Saturday, 13 June 2015

ఏడాది కాలంగా లేని అభద్రత ఇప్పుడేల..?

ఏడాది కాలంగా లేని అభద్రత ఇప్పుడేల..?
దమ్ముంటే ట్యాపింగ్‌ను రుజువు చేయండి: తలసాని

హైదరాబాద్‌, జూన్ 13: ఏడాదికాలంగా హైదరాబాద్‌లో ఆంధ్రావాళ్లపై చిన్నసంఘటన అయినా జరిగిందా? అని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శనివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన ఓటుకు నోటు వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన ఏపీ సీఎం చంద్రబాబు భద్రత లేదంటూ అనవసరం రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు విషయాన్ని పక్కన బెట్టి హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలపై బాబు అండ్ కో లేనిపోని ఆపోహలు సృష్టిస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ప్రభుత్వం రాసిన లేఖలో హైదరాబాద్ ప్రస్తావన ఉండటం నిజంగా దురదృష్టకరమన్నారు. హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు, మంత్రులకు రక్షణ లేదా? అని నిలదీశారు. ఏడాదిగా ఎప్పుడైనా శాంతిభద్రతల సమస్యను ప్రస్తావించారా? అని ఏపీ ప్రభుత్వ పెద్దలపై తలసాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే ట్యాపింగ్ ఆధారాలు బయటపెట్టాలని తలసాని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొన్ని మీడియా సంస్థలు దొంగకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని విమర్శించారు.

No comments:

Post a Comment