|
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ప్రభుత్వం మా ఫోన్లను ట్యాప్ చేస్తోంది. నాతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులు సహా 120 మంది ఫోన్లను ట్యాప్‌చేసింది. ఇదంతా ఓ ప్రైవేటు ఏజెన్సీతో కావాలని చేయించింది. దీనిపై తక్షణమే మీరు జోక్యం చేసుకోవాలి..’’అంటూ ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఫోన్ల ట్యాపింగ్‌పై తెలంగాణ ప్రభుత్వ వ్యవహార శైలిని ప్రధానికి వివరిస్తూ ఆరు పేజీలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. ‘‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌లో ఏడాది కాలంగా తెలంగాణ ప్రభుత్వం పలు అరాచకాలకు పాల్పడుతోంది. ఏళ్ల తరబడి హైదరాబాద్‌లో సెటిల్ అయిన ఆంధ్రా ప్రాంత ప్రజల నివాసాలను అక్రమంగా కూల్చివేసింది. ఆంధ్రుల ఆస్తుల విధ్వంసానికి పాల్పడి భయాందోళనలకు గురిచేసింది’’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్ర ప్రజలు దోపిడీదారులంటూ విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏపీ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని.. ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతి భద్రతలు, పౌరుల భద్రత తదితర అంశాలు గవర్నర్ పర్యవేక్షణలో ఉండాలని విభజన చట్టంలోని సెక్షన్ 8 పేర్కొనగా, పరిస్థితి ఆ విధంగా లేదని.. అన్ని రకాల యంత్రాంగాలనూ తెలంగాణ ప్రభుత్వమే పూర్తిగా తమ చేతుల్లోకి తీసుకుంటోందని వివరించారు. గవర్నర్‌కు ఇద్దరు సలహాదారులను కేంద్రం నియమించినా.. ఆయనను పక్కన పెట్టి తెలంగాణ ప్రభుత్వం విభజన చట్టాన్ని ఉల్లంఘిస్తోందని తెలిపారు. తాజాగా తనతో పాటు ప్రభుత్వంలోని ముఖ్యుల ఫోన్లను ట్యాప్ చేసిందని ఆరోపించారు. బిషప్ సెబాస్టియన్ అనే వ్యక్తి ఫోన్‌ను మే 25 నుంచి ట్యాప్‌చేశారని వివరించారు. సెబాస్టియన్ నక్సలైట్ కాదని.. ఉగ్రవాది అంతకన్నా కాదని.. అలాంటి వ్యక్తి ఫోన్‌ను ట్యాప్ చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఏముందని తన విజ్ఞప్తిలో ప్రశ్నించారు. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎ్‌సకు ఉన్న మెజారిటీ కన్నా అభ్యర్థులను ఎక్కువ మందిని రంగంలోకి దింపిందని.. వాస్తవానికి ఆ పార్టీకి కేవలం 63 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని.. వారి సంఖ్యా బలానికి ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులు మాత్రమే గెలిచే అవకాశం ఉన్నా 5 మందిని బరిలోకి దించిందని వివరించారు. ఎన్డీయేకు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ఇందులో 15 మంది టీడీపీ, ఐదుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారని తెలిపారు. ఎన్డీయే మద్దతుతో ఒక్క ఎమ్మెల్సీని గెలిపించుకునేందుకు 17 మంది ఎమ్మెల్యేల సంఖ్యా బలం సరిపోతుందని.. కానీ, వారిలో 5 మందిని తెలంగాణ ముఖ్యమంత్రి అదిరించి బెదిరించి బలవంతంగా తమ పార్టీలోకి చేర్చుకున్నారని పేర్కొన్నారు. అన్ని పార్టీల నుంచీ ఎమ్మెల్యేలను ఇదే మాదిరిగా తన పార్టీలోకి చేర్చుకుని మొత్తం 85 మంది ఎమ్మెల్యేలతో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోటీ చేసి గెలిచారని వివరించారు. ఇంత అరాచకం సృష్టిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి రాజధానిలో ఉన్న ఏపీ ప్రభుత్వాన్ని కూడా తన నియంత్రణలోకి తీసుకునేందుకు యత్నిస్తోందని తెలిపారు. పోలీసు, ఏసీబీ సహా వివిధ ప్రభుత్వ యంత్రాంగాలను ఏపీ ప్రభుత్వంపై ప్రయోగిస్తోందని వివరించారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో పదేళ్ల పాటు ఏపీ ప్రభుత్వం ఉండాలన్న హక్కును కాలరాస్తున్నారని పేర్కొన్నారు. తమ ప్రభుత్వానికున్న స్వేచ్ఛను, రాజ్యాంగం కల్పించిన హక్కులను పెడచెవిన పెడుతున్నారని వివరించారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని.. విభజన చట్టం ప్రకారం ఏపీ హక్కులను కాపాడుతూ, సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌కు అధికారాలను కల్పించేలా చర్యలు తీసుకోవాలని తన విజ్ఞప్తి లేఖలో ప్రధాని నరేంద్రమోదీని కోరారు.
|
No comments:
Post a Comment