|
మహాకవి శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుడు... అరసం అవసాన దశను అందరికన్నా ముందు కనిపెట్టిన క్రాంతదర్శి. ఒకానొక సంధి దశలో ప్రగతిశీల సాంస్కృతిక జ్వాలను ఆరిపోకుండా కాపాడిన ఏకైకుడు. దిగంబర కవులకు మార్గదర్శి...సామాజిక విముక్తి జరగనిదే రాజకీయ విముక్తి అసాధ్యం అని చాటిచెప్పిన వైతాళికుడు. ఆధిపత్యాన్ని ప్రశ్నించిన అన్ని రకాల ధిక్కార స్వరాలకు తెలుగు కవిత్వంలో తావు కల్పించినవాడు. మధ్యతరగతి మడికట్టు మార్దవం నుంచి తెలుగు కవిత్వాన్ని తప్పించి శూద్రీకరించిన సాంఘిక విప్లవ కవి- సివి. అసలు పేరు చిత్తజల్లు వరహాలరావు. జీవితంలో ఎనభై అయిదో మైలురాయిని సయితం అవలీలగా అధిగమించిన సదా బాలకుడు. జూన్ 19వ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయం. జలమయమైన హౌసింగ్ బోర్డు కాలనీ. సి.వి. మనవరాలు వచ్చి గేటు తలుపు తీసింది. సి.వి. జీవన సహచరి అరుణ సాదరంగా ఆహ్వానించారు. మా ప్రశ్నలకు సి.వి. ఎంతో ఓపిగ్గా సమాధానాలు ఇచ్చారు.
మార్క్సిజం నన్ను మనిషిని చేసింది. గతితార్కిక చారిత్రక భౌతికవాదం ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి అవసరమైన ఒక చట్రాన్ని అందించింది. అంబేద్కర్ రచనలు భారత సామాజిక నిర్మాణాన్ని శాస్త్రీయంగా అర్థం చేసుకునేందుకు ఉపకరించాయి. కులం పునాదుల గురించిన అవగాహనను పెంచాయి. నిరంకుశంగా, నిరాటంకంగా కొనసాగుతూన్న అమానవీయ సంస్కృతికి సమాంతరంగా ఒక మానవీయ, ప్రజాస్వామిక పరంపర కొనసాగుతూ వస్తూందన్న వాస్తవాన్ని వివరించాయి. ఆధిపత్య సంస్కృతికి భిన్నమైన ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి అన్వేషణ దిశగా ముందుకు వెళ్ళేందుకు పురికొల్పాయి. త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలు దేన్నయినా సరే నిలదీసి ప్రశ్నించడం నేర్పాయి. పురాణాల పుట్టుపూర్వోత్తరాలను విప్పిచూపాయి. నన్ను నాస్తికుడుగా, హేతువాదిగా దిద్దితీర్చాయి. పెరియార్ రచనలు ఆర్యుల అసలు రూపాన్ని ఆవిష్కరించాయి. ద్రవిడ మూలాలను గురించిన చైతన్యాన్ని నాలో పెంచిపోషించాయి.
మహాప్రస్థానం నన్ను కవిని చేసింది. నేను శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుణ్ణి. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ. నాకు శ్రీశ్రీతో అనేక విషయాలలో భేదాభిప్రాయం కూడా వుంది. ఆది కాలంలో వేమన, మధ్యకాలంలో తిక్కన, ఆధునిక కాలంలో గురజాడ తన అభిమాన కవులని ప్రకటించాడు శ్రీశ్రీ. వేమన, గురజాడలు ఆయనతో పాటు నాకూ అభిమాన కవులే. అయితే తిక్కనను నేను ఆమోదించనుగాక ఆమోదించను.
1948-49, నేను ఎఫ్.ఏ. చదువుకుంటూన్న రోజులు. అంబేద్కర్ రాసిన కులనిర్మూలన (ఎనిహిలేషన్ ఆఫ్ కేస్ట్) పుస్తకం చదివాను. ఆ పుస్తకం అనేక రోజులపాటు నాకు నిద్ర లేకుండా చేసింది. ప్రపంచ మానవాళి విముక్తి లక్ష్యంగా మార్క్స్, ఏంగెల్స్‌లు రాసిన కమ్యూనిస్టు మేనిఫెస్టోతో పోల్చదగిన పుస్తకం అది. అయితే దీని లక్ష్యం భారత దేశంలో కులనిర్మూలన. మొత్తంగా భారతీయ సమాజాన్ని కేన్సర్‌లా పట్టిపీడిస్తూన్న కులసమస్య బాల్యం నుంచే మానసికంగా నన్ను బాధిస్తూ వచ్చింది. కులసమస్య పరిష్కారం దిశగా తన జీవితాంతం నిజాయితీగా కృషి చేసిన మహామేధావిగా అంబేద్కర్ పట్ల నాకు అచంచలమైన గౌరవం వుంది. నేను డిగ్రీ చదువుకుంటూన్న రోజులలో అంబేద్కర్ రచనలను ఆమూలాగ్రం చదివాను, అధ్యయనం చేశాను.
ఆ రోజుల్లోనే నేను త్రిపురనేని రామస్వామి చౌదరి రచనలు కూడా చదివాను. కవిరాజురచనలు అసాధారణమైనవి. ఆయన తన జీవిత పర్యంతం అవిశ్రాంతంగా పని చేశాడు. ఏటికి ఎదురీదాడు. తమిళనాడులో పెరియార్ కూడా అంతే. ఇద్దరూ ఇద్దరే. మహా రాక్షసులు. దక్షిణ భారతదేశం యావత్తూ వీళ్ళిద్దరికీ శాశ్వతంగా రుణపడి వుంటుందని నేను నిస్సంకోచంగా చెప్పగలను. 1951-53 మధ్యకాలంలో నేను మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో ఎమ్.ఏ. ఇకనామిక్స్ చదువుకుంటూన్న రోజులలో పెరియార్ రచనలను అధ్యయనం చేశాను. త్రిపురనేని రచనలే నా ‘సత్యకామ జాబాలి’ కవితా కావ్యానికి ప్రధాన ప్రేరణ.
మద్రాసులో చదువుకుంటూన్న రోజులలోనే నా రచనావ్యాసంగం ఆరంభం అయింది. తొలి రచనలు చిత్తజల్లు వరహాలరావు పేరుతోనే అచ్చయ్యాయి. సందేశం వంటి సంచికల కోసం రాశాను. ప్రభుత్వ ఉద్యోగంలో చేరాక కలం పేరు అనివార్యం అయింది. అప్పట్లో ప్రభుత్వం కమ్యూనిస్టు కార్యకర్తలు, రచయితలు, రచయితల కార్యకలాపాల పట్ల నిరంతరం నిఘా వుంచేది.నీడలా వెంటాడుతూ వుండేది. కొన్ని రచనలు అరుణశ్రీ పేరుతో వెలువరించాను. నా తొలి కవితాసంకలనం ‘విషాద భారతం’ సి. విజయలక్ష్మి పేరుతో వెలువడింది. ఆ తరువాత ‘కారుచీకట్లో కాంతిరేఖ’. సి. విజయలక్ష్మి అనేది మా అమ్మ పేరు. ఆ పేరు చాలా కాలంపాటు కొనసాగింది. ఈ సి.విజయలక్ష్మి ఎవరు? ఈవిడ ఎక్కడ వుంటుంది? ఈవిడను పట్టుకోవడం ఎలా అని అటు అభిమానులు, ఇటు ప్రభుత్వ నిఘా విభాగం వాళ్ళు శోధించడం ప్రారంభించారు. వీళ్ళ బాధ పడలేక విసిగిపోయిన మిత్రులు తుమ్మల వెంకట్రామయ్య సి.వి. అనే పేరుతో కొనసాగమని యిచ్చిన సలహాను పాటించి రచనలు చేశాను.
ఒక బాధ్యత కలిగిన సామాజిక కార్యకర్తగా, రచయితగా శక్తివంచన లేకుండా నేను చేయగలిగినంతా చేశాను. ఆరోగ్యం సహకరిస్తే ఇంకా ఏదో చేయగలిగేవాణ్ణి అని నేనేం అనుకోవడం లేదు. నా రచనలు మొత్తం 24 పుస్తకాలుగా వచ్చాయి. అదే నా శక్తి. నాకున్న జ్ఞానం, పరిజ్ఞానం, సర్వ శక్తియుక్తులు నా రచనలుగా సమాజం ముందు ఉన్నాయని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. రెండు నిండు సంవత్సరాల కృషి ఫలితం పారిస్ కమ్యూన్ కావ్యం. ఆ కావ్య రచన అనంతరం నా లోపలి రక్తనిధులన్నీ ఖర్చయిపోయాయనే అనుభూతి కలిగింది. మహామహోపాధ్యాయులయిన మార్క్స్ ఏంగెల్స్‌లు మానవజాతి భవిష్యత్ తరాల కోసం కలగన్న ఆదర్శ సమాజానికి పారిస్ కమ్యూన్ ఒక ప్రతిరూపం, ఒక నమూనా. అందుకే ఆ కావ్యం రాయటం అనివార్యమని భావించి రాశాను.
సాహిత్యం ఒక సాధనం, కవిత్వం ఒక మాధ్యమం
నా లోపలి భావాలను అత్యంత శక్తివంతంగా, సమర్ధవంతంగా నా చుట్టూవున్న సమాజానికి చేరవేసే ఒక సాధనంగా, ఒక మాధ్యమంగానే నేను కవిత్వాన్ని లేదా సాహిత్యాన్ని చూస్తాను. నేను కవినా, రచయితనా, సామాజిక శాస్త్రవేత్తనా, హేతువాదినా, నాస్తికుడినా అని నా గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు. నన్ను నేను బాధ్యత ఎరిగిన ఒక సాధారణ సామాజిక కార్యకర్తగా భావించుకోవడమే అత్యంత గౌరవప్రదమైనదిగా భావిస్తాను. ఇదేదో మోడెస్టీ కోసమో, మొహమాటం కోసమో చెబుతూన్న మాట కాదు. మనస్పూర్తిగా చెబుతూన్న పచ్చి నిజం.
గుర్తింపును గురించి...
నా రచనలవల్ల నిజంగానే నాకు గుర్తింపు వచ్చివుండవచ్చు. అది వేరే విషయం. కానీ గుర్తింపు కోసం నేను రచనలు చేయలేదు. సమాజంలో విశృంఖల స్వైరవిహారం చేస్తూన్న మూఢవిశ్వాసాలు, దోపిడీ దౌర్జనాలు, ఆకలీ హాహాకారాలకు వ్యతిరేకంగా నిరంతరం రాయటమే పోరాటమని నమ్మి రచనారంగంలోకి దిగినవాణ్ణి. రాయకుండా ఉండటం అనేది సాధ్యంగాక రాశాను. ఒక బాధ్యత కలిగిన సామాజికుడుగా నేను నిర్వర్తించగల బలమైన ఏకైక కర్తవ్యమని భావించి మరీ రాశాను. నాకూ, నా కృషికీ తగినంత గుర్తింపు వచ్చిందని మనస్పూర్తిగా నేను నమ్ముతున్నాను. సామాజిక చలనాన్ని ఎంతోకొంత ప్రభావితం చేయగల చైతన్యవంతులయిన మూడు తరాల పాఠకులు నా రచనలను ఆదరించడం అనేది నాకు లభించిన సముచిత గౌరవంగా నేను భావిస్తున్నాను.
ఉద్యమాల ద్వారానే సాధ్యం....
భారతీయ సమాజం ఒక విచిత్రమైన సమాజం. ప్రధానంగా ఇది కులవర్గ సమాజం. ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేని కులవ్యవస్థ ఇక్కడ బలంగా పాతుకునిపోయివుంది. ఇది పరమ అప్రజాస్వామికమైన ఒక ఆధిపత్య వ్యవస్థ. కేవలం ఏదో ఒక రాజకీయ ఉద్యమమే సకల సమస్యలకూ పరష్కార మార్గం కాగలదని భావించడం సరయింది కాదనేది నా నమ్మకం. ఈ వాస్తవాన్ని చరిత్ర అనేకసార్లు రుజువుకూడా చేసింది. కమ్యూనిస్టు పార్టీలు సయితం ఈ వాస్తవాన్ని గుర్తించాయి. సామాజిక విప్లవం అనేది జరగకుండా భారత దేశంలో రాజకీయ ఉద్యమం సత్ఫలితాలను ఇవ్వజాలదనేది ఆదినుంచీ నాకున్న అవగాహన. మనదైన ఒక సాంస్కృతిక ఉద్యమం మన సమాజానికి ఒక తక్షణావసరం. ప్రపంచంలో సాంస్కృతికంగా విముక్తిని సాధించని ఏ జాతీ రాజకీయ విముక్తిని సాధించలేదు. యూర్‌పలో ప్రొటెస్టాంటినిజం తర్వాతనేగాని పారిశ్రామిక విప్లవం విజయవంతం కాలేదు. ఏతావాతా నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే ఏ ఒక్క ఉద్యమం సర్వరోగ నివారిణి కాజాలదు. నిర్దిష్ట ఉద్యమాలు, పోరాటాల ద్వారానే నిర్దిష్ట సమస్యల పరిష్కారం సాధ్యమవుతుంది.
విరసం తొలి మహాసభ....
నేను ఖమ్మంలో జరిగిన విప్లవ రచయితల సంఘం తొలి మహాసభలకు హాజరయ్యాను. పుచ్చలపల్లి సుందరయ్యగారిమీద బుర్రకథ నాజర్ అతి దారుణమైన ఆరోపణలు చేశాడు. నాకు చాలా కోపం వచ్చింది. ఆగ్రహాన్ని ఆపుకోవటం నాకు సాధ్యం కాలేదు. అక్కడికక్కడే, అప్పటికప్పుడే నా అసమ్మతినీ, ఆగ్రహాన్నీ వ్యక్తం చేశాను. నా మనస్తత్వం బాగా ఎరిగివున్న మిత్రులు కె.వి. రమణారెడ్డి నన్ను అక్కడినుంచి బయటికి తీసుకువెళ్ళి సముదాయించే ప్రయత్నం చేశారు. కానీ ఆ వ్యాఖ్యలను నేను ఏమాత్రం హరాయించుకోలేకపోయాను. నిజానికి నేను ఏనాడూ ఏ కమ్యూనిస్టు పార్టీలోనూ సాంకేతికంగా సభ్యుణ్ణి కాను. కానీ, ఊహ తెలిసినప్పటి నుంచీ మానసికంగా నేను కమ్యూనిస్టునే.
సుందరయ్య, నాగిరెడ్డి, బాపనయ్య....
రాజకీయ నాయకులలో చాలామంది పెద్దలు నా పట్ల ఎంతో వాత్సల్యంతో వ్యవహరించేవారు. ప్రధానంగా పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డి నాతో సన్నిహితంగా వ్యవహరించడమే కాదు, నా రచనలను క్షుణ్ణంగా చదివి సీరియ్‌సగా నాతో చర్చలు జరిపేవారు. అలాగే గుంటూరు బాపనయ్య నాతో చాలా సన్నిహితంగా ఉండేవారు. మాకినేని బసవపున్నయ్య నా గురించి రాయటం చెప్పుకోదగిన ఒక అనుభవం.
ఖడ్గసృష్టి గురించి...
నన్ను ప్రభావితం చేసిందీ, నేను కవిగా మారటానికి కారణభూతమయినదీ మహాప్రస్థానం. కానీ నేను దానిమీద పుస్తకం రాయలేదు. ఖడ్గసృష్టి మీద రాశాను. నిజమే. అయితే శ్రీశ్రీ ఖడ్గసృష్టి కావ్యపరామర్శ ఆనాటి ఒక చారిత్రక అవసరంలో భాగంగా వచ్చిందని మాత్రం చెప్పగలను. శ్రీశ్రీకి ఏకలవ్య శిష్యుడననేది నాకు నేనుగా చేసుకున్న ఒక సెల్ఫ్ డిక్లరేషన్. తెన్నేటి సూరి ఒక పాటలో చెప్పినట్లు మన కవిని మనం బతికించుకోవాలి, మన కవిని మనం కాపాడుకోవాలి. అది మన అందరి విద్యుక్తధర్మం. ఆ విద్యుక్త ధర్మ నిర్వహణలో భాగమే ఆ పరామర్శ. ఇక్కడ మరో వాస్తవాన్ని కూడా వివరించాలి. 1955 ఫిబ్రవరి ప్రాంతంలో శ్రీశ్రీ మీద దాడి జరిగినపుడు కూడా నన్ను నేనొక పెద్ద సాంస్కృతిక యోధునిగా సంభావించుకుని శ్రీశ్రీ మీద దాడికి దిగిన శత్రు శిబిరం మీద ఒంటరిగానే రచనల ద్వారా విరుచుకుపడ్డాను.
వివి, కెవిఆర్‌లు నాకు ఆత్మీయులు
మౌలికంగా నేను ఇమోషనల్ జీవినేగాని అతివాదం, అరాచకం నా వ్యక్తిత్వానికీ, మనస్తత్వానికీ అసలు ఏమాత్రం సరిపడని అంశాలు. బహుశా అందుకే నేను దిగంబర కవితా ఉద్యమానికీ, విరసానికీ దూరంగా ఉండిపోయానేమో అనిపిస్తుంది. నిజానికి దిగంబర కవుల్లో, విరసం సభ్యుల్లో నాకు చాలామంది మిత్రులు ఉన్నారు. ఉదాహరణకి కె.వి.రమణారెడ్డి, వరవరరావులు నాకు చాలా ఆత్మీయులు. దిగంబర కవుల్లో నగ్నముని, జ్వాలాముఖి నాకు మంచి స్నేహితులు.
చేసిన తప్పు....నాస్తికత్వాన్నీ, హేతువాదాన్నీ నిరంతరం ప్రచారం చేయవలసిన అవసరం మన సమాజానికి ఎంతైనా వుంది. ఒక దశలో నేను, రావిపూడి వెంకటాద్రి, కత్తి పద్మారావు, ఈశ్వరప్రభు వంటివాళ్ళం ఒక ఉద్యమ స్థాయిలో అటువంటి కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి ప్రయత్నించాం. ఆ పని మరింత పెద్ద యెత్తున జరగవలసిన అవసరం ఈరోజు వుంది. కానీ అటువంటి బాధ్యతను మోయటానికి ప్రస్తుతం ఎవరూ సిద్ధంగా లేరు. చేసిన తప్పు చెప్పుకుంటే పోతుందని నేను అనుకోనుగానీ మా తరువాతి తరాన్ని మేం తీర్చిదిద్దుకోలేకపోయామనే బాధ మాత్రం నాకు చాలావుంది.
దళిత సాహిత్యం గురించి...
గుర్రం జాషువాలో కులచైతన్యం వుందనటం కేవలం గుడ్డితనం. జాషువా గారి గబ్బిలం కావ్యంతో సరితూగే రచనలు చేతివేళ్ళమీద లెక్కించదగినన్ని కూడా లేవు, లేవు, లేవు. జాషువా నిస్సందేహంగా ఒక మహాకవి. కవులుగా పెద్దపెద్ద భుజకీర్తులు తగిలించుకున్న వారికి ఇవాళ దిక్కూదివాణం లేదు. కానీ జాషువా పద్యాలు పీడిత ప్రజా సమూహాల నాల్కలమీద పారాడుతూ ఒక తరం నుంచి మరో తరానికి అందుతున్నాయి. దళితులను గురించి దళితులు మాత్రమే రాయాలని అననుగానీ దళితులను గురించి దళితేతరులు అంత శక్తివంతంగా రాయలేరని మాత్రం చెప్పకుండా వుండలేను. భారతీయ సామాజిక వికాసానికి దళిత సాహిత్యం అనివార్యమైన అవసరం. దళిత సాహిత్యవికాసం అనేక రూపాలలో భారతీయ సాహిత్యాలకు మేలు చేస్తుంది. అయితే దళిత సాహిత్యం కేవలం తనను గురించి తాను చెప్పుకునే సాహిత్యంగానే మిగిలిపోకూడదు. ఆ తరువాతి దశల దిశగా కూడా అది అడుగులు ముందుకు వేయాలి. దళిత ఉద్యమ వైతాళికుడు కుసుమ ధర్మన్న కాంట్రిబ్యూషన్ గురించి ఒక పుస్తకం రాశాను. అదే నా చిట్టచివరి పుస్తకం.
ఖాదర్ మొహియుద్దీన్
(జూన్ 28న విజయవాడలోని వేదిక కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటల నుంచి
‘సివి సమగ్ర రచనలు-సమాలోచన’ కార్యక్రమం)
|
No comments:
Post a Comment