Tuesday, 9 June 2015

ఎక్కువ మాట్లాడితే నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు - KCR

నీ లత్కోరు పనులు మా దగ్గర కాదు..
ఎక్కువ మాట్లాడితే నిన్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడు
ఒళ్లు దగ్గర పెట్టుకో: చంద్రబాబుపై కేసీఆర్ ఎదురుదాడి


  • గాయిచేసి పెడబొబ్బలు పెడితే భయపడం..
  • నీ ఏసీబీ ఇక్కడ లేదు.. ఉన్నా నీలా నేను దొంగ పనులు చేయను
  • నిన్నిరికించే ఖర్మ మాకెందుకు.. ఐనా ఇరికిస్తే ఇరికేవాడివేనా?
  • అంత నీతిమంతుడివి సీట్లు లేకున్నా పోటీ ఎందుకు చేసినట్టు!
  • నీ లుచ్చా పనేందో గల్లీనుంచి ఢిల్లీ దాకా చూసింది: టీ సీఎం
నల్లగొండ, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): ‘‘పట్టపగలు దొంగతనం చేసి బాజాప్త దొరికిన దొంగ చంద్రబాబు! ఆయనను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేడు!’’ అని తెలంగాణ సీఎం కేసీఆర్‌ సూటిగా హెచ్చరించారు. సోమవారం గుంటూరులో జరిగిన ‘మహా సంకల్ప దీక్ష’ సభలో ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. అక్కడ సభ ముగిసిన కొద్దిసేపటికే... వాటర్‌ గ్రిడ్‌, యాదాద్రి థర్మల్‌ పవర్‌ పైలాన్‌లను ఆవిష్కరించిన అనంతరం నల్లగొండలో ఆర్‌ఎస్‌ ఏర్పాటు చేసిన ‘ప్రగతి పథం’ సభలో కేసీఆర్‌ పాల్గొన్నారు. చంద్రబాబుపై మాటల తూటాలు సంధించారు. వివరాలు ఆయన మాటల్లోనే...
‘‘ఇవాళ దురదృష్టం! ఆంధ్రప్రదేశ్‌లో అడ్డగోలుగా, అవినీతితో రాజకీయాలు నడిపిన నాయకులు ఇప్పటికీ తెలంగాణలో రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు ఆంధ్రాకుబోయి మీటింగ్‌లో మాట్లాడారు. ఆయనను అన్యాయంగా ఏసీబీ కేసులో ఇరికించారని చెబుతున్నారు. నువ్వు ఇరికిస్తే ఇరికే మనిషివేనా చంద్రబాబు నాయుడూ. నువ్వు ఇరికించే వాడివే తప్ప ఇరుక్కునే వాడివా? కొంపలు గుంజుకుంటవే తప్ప నీ కొంప కూల్చుకుంటావా? అన్యాయంగా నీ పై కేసు పెడతారా? పక్క రాష్ట్రమోడు వచ్చి ఇక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యేల్నే కొని, ఎమ్మెల్సీని గెలిపించుకుంటామంటే మేం చేతులు ముడుచుకుని, నోరు మూసుకుని కూర్చోవాలా? దొంగతనం చేసేటోన్ని దొంగా అని అనొద్దట. పట్టుకోవద్దట! మొత్తం బండారం మీరే టీవీల్లో చూశారు కదా! పట్టపగలు దొరికిన దొంగ పెద్దగ మాట్లాడుతున్నాడు. ఇరికించే ఖర్మ మాకెందుకయ్యా? మేం పనులు లేకుండా కూర్చున్నామా? మా పనులు, మా సమస్యలు పరిష్కరించుకునేందుకు 24 గంటల సమయం కూడా సరిపోవడంలేదు. ఇంక... నీ బాధ మాకెందుకు?
రామేశ్వరం పోయినా...
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్టు... విభజన తర్వాత కూడా ఇది పెట్టారు. ఈ దిక్కుమాలిన దందా మాకు ఎందుకు పెడుతున్నారయ్యా అని నేను అప్పుడే అన్నాను. కానీ, కాంగ్రెస్‌ సన్నాసులు ఒప్పుకొని పదేళ్లు ఉమ్మడి రాజధాని పెట్టించారు. ఇప్పుడు చంద్రబాబు... ఏం మాట్లాడుతున్నాడు? కేసీఆర్‌కు హైదరాబాద్‌లో ఎంత అధికారం ఉందో. నాకు అంతే అధికారం ఉందని మాట్లాడతున్నాడు. నీ అబ్బ జాగీరా.. చంద్రబాబు నాయుడూ హైదరాబాద్‌ నీ తాతదా? హైదరాబాద్‌కు నువ్వుగాదు ముఖ్యమంత్రివి. తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్‌లో నీకు ఏసీబీ ఉన్నది నిజమే. కానీ, నీ లెక్క కేసీఆర్‌ దొంగకాదు. నీలెక్క దొంగ రాజకీయాలు రావు. నీ లెక్క తప్పుడు పనులు మేం చేయలేదు. నువ్వు దొంగతనం చేసి దొరికిపోయి నగ్నంగా పచ్చిగా పట్టుబడి, అరిచి పెడబొబ్బ పెట్టి, గాయ్‌ జేసి ఏదో చేద్దామనుకుంటే ఇక్కడ భయపడే వాళ్లు ఎవరూ లేరు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతుకు ఎంతో, నీ రాజకీయాలు ఎంతో, నీ లుచ్చా పనేందో, నీ లతుకోరు పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. తెలంగాణ సమాజం కూడా మేల్కొంది. నువ్వు ఏది జేస్తే అది చూడటానికి సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్తి చేస్తారు. ఒళ్లు దగ్గర బెట్టుకుని మాట్లాడు!
ఎందుకు పోటీ చేసినట్లు?
చంద్రబాబును ఒక్క మాట అడుగుతున్నా! గెలిచే మెజారీటీ లేకున్నా గోదాలోకి దిగిన పార్టీ ఏది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు గెలిచే ఓట్లు మీకున్నాయా? నీవు నీతిమంతునివేగదా! సత్యహరిశ్చంద్రుని ఇంటెనకనే నీ ఇల్లు ఉన్నది గదా! మరెందుకు పోటీ పెట్టావు? ఇతర పార్టీల వాళ్లను గుంజుకుని, లఫంగతనం చేసి డబ్బులిచ్చి, ఎమ్మెల్యేలను చెడగొట్టి, రాజకీయాలను భ్రష్టు పట్టించే పని చేశావ్‌. నువ్వు జేసే దుర్మార్గాన్ని స్టీఫెన్సన్‌ అనే మా తెలంగాణ బిడ్డ, ఆంగ్లో ఇండియన్‌ ఏసీబీకి కంప్లెయింట్‌ ఇచ్చి నీ ఎమ్మెల్యేను పట్టిచ్చాడు. ఇప్పుడు నీ ఎమ్మెల్యేనే జైలులో ఉన్నాడు. ఈ సందర్భంలో నీ చరిత్ర బయటికి వస్తోంది. నువ్వు ఫోన్లో మాట్లాడింది బయటికి వస్తోంది. నిన్ను అమాయకంగా మేం ఇరికించామా? ప్రపంచానికి కనపడటం లేదా? పట్టపగలు దొరికిన దొంగతనాన్ని కూడా అరుపులతో, పెడబొబ్బలతో మాయ జేసి మూసేస్త అనుకుంటున్నవా? నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు.. జాగ్రత్త! ఇంకా ఎక్కువ మాట్లాడితే నీకు ఏ శాస్తి కావాలో అది అయి తీరుతుంది. ఇక ఈ తెలంగాణ ఒకనాడు ఉద్యమ బెబ్బులి. నేడు స్వయం పాలనతో ఆత్మ గౌరవంతో కాలర్‌ ఎగరేసుకుని దేశం ముందు నిలబడింది. ఇక ఈ గడ్డ మీద నీ కిరికిరి చెల్లదు. తస్మాత్‌ జాగ్రత్త!

No comments:

Post a Comment