|
విజయవాడ, జూన్ 27 : వారానికి నాలుగు రోజులు విజయవాడలోనే ఉంటానని...కార్యాలయం పూర్తి అవకున్నా బస్సులోనే ఉండి కార్యకలాపాలు సాగిస్తానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం మాట్లాడుతూ త్వరలో అన్ని శాఖల కార్యాలయాలను విజయవాడకు తరలించనున్నట్లు చెప్పారు.
ఎన్ని ఇబ్బందులు వచ్చినా అనుకున్న పనులు చేయగలిగామన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై నేతలకు అవగాహన ఉండాలని తెలిపారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు సూచించారు. రైతు, డ్వాక్రా రుణాలు మాఫీ చేశామని బాబు అన్నారు. రూ.5 వేల కోట్లతో ఎస్సీ సబ్‌ప్లాన్, రూ.2 వేల కోట్లతో ఎస్టీ సబ్‌ప్లాన్, రూ.6 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అభివృద్ధిని వివరిస్తే ప్రజలు ఆమోదిస్తారన్నారు. అభివృద్ధిలో కార్యకర్తలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సమస్యలపై కూర్చుని మాట్లాడుకుందామంటే తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావడం లేదని సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇద్దరం కలిసి కూర్చుంటే ఆమోదయోగ్యమైన పరిష్కారం వస్తుందని అభిప్రాయపడ్డారు. సెక్షన్-8పై తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యను గవర్నర్‌కు చెప్పినా పరిష్కారం కాలేదన్నారు. 9,10 షెడ్యూల్ సంస్థలపై తెలంగాణ ప్రభుత్వ తీరు సరికాదని సీఎం తెలిపారు.
ఎన్నికల ముందు కావాలని జగన్‌ను బయటికి తీసుకువచ్చారన్నారు. వైసీపీని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆగ్రహించారు. టీడీపీని దెబ్బతీసేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, వైసీపీ కుట్ర చేస్తున్నాయని చంద్రబాబునాయుడు ఆరోపించారు.
|
No comments:
Post a Comment