Wednesday, 24 June 2015

సెక్షన్-8ను ఒప్పుకోం.. కాదంటే ఢిల్లీలో ఆమరణ దీక్షే

సెక్షన్-8ను ఒప్పుకోం.. కాదంటే ఢిల్లీలో ఆమరణ దీక్షే

  • ప్రజా ఉద్యమం తప్పదు.. శాంతి భద్రతలు మా అధికారం
  • కేంద్రం జోక్యాన్ని సహించం.. గవర్నర్‌కు కేసీఆర్‌ స్పష్టీకరణ
 
హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాజధాని పేరిట, సెక్షన్‌ 8 ప్రకారం హైదరాబాద్‌పై గవర్నర్‌కు అధికారాలు అప్పగిస్తే ఆమరణ దీక్షకు దిగుతానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు. ఈ విషయాన్ని స్వయంగా గవర్నర్‌ నరసింహన్‌ ముందే కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. సెక్షన్‌ 8 అమలు దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఆయన మంగళవారం కేసీఆర్‌ రాజ్‌భవన్‌లో నరసింహన్‌తో సమావేశమయ్యారు. గంటకుపైగా ఆయనతో చర్చలు జరిపారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... సెక్షన్‌ 8 అమలుపై కేంద్రం వైఖరిని గవర్నర్‌ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు. తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పేశారు. ‘‘విభజన చట్టంలో సెక్షన్‌ 8ను కేవలం కంటితుడుపుగా చేర్చారు. దీనిని అమలు చేస్తే చూస్తూ ఊరుకోం. తీవ్రంగా స్పందిస్తాం’’ అని కేసీఆర్‌ తెలిపారు. శాంతిభద్రతల నిర్వహణ పూర్తిగా రాష్ట్రాల జాబితాలోనిదని, ఇందులో కేంద్రం జోక్యం చేసుకోదనే తాము ఇప్పటికీ భావిస్తున్నామని తెలిపారు. ‘‘హైదరాబాద్‌ పేరుకు రెండు తెలుగు రాషా్ట్రల ఉమ్మడి రాజధాని అయినప్పటికీ, తెలంగాణలో అంతర్భాగం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఇక్కడి శాంతిభద్రతల అధికారాలు తెలంగాణ రాషా్ట్రనికే ఉంటాయి’’ అని అన్నారు. ఒకవేళ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, మొండిగా ముందుకు వెళితే న్యాయ పోరాటం చేస్తామన్నారు.
జాతీయ స్థాయిలో పోరాటం...
‘‘హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలును ఒప్పుకోబోమని మేం గట్టిగా చెబుతున్నా... బుల్డోజ్‌ చేస్తూ వెళ్తారా? దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. సెక్షన్‌ 8 అమలు చేసి రాషా్ట్రల అధికారాలను కేంద్రం కాలరాస్తోందంటూ ఎన్డీయేతర ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం’’ అని గవర్నర్‌కు కేసీఆర్‌ స్పష్టం చేశారు. కేంద్రం తీరును తప్పుపడుతూ జాతీయ స్థాయిలో మద్దతు కూడగడతామని తెలిపారు. స్వయంగా తానే ఆందోళనకు దిగుతానని, హైదరాబాద్‌లో లేదా ఢిల్లీలో ఆమరణ దీక్షకు కూర్చుంటానని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేంద్రానికి వ్యతిరేకంగా ప్రజా నిరసనలు వెల్లువెత్తడం ఖాయమని చెప్పారు. ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో సెక్షన్‌ 8 అమలు చేసి అనవసరంగా చిచ్చు పెట్టొద్దని గవర్నర్‌ను కోరారు.
 
ఇప్పుడెందుకీ రగడ...
రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గడిచిన ఏడాదిలో ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో కనీసం ఒక్క చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదని గవర్నర్‌కు కేసీఆర్‌ తెలిపారు. ‘ఓటుకు నోటు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబుఉద్దేశపూర్వకంగానే సెక్షన్‌ 8ను తెరపైకి తెచ్చారని చెప్పారు. హైదరాబాద్‌లో ఏపీ పోలీసులను మోహరిస్తున్నారని, తమ ప్రభుత్వం ఏపీ నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేసినట్లు తప్పుడు ఆరోపణలు చేసున్నారని మండిపడ్డారు. ‘‘ఓటుకు నోటు కేసుతో సంబంధమున్న టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏపీలో దాచిపెట్టారు. హైదరాబాద్‌లో మా సొంత చానల్‌కు ఏపీ పోలీసులు నోటీసు ఇచ్చారు. అయినా మేం సంయమనంతో ఉన్నాం.’’ అని గవర్నర్‌కు వివరించారు.
 
మంత్రులతో చర్చలు..
రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో భేటీ ముగిసిన తర్వాత కేసీఆర్‌ సచివాలయంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, కేటీఆర్‌, జోగు రామన్న తదితరులతో చర్చించారు. గవర్నర్‌తో భేటీ వివరాలను వారికి వివరించారు. ఒకవేళ కేంద్రం సెక్షన్‌ 8 అమలు చేయాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిద్దామని చెప్పారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మెదక్‌ జిల్లాలోని తన ఫామ్‌హౌ్‌సకు వెళ్లినట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి.

No comments:

Post a Comment