|
అనాథలాగా ఏర్పడిన ఒక కొత్త రాష్ట్రాన్ని, ఆ రాష్ట్ర ప్రజల సమున్నతమైన ఆత్మ గౌరవం దెబ్బ తినకుండా, ముందుకు తీసుకువెళ్ళడం... శిథిలాల్లోంచి ఒక హర్మ్యాన్ని నిర్మించడం... మరుభూమిలోంచి సురభూమిని నిర్మించడం.. ఇవాళ మన రాష్ట్రం ముందున్న పెనుసవాలు. దీనిని దీటుగా ఎదుర్కోవడానికి సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు నడుస్తోంది. కేవలం రాష్ట్ర సమగ్ర అభివృద్ధి మాత్రమే కాదు.. ప్రపంచంలోనే మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకురావడం లక్ష్యంగా కృషి జరుగుతుంది. ఇలాంటి కీలక తరుణంలో ప్రభుత్వం చేస్తున్న కసరత్తు గురించి.. వాటి లక్ష్యిత ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన పెరగవలసిన అవసరం ఉంది.
రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడు మిషన్లను సూత్రీకరించారు. వీటి ద్వారా.. అన్నిరంగాల ప్రగతి సాధ్యం అవుతుందని మనం నమ్ము తున్నాం. ఈ మిషన్ల రూపంలో ప్రభుత్వం పరిశ్రమిస్తోంది. ఈ మిషన్లలోని కీలక లక్ష్యాల్ని మనం అర్థం చేసుకోవాలి.
మొదటిది ప్రాథమికరంగం. అన్నపూర్ణగా ఆంధ్రప్రపదేశ్‌కు ఉన్న కీర్తిని సుస్థిరం చేయడానికి కంకణబద్ధం అయిన మిషన్ ఇది. అన్నదాత సర్వతోముఖాభివృద్ధికి మన ప్రభుత్వం ఎంతగా కట్టుబడి ఉన్నది నిరూపించే తొలి ప్రాధాన్యం ఇది. ఇది వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాలను, వ్యవసాయాధారిత పరిశ్రమల్ని సుసంపన్నం చేయడం దీనిలక్ష్యం. జలసంరక్షణ, సస్యరక్షణ చర్యలు, దిగుబడుల నిల్వ సదుపాయాలు పెంచడం ఇత్యాదులు ఈ మిషన్‌లోని అంశాలు. అందుకే.. కరవు పీడిత ప్రాంతమైన అనంతపురంలో ఈ మిషన్‌ను సీఎం ప్రారంభించారు. వ్యవసాయం అనేది గర్వప్రదమైన వృత్తిగా మార్చేలా.. ప్రతి రైతూ తలెత్తుకుని బతికేలా వారి తలరాతలను తిరగరాయాలనే గొప్ప లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ ఇది. ప్రత్యేకించి రాయలసీమ కరవు జిల్లాల్లోను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్నదాతల జీవితాల్లో చిరు నవ్వులు నింపడానికి లక్ష్యించిన మిషన్ ఇది.
రెండోదైన సోషల్‌ఎంపవర్‌మెంట్ మిషన్. నేటి మన సమాజంలో ఏయే వర్గాలైతే అణచివేతకు, చిన్నచూపునకు, వంచనకు గురవుతున్నాయో వారందరి జీవితాల్లో సమూలమైన మార్పురావాలని కోరుకునే మిషన్ ఇది. అందరికీ నాణ్యమైన విద్య, పోషకాహారం అందేలా చూడడం ఇందులోని మొదటి విధి. మహిళల పట్ల నేటి సమాజంలో ఎంతగా అత్యాచారాలు పెరిగాయో మనం చూస్తూనే ఉన్నాం. మహిళా సాధికారతతో పాటు వారి భద్రత మీద కూడా సమానంగా దృష్టి పెట్టడం వీరి లక్ష్యం. ఎస్సీ, ఎస్టీ కులాలతో పాటు బీసీల్లోనూ పేదల బతుకులు నానాటికి తీసికట్టుగా తయారవుతున్నాయి. వారి జీవన చిత్రంలో మార్పు తీసుకువచ్చి సమాజంలో ఆర్థిక సమానత్వం సాధించడం లక్ష్యంగా పనిచేసే మిషన్ ఇది. ప్రాంత కుల మత భేదాలేమీ ఎంచకుండా.. రాష్ట్రంలో సర్వతోముఖ సామాజిక వికాసానికి దారితీసే ఈ మిషన్‌ను కర్నూలులో చంద్రబాబు ప్రారంభించారు.
మూడోదైన నాలెడ్జ్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ విషయానికి వస్తే.. ఏపీలోని విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే మిషన్‌ఇది. చదువులో ఎన్నడూ ముందంజలోనే ఉండే మనరాష్ట్ర విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో, కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను, ఉన్నత చదువులకు సీట్లను అందిపుచ్చుకోవడంలో మాత్రం కాస్త వెనుకబడుతున్నారు. చదువుతో పాటు సమాంతరంగా పెంపొందించుకోవాల్సిన ఇతర నైపుణ్యాల విషయంలో లోపం వలన ఇలా జరుగుతోంది. గత ప్రభుత్వాలు ఎన్నడూ శ్రద్ధ పెట్టని రంగం ఇది. వీరిలో నైపుణ్యాలు పెరగడానికి స్కిల్ డెవలప్‌మెంట్‌పై ఈ మిషన్ పనిచేస్తుంది. వారికి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవకాశాలను కల్పిస్తుంది వారికి అవసరమైన సర్వీస్ ప్రొవైడర్ల నైపుణ్యాలను ఎంచుతుంది. ఒక రకంగా యావత్తు రాష్ట్రాన్ని ఒక విజ్ఞాన ఖనిగా తీర్చిదిద్దుతుంది. కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, వివిధ సంస్థల్లోని ఉద్యోగుల్లో నైపుణ్యాలను కూడా మెరుగుపెడుతూ తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పాదకత పెరిగేలా కూడా శ్రద్ధ పెట్టడం ఈ మిషన్ విధి. దాదాపు 60 శాతం మంది మన రాష్ట్ర విద్యార్థులు కేవలం గ్రామీణ నేపథ్యం నుంచి వస్తున్నవారు కావడం వల్ల కమ్యూనికేషన్, ఇతర నైపుణ్యాల విషయంలో వెనకబడడం వల్ల అద్భుతమైన భవిష్యత్తును కోల్పోతున్నారు. అలాంటివారందరికీ ఈ మిషన్ సువర్ణావకాశంగా మారుతుందనే విశ్వాసం మనకుంది.
ఐదోది ఇండస్ర్టీ సెక్టార్ మిషన్. వస్తు ఉత్పాదక రంగంలో పారిశ్రామికీకరణ పెరగడం అనేది ఒకప్రాంత సర్వతోముఖాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. పైగా మన రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రాయలసీమ జిల్లాలు మినహా మిగిలిన తొమ్మిది జిల్లాలూ సముద్ర తీరాన్ని ఆనుకుని ఉన్నవే. 800 కిలోమీటర్ల పైబడిన సుదీర్ఘమైన తీరప్రాంతంలో అంతర్జాతీయ హార్బర్లతో విదేశాలకు వస్తు రవాణా ఎగుమతులకు తిరుగులేని వసతులున్న రాష్ట్రం మనది. ఈ వనురుల్ని, అనుకూలతలను వాడుకుని.. పారిశ్రామికంగా ఏపీ రూపురేఖలను మార్చేయడానికి కంకణం కట్టుకున్న మిషన్ ఇది. ఇప్పటికే అనేక సంస్థలతో మన ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. దేశంలోనే పెట్టు బడులకు పరిశ్రమల స్థాపనకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతం అనే భావన పారిశ్రామిక వేత్తల్లో కలుగుతున్నదంటే.. అతిశయోక్తి కాదు. అందుకే సెజ్‌లు, రెండు నిమ్జ్‌లతో రాష్ట్రం పొడవునా ఇండస్ర్టియల్ కారిడార్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం పనిచేస్తోంది. చిత్తూరు ప్రకాశం జిల్లాల్లో ఐదేసి వేల హెక్టార్లలో పెట్టదలచుకున్న నిమ్జ్‌లు ఆ జిల్లాల రూపురేఖలను మార్చేస్తాయి. 30వేల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఏర్పాటయ్యే ఈ నిమ్జ్‌లు ఆరు లక్షల మందికి పైగా ఉద్యోగులు కల్పిస్తాయి. ప్రభుత్వపు శ్రద్ధ కేవలం పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన మాత్రమే కాదు. కార్మికుల సంక్షేమంకూడా ఈ మిషన్ ప్రాధాన్యాల్లో ఉంది. అసంఘటిత రంగంలోని వారికి కూడా భద్రత కల్పించేలా సదుపాయాలు కల్పించడంపై శ్రద్ధపెడుతున్నారు. దేశంలోనే ఎన్నదగిన వస్తురవాణా హార్బర్ ఉన్న విశాఖపట్నంలో ఈ మిషన్‌ను ప్రారంభించడంలోనే.. దీనిద్వారా ఎలాంటి పారిశ్రామిక అభివృద్ధిని లక్ష్యిస్తున్నారో కూడా చంద్రబాబు రాష్ట్రానికి తెలియజెప్పారు.
ఏడు మిషన్లలో చివరిది సర్వీస్ సెక్టార్ మిషన్. బహుముఖమైన వికాసానికి ఇది ప్రతీక. 13 జిల్లాల వ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి. వీటిని సరైన రీతిలో ప్రపంచానికి పరిచయం చేసి, అంతర్జాతీయ పర్యాటకులకు ఏపీ తొలిప్రాధాన్యం అయ్యేలా టూరిజం సర్క్యూట్లను అభివృద్ధి చేయడం. అలాగే నిర్మాణ రంగం, హాస్పిటాలిటీ రంగం, ఆర్థిక సేవలు, విద్యారంగం, ప్రధానంగా ఐటీ సేవలు.. ఇలా అన్నిరంగాల్లో అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా ముం దుకు సాగుతున్నారు. ఐటీపరంగా ఇప్పటికే ఏపీలోని విశాఖ వంటి కొన్ని ప్రాంతాలు దీటుగానే ఉన్నాయి. అయితే ఈ ఐటీ సేవారంగాన్ని ఇతర ప్రాంతాలకూ విస్తరించి ఐటీ పార్క్‌లు డెవలప్ అయ్యేలా చేయాలని ముఖ్యమంత్రి సంకల్పిస్తున్నారు. ఐటీరంగంలోనే 3 సబ్‌మిషన్‌లను నెలకొల్పి మిషన్ మోడ్ ఎప్రోచ్ ద్వారా అభివృద్ధిచేయాలని అనుకుంటున్నారు. ఎలక్ర్టానిక్స్ అండ్ ఐటీ, ఇన్నోవేవషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, ఈ-గవర్నెన్స్ అనే మూడు భాగాలుగా ఈ రంగం మీద దృష్టి పెడుతున్నారు. రెవెన్యూశాఖలో ఇప్పటికే ఈ- గవరెన్స్ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఈ-పాస్‌బుక్‌లను రైతులకు అనువుగా తీసుకువస్తున్నాం. ఈ-గవర్నెన్స్ పరిపాలనను ప్రజలకు మరింత చేరువచేయాలని చంద్రబాబు సంకల్పిస్తున్నారు.
ఈ ఏడు మిషన్‌లు కాకుండా.. ఐదు గ్రిడ్‌లపై ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి ఉంది. ఇవి జన జీవితాల్లో ప్రత్యక్షంగా మార్పును రుచి చూపించేవి. వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, ఫైబర్ ఆప్టిక్స్ గ్రిడ్, రోడ్స్ గ్రిడ్ ఈ అయిదింటిలో ఉన్నాయి. ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్‌లు అనేవి మన రాష్ట్రాన్ని ప్రగతి దిశగా నడిపించేవి. వీటి ద్వారా 2029-30 నాటికి దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది లక్ష్యం. రాష్ట్ర ఆదాయం.. జీఎస్‌డీపీ (గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్)ను రెండంకెల ప్రగతి దిశగా తీసుకు వెళ్లాలనేది నాయకుడి ఆశయం. ఈ ఏడు మిషన్లను ఆచరణలోకి తేవడం ద్వారా 2015-16లో జీఎస్‌డీపీని 6,19,099 కోట్లు సాధించాలని లక్ష్యంపెట్టుకున్నారు. 2014-15లో ఇది 5,20,080 కోట్లు మాత్రమే వుండేది. గత ఏడాది పెరుగుదల 55,846 కోట్లతో పోలిస్తే 2015-16లో 99,069 కోట్ల రూపాయల జీఎస్‌డీపీ పెరుగుదలను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ఏడు మిషన్లు ఎంతటి మహత్తరమైనవంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 13 జిల్లాల్లోని ఏ ఒక్క మారుమూల పల్లెలో గానీ, ఏ ఒక్క వ్యక్తిగానీ ఏదో ఒక రకంగా ఈ ఏడు మిషన్లలో ఒక దాని ఫలాలను ఆస్వాదించే విధంగా రూపొందించడం జరిగింది. వీటి ఆచరణను సుసాధ్యం చేయడం ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నిండుతాయి. ఈ ఏడు మిషన్లలో ఇంతటి మహత్తు ఉన్నదనే సంగతి ప్రజలకు తెలియాలి. ఈ ఏడు మిషన్ల ద్వారా తమ జీవితాల్లో కొత్త వెలుగులు నిండుతున్నాయనే సంగతిని వారు అర్థం చేసుకోవాలి. అలా వారందరికీ అవగాహన కల్పించడం రాష్ట్ర ప్రగతి పట్ల బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరి విధి.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి |
No comments:
Post a Comment