పలు రికార్డులు, సీడీలు స్వాధీనం!
విజయవాడ, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ వందశాతం నిజమని ‘సిట్’ ఓ నిర్ధారణకు వచ్చింది. మొబైల్‌ఫోన్ సర్వీస్ ప్రొవైడర్లను రెండు రోజులు ప్రశ్నించిన ఏపీ సిట్ దీనిపై ఆధారాలు కూడా సంపాదించింది. విజయవాడలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఐదుగురు, మంగళవారం ముగ్గురు సర్వీస్ ప్రొవైడర్లను సిట్ అధికారులు ప్రశ్నించారు. ట్యాపింగ్‌పై ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఎవరి ఫోన్లు, ఎలా, ఎన్నాళ్లపాటు, ఎవరు చెబితే ట్యాప్ చేశారు?’ అనే అంశాలపై దృష్టి సారించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... రెండు నెలలుగా ఏపీ ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ జరుగుతున్నట్లు సర్వీస్ ప్రొవైడర్లు ధ్రువీకరించారు. అయితే ఏయే నెంబర్లను, ఎంతకాలంగా ట్యాపింగ్‌లో ఉంచారో స్పష్టంగా తెలియాలంటే సమయం పడుతుందని, ఆ కాల్‌డేటాను అందజేసేందుకు కూడా కొద్ది రోజుల గడువు కావాలని నెట్‌వర్క్ ప్రొవైడర్లు కోరినట్లు తెలుస్తోంది. ‘ట్యాప్ చేయాల్సిందిగా ఆదేశించిన అధికారులు ఎవరు?’ అని ప్రశ్నించగా... ‘‘మా కంపెనీకి చెందిన ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల ప్రకారమే ట్యాపింగ్ జరిగింది’’ అని సర్వీస్ ప్రొవైడర్లు చెప్పినట్లు సమాచారం. ఈ సందర్భంగా ట్యాప్ జరిగిన ఫోన్లకు సంబంధించిన రికార్డులు, సీడీలను సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ మధ్య జరిగిన సంభాషణల టేపులు కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతానికి... ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన 14 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలతో సహా రుజువైనట్లు తెలుస్తోంది. ట్యాపింగ్‌కు సంబంధించి రెండు నెలల రికార్డులన్నీ సీడీల రూపంలో ఇవ్వాలని సిట్ ఆదేశించింది. ఇందుకు సర్వీస్ ప్రొవైడర్లు అంగీకరిస్తూ... ఇందుకు, తమకు కొంత సమయం కావాలని లిఖితపూర్వకంగా కోరినట్లు భోగట్టా. కాగా ట్యాపింగ్‌కు సంబంధించి సిట్ దర్యాప్తులో ఒక అంకం ముగిసినట్లే. రెండు రోజుల విచారణలో ఆయా కంపెనీల ప్రతినిధులు చెప్పిన వివరాల ఆధారంగా తదుపరి అడుగు వేయనున్నారు. మరీ ముఖ్యంగా... ‘మా కంపెనీ ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాల మేరకే ట్యాపింగ్ చేశాం’ అని చెప్పిన నేపథ్యంలో... ఆయా ఉన్నతాధికారులకు నోటీసులు పంపి, వారినీ ప్రశ్నించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఐదారు రోజుల తర్వాత రెండో విడత విచారణ ప్రక్రియ మొదలవుతుందని చెబుతున్నారు. విజయవాడలో సోమవారం నాటి విచారణకు యునినార్, రిలయన్స్, వొడాఫోన్, డొకొమో, ఐడియా ప్రతినిధులు హాజరయ్యారు. సిట్ సభ్యులైన చిత్తూరు ఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, కాకినాడ ఏఎస్పీ దామోదర్, విశాఖపట్నం మెరైన్ డీఎస్పీ నరసింహారావు, విజయవాడ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ సీఐ కాశీ విశ్వనాథ్ ఈ విచారణలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment