Friday, 19 June 2015

ఏపీలోని కార్పొరేషన్ల పరిధిలో G+2

ఏపీలోని కార్పొరేషన్ల పరిధిలో G+2
240 చదరపు గజాల్లోపు స్థలాల్లో నిర్మాణ అనుమతులు

మార్టిగేజ్‌, నిబంధనలతో పనిలేకుండా నిర్మాణాలు
ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు.. త్వరలోనే జీవో
విజయవాడ, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): సొంతింటి కల నెరవేర్చుకునేందుకు ఎవరి నుంచీ..ఎలాంటీ అనుమతి అక్కర్లేదు! కానీ, ఆ ఇంటిపై అంతస్థులు నిర్మించాలంటే పర్మిషన్‌ పక్కా కావాల్సిందే! కానీ, పర్మిషన్‌ రావాలంటే నానా నియమాలు.. నిబంధనలు! అబ్బబ్బా ఎన్ని తలనొప్పులు! ఇక నుంచి ఆ తలపోటు తప్పనుంది! స్థలం చిన్నదైనా కార్పొరేషన్లలో రెండంతస్థుల వరకు నిర్మించుకోవచ్చు! అనుమతుల బాధరబందీ ఉండబోదు! ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలతో పనిలేకుండా 240 చదరపు గజాల్లోపు స్థలంలో అదనంగా రెండు ఫ్లోర్లు నిర్మించుకోవచ్చని ఆదేశాలిచ్చారు. ఇప్పటిదాకా గ్రౌండ్‌+1 మాత్రమే అనుమతి ఉండేది. ఆపైన మాత్రం అనుమతులు తప్పనిసరి! కానీ, పెరిగిన అవసరాలు, స్థలాభావంతో చాలా మంది ఉన్న స్థలంలోనే రెండో అంతస్థునూ నిర్మించుకోవాలని ఆశిస్తున్నారు. అయితే దానికీ కొన్ని షరతులున్నాయి. అత్యవసరమైన వారు వారి స్థలంలో 10 శాతం భూమిని కార్పొరేషన్‌కు తనఖా (మార్టిగేజ్‌) పెట్టి నిర్మాణాలు చేసుకోవాలి. సరే.. మార్టిగేజ్‌ పెట్టి అంతస్థులు నిర్మించినా.. దానికీ ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోంది. మార్టిగేజ్‌ ప్లాన్‌ ఇచ్చిన నిర్మాణాల్లో, సెట్‌బ్యాక్స్‌లో చిన్న లోపం (డీవియేషన్‌) ఉన్నా సరే వారి ఇల్లు తనఖా నుంచి విడుదలవ్వట్లేదు. దీంతో మార్టిగేజ్‌ చేయటానికి చాలామంది ముందుకు రావట్లేదు. దీనివల్ల కార్పొరేషన్‌కు వచ్చే ఆదాయమూ రావట్లేదు. దీంతో ఈ అంశాన్ని విజయవాడ నగర అధికారులు, ప్రజాప్రతినిధులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. విషయాన్ని పరిశీలించిన చంద్రబాబు.. ఇకపై 240చదరపు గజాల్లోపు రెండో అంతస్థు కోసం ఎలాంటి మార్టిగేజ్‌ లేకుండానే నిర్మించుకోవచ్చని ఆదేశించారు. అంతేకాదు.. దానికి నామమాత్రపు ఫీజు వసూలుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీంతో దీనికి సంబంధించిన జీవోను త్వరలోనే మున్సిపల్‌, పట్టణాభివృద్ధిశాఖ జారీచేయనునట్లు తెలిసింది. కాగా ఈ అంశంపై సమగ్ర విశ్లేషణ చేసి.. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీకాంత్‌ను చంద్రబాబు ఆదేశించినట్లు సమాచారం.

No comments:

Post a Comment