- అధిపతిగా ఐపీఎస్ ఇక్బాల్!
- ఏపీ సర్కారు నిర్ణయం
- విజయవాడలో సీఐడీ విచారణ
హైదరాబాద్, జూన్ 16(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆంధ్రప్రదేశ్‌లో దాఖలైన పలు కేసులను దర్యాప్తు చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికోసం ప్రత్యేక పరిశోధనా విభాగాన్ని (సిట్) నియమించడంతోపాటు, కేసీఆర్‌పై మత్తయ్య నమోదుచేసిన కేసును సీఐడీతో విచారణ జరిపించాలని కూడా నిర్ణయించింది. టీ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఏపీలో 87 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. వీటన్నింటిని దర్యాప్తు చేయడానికి సిట్‌ను ఏర్పాటు చేశారు. సిట్‌కు అధిపతిగా డీఐజీ ర్యాంకు అధికారి మహ్మద్ ఇక్బాల్‌ను నియమించనున్నారు. ఆయన ప్రస్తుతం మైనారిటీ కమిషన్ సీఈవోగా పనిచేస్తున్నారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వద్ద చీఫ్ సెక్యూరిటీ అధికారిగా కూడా పనిచేశారు. సీఎం చంద్రబాబు సూచన మేరకు ఈ కేసుల విచారణ బాధ్యతను ఆయనకు అప్పగించనున్నారు. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ అవుతాయి. మరోవైపు.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై జెరూసలెం మత్తయ్య పెట్టిన కేసును ఏపీ సర్కారు సీఐడీకి అప్పగించింది. కేసీఆర్ వల్ల తనకు ప్రాణ హాని ఉందంటూ ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితుడైన మత్తయ్య కేసీఆర్‌పై విజయవాడ కమిషనరేట్ పరిధిలోని సత్యనారాయణపురంలో కేసుపెట్టిన సంగతి తెలిసిందే. స్టీఫెన్‌సన్, రేవంత్‌రెడ్డి వ్యవహారంలో ఏపీ సీఎం చంద్రబాబు పేరు చెప్పాలంటూ తెలంగాణ ఏసీబీ అధికారులు బెదిరించారని మత్తయ్య ఆ సందర్భంగా పోలీసులకు వాంగ్మూలమిచ్చారు. స్టీఫెన్‌సన్ ఆంగ్లో ఇండియన్ కాదని, కేసీఆర్‌కు రూ.కోటి ఇచ్చి ఎమ్మెల్యే అయ్యారని మత్తయ్య చెప్పారు. ఆ సొమ్ములు ఇవ్వడంవల్లే స్టీఫెన్‌సన్ అప్పులపాలయ్యారని మత్తయ్య బెజవాడ పోలీసులకు వివరించారు. ఆ అప్పులు తీర్చుకోవడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటును అమ్ముకోవడానికి స్టీఫెన్‌సన్ సిద్ధపడ్డారని కూడా వాంగ్మూలమిచ్చారు. ఈ నేపథ్యంలో నిజానిజాలు తేల్చేందుకు మత్తయ్య కేసును ఏపీ పోలీసులు సీఐడీకి అప్పగించారు. మంగళవారం సాయంత్రానికి సీఐడీ ఎస్పీ కోటేశ్వరరావు నేతృత్వంలోని దర్యాప్తు బృందం విజయవాడ చేరుకుంది. సత్యనారాయపురం పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ కాపీ, ఇతర డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టనుంది. మత్తయ్యను ఎవరు ఏమని బెదిరించారు.? చంద్రబాబు పేరు చెప్పాలని బెదిరించిన అధికారులెవరు? మత్తయ్య కుటుంబ సభ్యులకు ఎలాంటి బెదిరింపులు వచ్చాయి? తదితర అంశాలపై సీఐడీ అధికారులు దృష్టి సారించనున్నారు. ఈ విషయమై సీఐడీ ఉన్నతాధికారులను సంప్రదించగా మత్తయ్య కేసులో నిష్పాక్షికంగా దర్యాప్తు పూర్తిచేసి నిజానిజాలు వెలికితీస్తామని పేర్కొన్నారు.
|
No comments:
Post a Comment