‘బాబు ఆడియో’పై కేసులో కేబుల్ చట్టం కింద చర్యలు
మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని చానల్‌కు నిర్దేశం
సామరస్యాన్ని దెబ్బతీశారు.. విద్వేష భావాల్ని పెంచారు
మీ చానల్‌పై ఎందుకు చర్య తీసుకోకూడదు?
నోటీసులో విశాఖ ఏసీపీ
హైదరాబాద్, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): టేపులు, ట్యాపుల వివాదం కీలక మలుపు తిరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత చానల్ టీ-న్యూస్ చానల్‌కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఈ సంచలనం చోటు చేసుకుంది. ఈనెల 7వ తేదీన చంద్రబాబు-స్టీఫెన్‌సన్ మధ్య జరిగిన సంభాషణ ‘టీ-న్యూస్’లోనే మొట్టమొదటిసారిగా ప్రసారమైంది. దీనిపై విశాఖపట్నంలో ఎన్‌వీవీ ప్రసాద్ అనే న్యాయవాది ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ‘‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ నేత జగన్, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, టీ-ఏసీబీ అధికారులు, సాక్షి, టీన్యూస్ చానళ్లు ప్రయత్నిస్తున్నాయి’’ అని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విశాఖ పోలీసులు రంగంలోకి దిగారు. శుక్రవారం రాత్రి 11.45 గంటలకు విశాఖపట్నం ఏసీపీ రమణ హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లోని టీ-న్యూస్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. నేరుగా చానల్ కార్యాలయంలోకి వెళ్లారు. చానల్ సీఈవో నారాయణ రెడ్డికి నోటీసులు అందించారు. ‘‘కేబుల్ నెట్‌వర్క్ నియంత్రణ చట్టంలోని సెక్షన్ 19 ప్రకారం నోటీసు జారీ చేస్తున్నాం. మీ చానల్ ప్రోగ్రామ్ కోడ్‌ను ఉల్లంఘించింది. పరువు నష్టం కలిగించేలా తప్పుడు, అర్ధసత్యాలతో కూడిన కథనాలను ప్రసారం చేసింది. ఈనెల 7వ తేదీ రాత్రి 8.30 గంటలకు మీ చానల్‌లో నిబంధనలకు విరుద్ధంగా ప్రసారమైన కార్యక్రమానికి సంబంధించి చట్టబద్ధమైన చర్యలు ఎందుకు తీసుకోకూడదో మూడు రోజుల్లో వివరణ ఇవ్వగలరు’’ అని నోటీసుల్లో ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వెంటనే ఏసీపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా టీ-న్యూస్ సిబ్బంది తమ నిరసన తెలిపారు. ‘‘నోటీసులను వెంటనే వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు నిరంకుశ వైఖరి నశించాలి. చంద్రబాబు డౌన్ డౌన్’’ అని నినాదాలు చేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఏపీలో నమోదైన కేసులపై ఏర్పాటైన సిట్ శుక్రవారమే తొలిసారి భేటీ అయ్యింది.( డీఐజీ మహ్మద్ ఇక్బాల్ నేతృత్వంలో చిత్తూరు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, ఇద్దరు సీఐలతో కూడిన సిట్ శుక్రవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత టీ-న్యూస్‌కు ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేయడం గమనార్హం. తెలంగాణకు చెందిన ఒకరిద్దరు ఐపీఎస్ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది.
టీ-పోలీస్ సీరియస్
ఏపీ నోటీసులు, ఉద్రిక్తతల నేపథ్యంలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌కు చెందిన పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించారు. పక్క రాష్ట్రానికి చెందిన పోలీసు అధికారులు... స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతే ఎవరికైనా నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందని వీరు చెబుతున్నారు. కానీ, తమకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండానే ఏపీ పోలీసులు ముందుకు వెళ్లడాన్ని వీరు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్‌లోని చానల్‌కు నోటీసులు జారీ చేసిన ఏపీ పోలీసు అధికారి రమణను ఈ విషయంపై ప్రశ్నించాలని భావిస్తున్నట్లు సమాచారం.
పీసీ యాక్ట్ కింద సీఐడీ కేసు
మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఏపీ సీఐడీ రికార్డులను పరిశీలించిన అనంతరం... అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కేసు నమోదు చేసింది.
‘స్టీఫెన్‌సన్ నుంచి రూ.కోటి తీసుకుని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయనకు నామినేటెడ్ ఎమ్మెల్యే పదవి ఇచ్చారు’ అని ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అలాగే... తన సోదరుడు ప్రభుదాస్‌పై దాడి చేశారంటూ మత్తయ్య ఇచ్చిన ఫిర్యాదుపైనా సీఐడీ దృష్టి సారించింది. టీఆర్‌ఎస్ నేతలే ఈ దాడికి పాల్పడ్డారని మత్తయ్య ఆరోపించారు. ఈ నేపథ్యంలో... శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుదాస్‌ను సీఐడీ అధికారులు పిలిచి విచారించారు. దాడి ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది అనే అంశాలపై ఆరా తీశారు. బాధ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
No comments:
Post a Comment