హైదరాబాద్, జూన్ 11 (ఆంధ్రజ్యోతి): అమరావతి డిజిటల్ నగరిగా మారనుంది. నూతనంగా నిర్మించనున్న రాజధాని నగరానికి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తొలి నుంచే పకడ్బందీగా రికార్డులు తయారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూములు, భవనాలు, రహదారులు, అన్ని రకాల సంస్థలు, ఉద్యానవనాలన్నింటినీ డిజిటల్ మ్యాపులుగా తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకమైన అప్లికేషన్‌ను తయారు చేస్తోంది. ఈ అప్లికేషన్‌లో జియోట్యాగింగ్ పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అన్ని రికార్డులను డిజిటల్‌లో చిత్రీకరిస్తారు. సీఆర్‌డీఏలో ఉండే ప్రతి స్థలం వివరాలు జియోట్యాగింగ్ విధానంలో రికార్డు అవుతాయి.
ఎలా చేస్తారంటే..
ఏపీ గృహనిర్మాణ శాఖ ఇప్పటికే జియోట్యాగింగ్ విధానం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల విచారణ జరుపుతోంది. అలాంటి తరహాలోనే సీఆర్‌డీఏ భూములు కూడా ట్యాగ్ చేస్తారు. అంటే స్థలం లేదా భవనాన్ని జియోట్యాగింగ్ అప్లికేషన్ ఉన్న మొబైల్ ఫోన్‌తో నాలుగువైపులా ఫొటోలు తీస్తారు. ఆ ఫొటోల్లో అక్కడి నమూనాతో పాటు అక్షాంశ, రేఖాంశాలు కూడా రికార్డవుతాయి. ఒక చోట నమోదైన అక్షాంశ, రేఖాంశాల సంఖ్య మరెక్కడా నమోదు కాదు. ఒక భవనాన్ని నాలుగు వైపులా ఈ విధంగా ఫొటోలు తీసి దానికి ఒక మధ్య పాయింట్‌ను ఎంపిక చేస్తారు. అక్కడ పలాన భవనం లేదా స్థలం ఉందని రికార్డు చేస్తారు. దానికి అక్కడి సర్వే నంబరును జత చేస్తారు. దీనిని డిజిటల్ మ్యాపులకు అనుసంధానిస్తారు. ఈ మ్యాపుల ద్వారా ఎక్కడి నుంచైనా సీఆర్‌డీఏలో పలానా చోట ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయి, అవి ఎవరి అధీనంలో ఉన్నాయి, వాటి సర్వే నంబరు ఎంత అనే వివరాలు తెలుసుకోవచ్చు.
|
No comments:
Post a Comment