Tuesday, 9 June 2015

తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్ - Babu

తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్.. కన్ను తెరిస్తే కష్టాలే
హైదరాబాద్‌లో మాకూ పోలీసులున్నారు..
కేసీఆర్‌పై చంద్రబాబు ఫైర్

 నేను వ్యక్తిని కాను, సీఎంను..  ఉమ్మడి రాజధానిలో మాకూ అధికారం
పదేళ్లు గౌరవంగా బతికే హక్కు లేదా?.. నేను నీ సర్వెంట్‌నా?
శాంతిభద్రతల బాధ్యత గవర్నర్‌దే.. మీ పెత్తనం ఏమిటి?
నన్ను అవమానిస్తే 5 కోట్ల మందిని అవమానించినట్లే
ట్యాపింగ్‌ నీచాతినీచం.. తప్పుడు డాక్యుమెంట్లతో బెదిరిస్తారా?
మా ఎమ్మెల్యేలను కొన్నప్పుడు బుద్ధిలేదా?: ఏపీ సీఎం
 
గుంటూరు, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను తప్పు చేయను. తప్పుడు కేసులు పెడితే మాత్రం ఖబడ్దార్‌. వదిలిపెట్టే ప్రసక్తే లేదు’’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. సోమవారం సాయంత్రం గుంటూరులో జరిగిన ‘మహా సంకల్ప దీక్ష’లో రేవంత్‌ ఉదంతాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. టేపుల విడుదల, ఫోన్ల ట్యాపింగ్‌, కేసు పెడతారనే వార్తలపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు ప్రసంగం ఆయన మాటల్లోనే... ‘‘అసమర్థ కేసీఆర్‌.. ఇప్పుడు నా మీద కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్‌ ఆపరేషన్లు చేసి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించడం నీచాతి నీచం. ఫోన్లు ట్యాప్‌ చేస్తే ప్రభుత్వాలే పడిపోతాయి. నేను వ్యక్తిని కాదు. ఏపీ ముఖ్యమంత్రిని. నా ఫోన్‌ను ట్యాప్‌ చేసే అధికారం కేసీఆర్‌కు ఎవరిచ్చారు? తెలంగాణలో కేసీఆర్‌కు సర్వెంట్‌నా? ఫోన్‌ ట్యాపింగ్‌లు చేసి, తప్పుడు డాక్యుమెంట్లతో బెదిరించాలనుకుంటే అది వాళ్ల తరం కాదు. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని. మీది ఒక ప్రభుత్వం. మాదీ ఒక ప్రభుత్వం. మీకు ఏసీబీ ఉంది, మాకూ ఏసీబీ ఉంది. మా ఏసీబీ కూడా హైదరాబాద్‌లోనే ఉంది. మీ పోలీసులున్నారు, మాకు కూడా హైదరాబాద్‌లో పోలీసులు ఉన్నారు. ఉమ్మడి రాజధానిలో అధికారాలు గవర్నర్‌కు ఉంటే... మా మీద పెత్తనం చెలాయించేందుకు మీరెవరు? పదేళ్లు ఉమ్మడి రాజధానిలో గౌరవంగా బతికే అధికారం ఉందా లేదా? నేను, టీఆర్‌ఎస్‌ పార్టీ పెత్తనంపై ఆధారపడలేదు. వీళ్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడలేదు. నాకు హైకమాండ్‌ ప్రజలే. ఒక సీఎంను అగౌరపరుస్తారా? ఇది... నన్ను అవమానించినట్లు కాదు. నన్ను ఎన్నుకున్న ఐదు కోట్లమంది ప్రజలను అవమానించినట్లు. ట్యాపింగ్‌ నేరం, ద్రోహం. ఒక సీఎం ఫోన్‌ ట్యాప్‌ చేస్తే ఏం జరుగుతుందో మీరే ఆలోచించండి. మనకు స్వయం ప్రతిపత్తి ఉంది. నేను కూడా ఒక ప్రభుత్వ అధినేతను. తప్పులు చేయను. తప్పుడు కేసులు పెడితే మాత్రం ఖబడ్దార్‌!
 
ఎమ్మెల్యేలను కొన్నప్పుడు బుద్ధి లేదా?
ఎమ్మెల్యేలను కొనుగోలు చేసింది కేసీఆరే. తెలంగాణలో టీడీపీ, బీజేపీ పని అయిపోయిందన్నారు. కానీ, టీడీపీ తరఫున 15, బీజేపీ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు గెలిచారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యేల్లో ఐదుగురిని కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు కూడా మా ఎమ్మెల్యే ఒకరిని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి... డబ్బులిచ్చి... సిగ్గులేకుండా పోలీసు భద్రతతో పంపించారు. మా ఎమ్మెల్యేతో రాజీనామా కూడా చేయించకుండా మంత్రి పదవి చేయించి, గవర్నర్‌తో తప్పుడు ప్రమాణం చేయించారు. ఇవన్నీ మీకు గుర్తు లేవా? వీటికి సమాధానం చెప్పండి. మా ఎమ్మెల్యేలను మీరు తీసుకున్నప్పుడు బుద్ధి లేదా? ఇలాంటివి చాలా ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు ఒక్కో అస్త్రం వదులుతాను! మాకు ఒక్క ఎమ్మెల్సీ ముఖ్యం కాదు. సిద్ధాంతం, నీతి ముఖ్యం.
 
ఇది మీ జాగీరు కాదు...
ఏసీబీ రైడ్‌ చేస్తుంది. క్యాసెట్‌ను మాత్రం కేసీఆర్‌ రిలీజ్‌ చేస్తారు. ఎక్కడో నేను ఫోన్‌ చేశానని తప్పుడు డాక్యుమెంట్‌ సృష్టించి... టీఆర్‌ఎస్‌ సొంత చానల్‌లో ప్రసారం చేస్తారు. ఇది మీ జాగీరు కాదు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను. దయచేసి ఆలోచించండి! రాష్ట్రాల మధ్య తగాదా వద్దు. అలా పెట్టుకుంటే చాలా దూరం వెళుతుంది. మీకెన్ని అధికారాలున్నాయో, అంతకంటే ఎక్కువ మాకున్నాయి. నేను కన్ను తెరిస్తే, (మీకు) కష్టాలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి! ప్రతి ఒక్కరికీ గౌరవంగా బతికే అధికారం ఉంది. హైదరాబాద్‌లో రోజూ ఆంధ్రావాళ్లను తిడుతున్నారు. ఆ పెద్ద మనిషి (కేసీఆర్‌) ఆంధ్రావాళ్ల ఇళ్లు కూల్చి వేయడానికి పోయారు. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ ప్రపంచమంతా తిరిగాను. అది విశ్వనగరంగా తయారైందంటే అది నా చొరవ, నా కృషే కారణం. ఇప్పుడు దాడులు చేస్తామని బెదిరిస్తున్నారు. దీనికి భయపడం! ఎన్టీఆర్‌ ఇచ్చిన స్ఫూర్తి, గుండె ధైర్యం నాకున్నాయి. నా ప్రజల కోసం, వారి ఆత్మగౌరవానికి కాపాడేందుకు ప్రాణాలు ఇచ్చేందుకైనా సిద్ధం. తెలంగాణలో ప్రశ్నించే మీడియాను అణగదొక్కుతున్నారు. కేబుల్‌ కట్‌ చేస్తున్నారు. ట్యాంక్‌బండ్‌పై సంబరాలు చేసుకున్న టీఆర్‌ఎస్‌... పొరుగు రాష్ట్రంలో తాము ఏర్పాటు చేసుకున్న ‘సంకల్పం’ సభను చెడగొట్టేందుకు కుట్ర పన్నింది. ఒక ఇంట్లో శుభకార్యాన్ని చెడగొట్టాలని ఎవరైనా ఆలోచిస్తారా?
 
సిగ్గులేకుండా టీఆర్‌ఎస్‌కు మద్దతు
వైసీపీకి తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలుంటే, ఇద్దరిని టీఆర్‌ఎస్‌ వాళ్లు కొనేశారు. ఉన్న ఒక్క ఎమ్మెల్యేను కూడా మీకే ఇస్తామంటూ... టీఆర్‌ఎస్‌కు వైసీపీ మద్దతు పలికింది. ఇది సిగ్గుమాలిన చర్య కాదా? ఆ మహా నాయకుడు... 16 కేసులు పెట్టుకుని, జైలుకు పోయి, బయటికి వచ్చి సిగ్గుకూడా లేకుండా నన్ను విమర్శిస్తున్నారు. ఇలాంటి వాళ్లకు సమాధానం చెప్పాలంటే బాధ వేస్తోంది. కానీ, ప్రజాస్వామ్యంలో తప్పదు. అందుకే బదులిస్తున్నాను. ఈ కుట్ర రాజకీయాలు జరగవు. మంచికి మంచిగా ఉంటాను. చెడు తలపెడితే వదిలే ప్రసక్తే లేదు.

No comments:

Post a Comment