సీఎంగా ఉండి ఇతర పార్టీ నేతల ఇళ్లకు వెళతారా?.. ఇది ప్రలోభపెట్టడం.. అవినీతి కాదా?
- 63 మంది 85 ఎలా అయ్యారు?
- టీఆర్‌ఎస్‌కు టీ.టీడీపీ సవాల్
- చట్ట సమ్మతం కాని టేపులతో కేసులా?: యనమల
- నాయినీ.. తాటాకు చప్పుళ్లకు బెదరం: సోమిరెడ్డి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): ‘‘టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేసిన ఫోన్ల సమాచారం మా దగ్గర ఉంది. కేసులు పెడతామని హోం మంత్రి నాయిని అంటున్నారు. మేం దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అయితే, కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు చేసిన ఫోన్లపై విచారణ చేసే దమ్ము టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఉందా? ఉంటే ముందుకు రండి’’ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ సవాల్ విసిరింది. రేవంత్ రెడ్డి కేసుపై పెద్ద గందరగోళం జరిగిన తర్వాత కూడా, టీఆర్‌ఎస్ నేతలు టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ఫోన్లు చేసి తమ పార్టీలోకి రావాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారంది. ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు రావుల చంద్రశేఖరరెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రాజారాం యాదవ్, పి.రాములు గురువారం విలేకరులతో మాట్లాడారు. ‘‘ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా కేసీఆర్ టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి నాలుగైదు గంటలు కూర్చుని, వారిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకొన్నారు. ఒక ముఖ్యమంత్రి ఇతర పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? అది రాజకీయ అవినీతి కాదా? టీఆర్‌ఎ్‌సకు 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి 85 ఓట్లు ఎలా పడ్డాయి? దానికి సూత్రధారి ఎవరు? వీటిపై విచారణ జరపవద్దా? టీడీపీ నుంచి టీఆర్‌ఎ్‌సలోకి వెళ్లిన ఒక ఎమ్మెల్యే తనకు రూ.250 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని బహిరంగంగా చెప్పారు. ఒప్పుకొంటే పనులు.. ప్యాకేజీలు. లేకపోతే పోలీసులా? చంద్రబాబుతోపాటు వీటన్నింటిపైనా విచారణ చేద్దాం. చేతనైతే రండి’’ అని రావుల సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై తాము ఎవరికీ ఏ సీడీలూ ఇవ్వలేదని ఏసీబీ అధికారులు చెబుతుంటే, తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలూ ఉన్నాయని హోం మంత్రి చెబుతున్నారని విమర్శించారు. ‘‘ఎవరుపడితే వాళ్లు ఫోన్లు ట్యాప్ చేస్తారా? దీనికేమీ చట్టాలు లేవా? ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఎవరికి ఫోన్లు చేసినా అవి వినపడవు. ప్రత్యర్థి పార్టీల ఫోన్లు మాత్రం వినపడతాయి’’ అని ధ్వజమెత్తారు. ఒక సామాజిక వర్గాన్ని పనిగట్టుకొని అణగదొక్కడానికి ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని వేం ఆరోపించారు. తెలంగాణలో తాము తప్ప మరొకరు ఉండకూడని రాజకీయ శూన్యత సృష్టించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని రాజారాం యాదవ్ ఆరోపించారు.
మా దగ్గరా ఆధారాలున్నాయి: ఎర్రబెల్లి
ఎమ్మెల్సీ ఎన్నికల కోసం టీడీపీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోలు చేసినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు.
కక్షసాధింపునకు పరాకాష్ట: యనమల
చంద్రబాబుపైనే కేసు పెట్టాలనడం కక్ష సాధింపునకు పరాకాష్ట అని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. స్టింగ్ ఆపరేషన్ చట్టసమ్మతం కాదని సుప్రీం కోర్టు గతంలో తీర్పు ఇచ్చిందని.. చట్టసమ్మతం కాని టేపులతో రేవంత్ రెడ్డిపై కేసు ఎలా పెట్టారని ప్రశ్నించారు. నాయిని నర్సింహారెడ్డి తాటాకు చప్పుళ్లకు తాము భయపడేది లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పష్టం చేశారు. నాయిని కుతంత్రాలకు ప్రజలే బుద్ధి చెబుతారని చెప్పారు.
సీడీలను ప్రభుత్వమే విడుదల చేసినట్లుంది: కామినేని
రేవంత్ కేసులో సీడీలను ప్రభుత్వమే విడుదల చేసినట్లు ఉందని ఏపీ మంత్రి కామినేని అన్నారు.
No comments:
Post a Comment