిన అధికరణ. అదికూడా... రాయలసీమ, కోస్తా, తెలంగాణ ప్రాంతాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అధికరణ. మరి... ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోతే... ఆర్టికల్ 371(డి) ఏమవుతుంది? ఆర్టికల్ 371(డి)ని రద్దు లేదా సవరణ చేసిన తర్వాతే రాష్ట్రాన్ని విభజించాలా? రాష్ట్రమే లేనప్పుడు రాష్ట్రానికి సంబంధించిన అధికరణకు విలువ ఉంటుందా? ఇవీ ఇప్పుడు అందరిలో తలెత్తుతున్న ప్రశ్నలు!
విభజనకు అడ్డమా?
"ఆంధ్రప్రదేశ్ విభజనకు ఆర్టికల్ 371(డి) అడ్డంకికాబోదు. అయితే... ఈ అధికరణ యథాతథంగా ఉన్నంతకాలం రాష్ట్ర విభజన ప్రక్రియ కూడా పూర్తయినట్లు కాదు'' అని రాజ్యాంగ నిపుణుడొకరు తెలిపారు. దీనిప్రకారం చూస్తే... రాష్ట్ర విభజన, 371(డి) పరస్పరం ముడిపడినట్లే. ఆర్టికల్ 371(డి)ని రద్దు లేదా సవరణ చేయకుండానే రాష్ట్రాన్ని విభజిస్తే... ఆ తర్వాత పరిపాలనాపరమైన అనేక సమస్యలు, ఇబ్బందులు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. 371(డి) యథాతథంగా ఉంచితే, దాని ప్రాతిపదికన వెలువడిన రాష్ట్రపతి ఉత్తర్వులు కూడా అమలులోనే ఉంటాయి. రాష్ట్రపతి ఉత్తర్వుల ఆధారంగా ఎవరైనా, ఏ వివాదంపైన అయినా కోర్టుకు వెళ్లవచ్చు. 'రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నన్ను హైదరాబాద్‌లో నియమించాలి' అని కోర్టును ఆశ్రయించవచ్చు. కోర్టులకు రాజ్యాంగమే భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లాంటిది. రాజ్యాంగం ప్రకారమే కోర్టు తీర్పులు చెబుతుంది. అందువల్ల, 371 (డి) 'రెండు రాష్ట్రాల'కు ప్రత్యేకంగా వర్తించేలా సవరించడమో పూర్తిగా రద్దుచేయడమో చేయక తప్పదు.
జరిగిదేమిటి?
రాష్ట్ర విభజనకోసం పార్లమెంటులో 'ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ బిల్లు' ప్రవేశపెడతారు. ఇది ఆమోదం పొందేందుకు, షెడ్యూలు సవరణకు సాధారణ మెజారిటీ చాలు. ముందుగా ఈ పని కానించేసి, ఆ తర్వాత 371(డి) సవరణ/రద్దుకు బిల్లు ప్రవేశపెడతారని ఒక వాదన వినిపిస్తోంది. రాజ్యాంగాన్ని సవరించడం రాష్ట్రాన్ని విభజించినంత సులభం కాదు. రాజ్యాంగంలో ఒక అధికరణను తొలగించాలన్నా, సవరించాలన్నా, కొత్తగా చేర్చాలన్నా ఒకే రకమైన ప్రక్రియను అనుసరించాల్సిందే. దీని ప్రకారం... లోక్‌సభలో రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే, మొత్తం సభ్యుల్లో (542) కనీసం సగంకంటే ఎక్కువమంది సభకు హాజరు కావాలి. అంటే... కనీసం 273 మంది వచ్చి తీరాలి. ఇలా సభకు హాజరైన వారిలో మూడింట రెండొంతుల మంది బిల్లుకు మద్దతు పలకాలి. ఉదాహరణకు సభకు 300 మంది హాజరైతే అందులో కనీసం 200 మంది సభ్యులు బిల్లును ఆమోదించాలి. ఒకవేళ 500 మంది సభ్యులు హాజరైతే 334 మంది సభ్యులు మద్దతు పలకాలి. అప్పుడు మాత్రమే రాజ్యాంగ సవరణ సాధ్యమవుతుంది. ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ సహకారం ఉంటే తప్ప ఇది రాజ్యాంగ సవరణ జరిగే అవకాశంలేదు.
రాష్ట్రపతి పాత్ర ఏమిటి?
రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత దాన్ని రాష్ట్రపతి ఆమోదిస్తేనే ప్రక్రియ పూర్తయినట్లు."బిల్లును ఆమోదించే ముందు రాష్ట్రపతి సంబంధిత వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. 371 (డి) అధికరణను ఏం చేశారు? అని ప్రశ్నించే అవకాశముంది. రాష్ట్రపతి ఉత్తర్వులు, 371(డి) రద్దు లేదా సవరణ చేయకుండా రాష్ట్ర విభజన జరగదు'' అని కొందరు స్పష్టం చేస్తున్నారు. అయితే విభజన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్.. దాంతో ముడిపడిన ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకునే ఉంటుందని, అన్నింటికీ పరిష్కార మార్గాలు ఆలోచించే అడుగు ముందుకు వేస్తుందని మరికొందరు చెబుతున్నారు.
ఎవరి వాదన వారిదే..
రాజ్యాంగంలోని 2, 3, 4 అధికరణల ప్రకారం రాష్ట్రాల విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దుల మార్పు వంటి అధికారాలన్నీ కేంద్ర ప్రభుత్వానికే ఉన్నాయి. అదే రాజ్యాంగంలోని 371 అధికరణ ప్రకారం కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక ప్రతిపత్తి, హక్కులు లభించాయి. ఇందులో 371 అధికరణ గొప్పదా? లేక 2, 3, 4 అధికరణలు శక్తిమంతమైనవా? అనే ప్రశ్న తలెత్తుతోంది. దీనిపై కొందరు సమైక్యవాదులు ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాది అభిప్రాయం సేకరించినట్లు తెలిసింది. "రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఇతర అన్ని అధికరణలు, చట్టాలకంటే ఉన్నతమైనవి. విభజన జరగాలంటే 371(డి)పై చర్చ జరిగి, సవరణ చేయాల్సిందే'' అని ఆ లాయర్ పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం ఇదంత సులువు కాదని, అందుకు అవసరమైన బలం యూపీఏకు లేదని సమైక్యవాదుల భావన. అయితే, ఇదే అంశంపై తెలంగాణ న్యాయవాదుల వాదన భిన్నంగా ఉంది. "తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే ఆర్టికల్ 371(డి) వచ్చింది. ఇప్పుడది రాష్ట్రంగా మారితే ఈ అధికరణతో పనే లేదు. రాష్ట్ర అంశాలను రాష్ట్రపతి ఎప్పటికప్పుడు పరిశీలించి, పరిష్కరించేందుకు ఈ అధికరణ అవకాశం కల్పిస్తోంది. అయినా, ఆర్టికల్ 371ను ఇప్పటికి అనేకసార్లు సవరించారు. రాష్ట్ర విభజనకు ఇది అడ్డంకి కానే కాదు'' అని స్పష్టం చేస్తున్నారు.
ట్రిబ్యునల్ మారిందిలా..
ఆర్టికల్ 371(డి) ప్రకారం దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే పరిపాలనా ట్రిబ్యునల్ ఏర్పడింది. ట్రిబ్యునల్‌కు హైకోర్టు స్థాయి కల్పించారు. అంటే ఈ తీర్పును సవాల్ చేయాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందే. అయితే, ఆ తర్వాత దేశవ్యాప్తంగా ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరముందని కేంద్రం గుర్తించింది. దీంతో రాష్ట్రంలోని ట్రిబ్యునల్‌ను రద్దు చేసి, ఒకే చట్టం ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానంలో ట్రిబ్యునళ్లు ఏర్పాటు చేసింది. అయితే ఇందుకు 371(డి)ని సవరించాల్సిన అవసరం మాత్రం రాలేదు. 'అవసరమైతే ట్రిబ్యునల్‌ను రాష్ట్రపతి రద్దు చేయవచ్చు' అని ఇందులోని 8వ క్లాజ్‌లో ఉంది. పనిలోపనిగా రాష్ట్ర విభజన జరిగితే 371(డి) దానంతటదే రద్దు అవుతుందనే క్లాజ్ కూడా ఉండి ఉంటే, ఇప్పుడు చర్చే ఉండేది కాదు.
- See more at: http://www.andhrajyothy.com/node/11889#sthash.DkRbMFz4.dpuf

No comments:

Post a Comment