- సీఎం ఆధ్యాత్మిక సలహాదారుల్లో అనుమానం
- రాజధానికి భూమిపూజ చేసిన పండితులతో చర్చలు
- అడ్డంకులు తొలగేందుకు పూజలు చేయాలని నిర్ణయం?
రేపల్లె : నవ్యాంధ్ర రాజధానికి భూమిపూజలో వాస్తుదోషాలు ఏమైనా ఉన్నాయా? భూమిపూజలో కానీ.. బొడ్డురాయి స్థాపనలో కానీ.. ఏమైనా లోపాలు జరిగాయా? ముహూర్త బలం అనుకూలంగా లేదా?.. ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆ పార్టీ నాయకులకు ప్రస్తుతం ఏర్పడిన రాజకీయ ఇబ్బందికర పరిస్థితులకు అవేమైనా కారణమా??.. ఇవే ప్రశ్నలు ఇప్పుడు టీడీపీ నేతలను, చంద్రబాబు అనుచరులను తొలిచేస్తున్నాయి. ఇందుకు కారణాలు కనుగొని... భూమిపూజ తదనంతరం చేయాల్సిన కార్యక్రమాలపై వారంతా దృష్టి సారించారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం భూమిపూజ చేసేందుకు జూన్ 6వ తేదీన ఉదయం 8.49 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. అనుకున్నవిధంగా 6వ తేదీన గుంటూరు జిల్లా మందడంలో రాజధాని నిర్మాణానికి భూమిపూజ చేసి బొడ్డురాయిని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమం ప్రారంభం కాకముందే ఓటుకు నోటు కేసు తెరమీదకు వచ్చింది. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసీబీకి దొరికిపోవటం.. అదే కేసులో సీఎం చంద్రబాబు ఫోన్ సంభాషణలు బయటపడటం.. ఆ తరువాత జరుగుతున్న వరుస సంఘటనలతో టీడీపీకి ఇబ్బందికర పరిస్థితులు వచ్చాయి. దీంతో భూమిపూజలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా? భూమిపూజ తర్వాత వాస్తుకు సంబంధించి చేయాల్సిన పూజా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆథ్యాత్మిక అంశాలను పర్యవేక్షించే యోగం నాయుడు పరిశీలిస్తున్నారు. ఈమేరకు రాజధానికి భూమిపూజ చేసిన గుంటూరు జిల్లా రేపల్లె మండలం నల్లూరుకు చెందిన విఖనస భట్టాచార్యులును బుధవారంనాడు యోగంనాయుడు, గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే, వాస్తు పండితులు రాఘవయ్య తదితరులు గోప్యంగా కలుసుకుని చర్చించారు. బొడ్డురాయి స్థాపన అనంతరం చేయాల్సిన పూజలు, చంద్రబాబుకు ఎదురుదెబ్బలు తొలగేందుకు చేయాల్సిన పూజలపై వారు మంతనాలు జరిపారు. ఉదయం 11 గంటలకు నల్లూరు చేరుకున్న వీరు సాయంత్రం 3 గంటల దాకా చర్చలు జరిపారు. అడ్డంకులు తొలగేందుకు రహస్యంగా పూజా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఈ సందర్భంగా విఖనస భట్టాచార్యులు మాట్లాడుతూ చంద్రబాబు జాతకం బాగానే ఉందని, చిన్నచిన్న అవాంతరాలు తప్పవని, అయినా అంతిమ విజయం ఆయనదేనని స్పష్టం చేశారు. తెనాలి ఆర్డీవో, తుళ్లూరు తహసీల్దార్ కూడా ఈ పర్యటనలో ఉన్నారు.
http://www.andhrajyothy.com/Artical.aspx?SID=120409&SupID=42
No comments:
Post a Comment