|
చిన్నారి లావణ్యపై హత్యాచారానికి పాల్పడ్డ సురేష్ మృతి
ఫ్లై ఓవర్‌పై నుంచి దూకేయడంతో తీవ్రగాయాలు
కొన ఊపిరితో ఉన్న నిందితుడిపై తీవ్ర ఆగ్రహంతో ప్రజల దాడి
ఏలూరు, జూన్ 19: అభంశుభం తెలియని ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి.. చంపేసి, ట్రంకుపెట్టెలో కుక్కిన హంతకుడు ప్రజాగ్రహానికి గురై హతమయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరురూరల్ మండలం మాదేపల్లిలోని ఇందిరాకాలనీకి చెందిన తియ్యాల లావణ్య (7) హత్యాచారానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితుడు గనిగంటి సురేష్ (32)పై కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేయాలని.. లేదా అతడు కనిపిస్తే ఎవరైనా చంపేయవచ్చనే ఉత్తర్వులు ఇవ్వాలని శుక్రవారం పలు ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి. ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో ఏలూరు ప్రభుత్వాస్పత్రి నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వరకూ ఊరేగింపుగా వెళ్లి రాస్తారోకో చేశాయి. అయితే.. శుక్రవారం ఉదయం 11.30 గంటల సమయంలో పాత బస్టాండు వద్ద ఒక షాపు వెనుక గనిగంటి సురేష్ దాక్కుని ఉండగా.. అతణ్ని గమనించిన ఓ వ్యక్తి స్థానికులకు ఆ విషయం తెలియజేశాడు. వారందరూ కలిసి అతణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించగా పారిపోయాడు. పాతబస్టాండ్ ట్రాఫిక్ పాయింట్‌లో ఉన్న పోలీసులు కూడా సురేష్‌ను వెంబడించారు. పారిపోయిన సురేష్.. సమీపంలోని ఫ్లైఓవర్ పైనుంచి రైలుపట్టాల మీదకు దూకేశాడు. కొనఊపిరితో ఉన్న అతనిని పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లడానికి జీపులో ఎక్కించగా.. జనం బయటకు లాగి కాళ్ళతో తొక్కేశారు.
సురేశ్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. కాగా, సురేష్‌ను ఎవరూ చంపలేదని, అతనే భయపడి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని ఏలూరు డీఎస్పీ కేజీవీ సరిత స్పష్టం చేశారు. సురేష్‌ది అనుమానాస్పద మృతిగా టూ టౌన్ సీఐ యు.బంగార్రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా.. సురేష్‌కు భగవంతుడు తగిన శాస్తి చేశాడంటూ బాలిక బంధువులు ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు.. లావణ్య మృతదేహానికి వైద్యుల చేత పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కాగా, చిన్నారి లావణ్యపై అత్యాచారం జరిపి అమానుషంగా హత్య చేసిన గనిగంటి సురేష్‌కు తగిన శాస్తి జరిగిందని ఏపీ మంత్రి పీతల సుజాత అన్నారు. భవిష్యత్‌లో ఏ ఒక్కరూ ఇటువంటి దారుణాలకు పాల్పడకుండా ఇది ఒక గుణపాఠంలా నిలవాలని ఆమె అభిప్రాయపడ్డారు. లావణ్య కుటుంబానికి తీరని అన్యాయం జరిగిందని, ప్రభుత్వపరంగా వారిని అన్ని విధాలా ఆదుకుని అండగా నిలబడతామని మంత్రి హామీ ఇచ్చారు.
|
No comments:
Post a Comment