|
విశాఖపట్నం, జూన్ 24 : తెలంగాణ ప్రభుత్వం సెక్షన్-8కు ఒప్పుకోకపోతే విభజననే లేదని ఏపీఎన్జీవో నేత అశోక్‌బాబు అన్నారు. బుధవారం జిల్లాలో ఆంధ్రుల ఆత్మగౌరవం సెక్షన్-8 అమలుపై ఏపీ జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ అన్ని సెక్షన్లు చెల్లినప్పుడు సెక్షన్- 8 ఎందుకు చెల్లదని ప్రశ్నించారు.
సెక్షన్-8ను చూపించి హైదరాబాద్‌పై అధికారం చెలాయించాలన్న ఉద్దేశం తమకు లేదని...హైదరాబాద్‌లో ఉన్న వారి కోసమే సెక్షన్-8 కోరుతున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శాంతిభద్రతల సమస్య లేదని అనడం దురదృష్టకరమన్నారు.
హైదరాబాద్‌లో ఆంధ్రులు ఎవరూ ఉద్యోగం చేయటానికి వీల్లేదని సీఎం కేసీఆరే చెప్పారని ఆయన గుర్తుచేశారు. జీహెచ్‌ఎంసీలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను రిలీవ్ చేయడంతో ఉద్యోగులపై కక్ష సాధింపు మొదలైందన్నారు. హైదరాబాద్‌లో వివిధ విభాగాల్లో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను ఏకపక్షంగా రిలీవ్ చేశారన్నారని మండిపడ్డారు.
విభజన చట్టంలో రాష్ట్రంలోని పలు వ్యవస్థలను 9,10 షెడ్యూల్ క్రింద కేంద్రప్రభుత్వం విభజించిందని వీటి పంపిణీ కోసం పలు కమిటీలను కూడా నియమించిందన్నారు. అయితే 9,10 షెడ్యూల్ తమవే అంటూ తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా అధికారులను కార్యాలయాల్లోకి రానీయకుండా చేసిందని అశోక్‌బాబు ఆరోపించారు.
ఏపీఎన్జీవో కార్యాలయంపై పలుమార్లు దాడులు చేశారన్నారు. హైదరాబాద్‌లో ఆంధ్రా ఉద్యోగులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారన్నారు. పదేళ్ల వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అని ఆయన స్పష్టం చేశారు. ఏపీలో రాజధాని నిర్మాణానికి ఐదేళ్లు పడుతుందన్నారు. పది సంవత్సరాల పాటు ఉమ్మడి విద్యా అవకాశాలు ఇస్తే...గత విద్యా సంవత్సరం నుంచే మా ఎంసెట్ మాదే అంటూ విద్యార్థులందరికీ నష్టం కలిగించే విధంగా చేశారన్నారని అశోక్‌బాబు వ్యాఖ్యానించారు.
ఏపీపై గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారన్నారు. హైదరాబాద్‌ను వదిలి వచ్చేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. హైదరాబాద్‌పై తమకేమీ ప్రత్యేకమైన మమకారం లేదన్నారు. రాజధానిని నిర్మించినా నిర్మించకపోయినా తాము వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఏపీ ప్రభుత్వానికి స్పష్టం చేశారు. 9,10 షెడ్యూల్లోని సంస్థలను సరిగ్గా విభజించకపోతే,...ఆంధ్రప్రదేశ్‌కు రూ.25వేల కోట్ల నష్టం కలుగుతుందన్నారు.
స్పౌస్ కేటగిరీకి తెలంగాణ ఒప్పుకోవడం లేదన్నారు. విభజన వల్ల ఉద్యోగులకే ఎక్కువ నష్టం వాటిల్లుతోందన్నారు. హైదరాబాద్‌ను అగ్నిగుండంలా చేస్తే తెలంగాణానే నష్టమని అశోక్ అన్నారు. అగ్నిగుండాల ద్వారా సమస్య పరిష్కారం కాదని...రాజకీయంగా పరిష్కరించుకోవాలని సూచించారు. విభజన వల్ల ఉద్యోగులు, విద్యార్థులు నష్టపోతున్నారని, న్యాయం జరగకపోతే కేంద్రంపై ఒత్తిడి తెస్తామని...అందుకు ప్రజాప్రతినిధులు తమకు అండగా నిలవాలని అశోక్‌బాబు పిలుపునిచ్చారు.
|
No comments:
Post a Comment