Tuesday, 16 June 2015

అవసరమైతే హైదరాబాద్‌లో ఏపీ పోలీస్ స్టేషన్లు..

అవసరమైతే హైదరాబాద్‌లో ఏపీ పోలీస్ స్టేషన్లు..
కేసీఆర్‌ తప్పించుకోలేరు: అచ్చెన్నాయుడు

హైదరాబాద్‌, జూన్‌ 16: ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్‌ తప్పించుకోలేరని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఒకవేళ ట్యాపింగ్‌ చేయకపోతే రాతపూర్వకంగా తెలియచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వాయిస్‌ టెస్ట్‌కు రావాల్సిందిగా తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇస్తుందన్న ప్రచారం మంగళవారం ఉదయం నుంచి జరుగుతున్న నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కక్షతో ఏమైనా చేయదలచుకున్నా దానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు నోలీసులు ఇచ్చే అధికారం తెలంగాణ ఏసీబీకి లేదని, తెలంగాణ పోలీసుల భద్రతను మేం తీసుకోమని, ఏపీ పోలీసులే తమకు భద్రత కల్పిస్తారని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. హైదరాబాద్‌పై తెలంగాణకు ఎంత హక్కు ఉందో... ఉమ్మడి రాజధానిగా మాకు అంతే హక్కు ఉందని ఆయన అన్నారు. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు శాంతి భద్రతలు గవర్నర్‌ చేతిలో ఉండాలని... శాంతిభద్రతలను తెలంగాణ ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని ఆయన విమర్శించారు. రాజ్యాంగ సంక్షోభం వస్తే కేంద్రం చూసుకుంటుందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం సెక్షన్‌-8 అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్‌ చేశారు.
 
కాంగ్రెస్‌ నేతలు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తున్నారని అచ్చెన్నాయుడు విమర్శించారు. సెక్షన్‌-8కు విలువ లేదని చవటల్లా మాట్లాడుతున్నారని, కేసీఆర్‌ ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒపిక పట్టామని, మా సహనాన్ని అలుసుగా తీసుకుని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఏపీ పోలీసుల మోహరింపుపై తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నిస్తుందని, మరి గవర్నర్‌ చేతిలో ఉండాల్సిన అధికారాలను తెలంగాణ సర్కార్‌ ఎలా తీసుకుందని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అవసరమైతే హైదరాబాద్‌లో ఏపీ పోలీస్‌ స్టేషన్లను పెడతామని ఆయన అన్నారు.

టీడీపీతో పెట్టుకున్న ఏ నాయకుడూ మిగలలేదని... కాలగర్భంలో కలిసిపోయారని అచ్చెన్నాయుడు అన్నారు. 10 మంది ఎమ్మెలు ఉన్న తాము ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తామని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్య నేతలతో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి చాలాసార్లు భేటీ అయ్యారని ఆయన విమర్శించారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా గవర్నర్‌ తొలగింపుతో సమస్యలు పరిష్కారం కావని, గవర్నర్‌ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని అచ్చెన్నాయుడు కోరారు.

No comments:

Post a Comment