Monday, 22 June 2015

బాబుకు నోటీసులు లేనట్టే?

బాబుకు నోటీసులు లేనట్టే?
ఎస్ఎఫ్ఎల్‌కు టీ ముఖ్యుల మౌఖిక ఆదేశం!

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబుకు వాయిస్‌ టెస్ట్‌ నిర్వహించొద్దని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ (ఎస్ఎఫ్ఎల్‌) అధికారులకు మౌఖిక ఆదేశాలు అందాయా? ఆయనకు ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని ఎస్ఎఫ్ఎల్‌కు టి-సర్కార్‌లోని ఉన్నతవర్గాలు సూచించాయా? విశ్వసనీయ వర్గాలు ఈ ప్రశ్నలకు ఔననే సమాధానమిస్తున్నాయి. చంద్రబాబు స్థాయి వ్యక్తికి నోటీసులు ఇచ్చినా, వాయిస్‌ టెస్ట్‌ చేసినా అది వివాదాస్పదమవుతుందని భావిస్తున్న తెలంగాణ పోలీసులు ఈ విషయంలో సంయమనంతో ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ అంశాన్ని సర్కార్‌లోని పెద్దలతో చర్చించిన అనంతరం వారి సూచనల మేరకు ఓటుకు నోటు కేసులో చంద్రబాబుకు నోటీసులు జారీ చేయడం వంటివి చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు ఎఫ్‌ఎ్‌సఎల్‌ నోటీసులు ఇవ్వనుందని, బాబు అరెస్టు తప్పదంటూ.. రెండు టీవీ చానెళ్లలో కథనాలు ప్రసారమైన నేపథ్యంలో అందులో ఉన్నది చంద్రబాబు గొంతే కాదని, అతుకులున్నాయని ఏపీ మంత్రులు ఎదురుదాడికి దిగారు. దీంతో టి-పోలీసులు అప్రమత్తమయ్యారని సమాచారం. ఆడియోలో ఉన్నది చంద్రబాబు గొంతా.. కాదా అన్నది ప్రస్తుతానికి అనవసరమని, ఆయనకు ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వొద్దని ఎఫ్‌ఎ్‌సఎల్‌ అధికారులను పోలీసు ఉన్నతవర్గాలు మౌఖికంగా ఆదేశించినట్లు సమాచారం. ఈ అంశంపై ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ.. ‘వాయిస్‌ టెస్ట్‌ కోసం ఎవ్వరూ ఎస్ఎఫ్ఎల్‌కు రారు. వచ్చినా గొంతు మార్చి మాట్లాడుతారు. అవి కోర్టులో నిలబడవు’ అని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పటికే ఎఫ్‌ఎ్‌సఎల్‌కు ఆడియోను ఏసీబీ అధికారులు అందజేసినందున ఏమి చేయాలనే దానిపై ఎఫ్‌ఎ్‌సఎల్‌ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. చంద్రబాబుకు సంబంధించిన పాత ఆడియో క్లిప్పులు తెప్పించుకొని పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో చంద్రబాబు అసెంబ్లీలో, బహిరంగ సభల్లో మాట్లాడిన పలు ఆడియో క్లిప్పులు తెప్పించుకొని స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్లు చెబుతున్న ఆడియో క్లిప్పుతో పరీక్షించనున్నట్లు సమాచారం. 

No comments:

Post a Comment