Friday, 12 June 2015

కలిసింది పది నిమిషాలు... ప్రచారం చేసుకుంది గంట

కలిసింది పది నిమిషాలు... ప్రచారం చేసుకుంది గంట

Sakshi | Updated: June 12, 2015 02:16 (IST)
కలిసింది పది నిమిషాలు... ప్రచారం చేసుకుంది గంట
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో బుధవారం పది నిమిషాలే సమావేశమయ్యారు. ప్రధానితో ఈ సమావేశం సుమారు గంటపాటు కొనసాగిందని ఆయన వెంట ఉన్న నేతలు.. పత్రికలు, ప్రసార సాధనాలకు సమాచారం ఇచ్చారు. తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటు కోసం డబ్బులు ఎర చూపిన వ్యవహారంలో ఆయనతో చంద్రబాబు మాట్లాడిన టెలిఫోన్ సంభాషణల ఆడియో టేపులు బయటకు పొక్కిన నేపథ్యంలో మంగళ, బుధవారాలు రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. తమ టెలిఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్న అనుమానాలు, విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం గవర్నర్ విధులపై స్పష్టత కోరే విషయంలో ప్రధానమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించిన సందర్భంలోనే గోదావరి పుష్కరాలకు రావాలని తిరుపతి లడ్డూ ప్రసాదం అందించి ప్రధానిని ఆహ్వానించారని అధికార వర్గాలు తెలిపాయి.

 ఈ సందర్భంగా పది నిమిషాలు మాత్రమే సమావేశమయ్యారని ఢిల్లీ వర్గాల సమాచారం. కానీ, ఏపీ సీఎం వెంట ఉన్న నేతల సమాచారం మేరకు ప్రధాని నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ, గంటపాటు ఏకాంత చర్చలు అని ప్రసార సాధనాల్లో బ్రేకింగ్ న్యూస్ వేశారు. బుధవారం కేంద్ర కేబినేట్ సమావేశంతో పాటు అనేక ముందస్తు అపాయింట్‌మెంట్లతో ప్రధాని మోదీ క్షణం తీరిక లేకుండా ఉన్నారని, అందులో భాగంగా చంద్రబాబుకు 10 నిమిషాల సమయం మాత్రమే కేటాయించినట్టు విశ్వసనీయ సమాచారం. చంద్రబాబు ప్రధానిని కలిసేందుకు వచ్చే సమయానికే మోదీ మరో ముఖ్యమైన సమావేశంలో ఉన్నారు. ఆ సమావేశం పూర్తయ్యే వరకు వేచి ఉన్న చంద్రబాబు.. అది ముగిసిన తర్వాత కలిసి పుష్కరాలకు ఆహ్వానించడంతో పాటు గవర్నర్ అధికారాలకు సంబంధించిన అంశంపై వినతిపత్రం అందించినట్టు అధికారవర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment