|
హైదరాబాద్, జూన్ 05: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ ఎంపీ మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. కేసీఆర్ సీఎం అవడం తెలంగాణ ప్రజల అదృష్టమని అన్నారు. శుక్రవారం మల్కాజిగిరిలో పేద ప్రజలకు భూమి పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌తోపాటు మల్లారెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు కేసీఆర్ స్వాతంత్య్రం ఇచ్చారని, పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమని, కేసీఆర్ నాయకత్వంలో రాబోయే రెండేళ్లలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిదని, రాష్ర్టాభివృద్ధిలో సీఎం కేసీఆర్‌కు అందరం అండగా నిలబడదామని మల్లారెడ్డి పిలుపునిచ్చారు. మల్కాజిగిరి ప్రాంతానికి సీఎం వందల కోట్లు కేటాయించి ఈ ప్రాంతాభివృద్ధికి కృషి చేశారన్నారు. కేసీఆర్‌తోనే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి నియోజకవర్గంలో 3,300 మంది లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. టీడీపీ ఎంపీ మల్లారెడ్డి తీరుపై పార్టీలో ఊహాగానాలు మొదలయ్యాయి. పార్టీ మారే ఉద్దేశంతోనే ఆయన కేసీఆర్‌ను పొగిడారా..? లేక వ్యాపారవేత్తగా ఇబ్బందులు లేకుండా చూసుకోవడానికా అనే చర్చ పార్టీ వర్గాల్లో మొదలైంది. |
No comments:
Post a Comment