Tuesday, 23 June 2015

మాల్స్‌లో మద్యం..మండలానికో సర్కారీ దుకాణం

మాల్స్‌లో మద్యం..మండలానికో సర్కారీ దుకాణం

  • కనిష్ఠం రూ.30 లక్షలు.. గరిష్ఠం రూ.65 లక్షలు
  • నూతన ఎక్సైజ్‌ పాలసీ ప్రకటించిన ఏపీ సర్కార్‌
  • జూలై ఒకటో తేదీ నుంచి అమలు
హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): మద్యం దుకాణాలకు జనాభా ఆధారంగా లైసెన్స్‌ ఫీజులను వసూలు చేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. లైసెన్స్‌ ఫీజులను కనిష్ఠంగా రూ.30 లక్షలు, గరిష్ఠంగా రూ.65 లక్షలుగా నిర్థారించింది. రెండేళ్లపాటు (2015-17) అమల్లో ఉండేలా నూతన ఎక్సైజ్‌ విధానాన్ని సోమవారం ప్రకటించింది. ఈ విధానం జూలై ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది.
 
దాని ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా 4,380 దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మద్యం దుకాణాల లైసెన్స్‌ ఫీజులకు 2011 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోనుంది. ఇక, ఈసారి కూడా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, పట్టణాలు, గ్రామాల్లో లాటరీ ద్వారానే మద్యం దుకాణాల లబ్ధిదారులను ఎంపిక చేయనుంది. ఎమ్మార్పీ రేటును మించి మద్యం విక్రయిస్తున్నారంటూ ఎప్పటినుంచో ఫిర్యాదులు ఉన్న విషయం తెలిసిందే. ఎమ్మార్పీ రేటు అతిక్రమణతోపాటు కల్తీ మద్యం, నాటుసారా విక్రయాలను అరికట్టేందుకు మండలానికి ఒక సర్కారీ మద్యం దుకాణాన్ని నిర్వహించనుంది. మొత్తం దుకాణాల్లో పది శాతానికి తగ్గకుండా సర్కారీ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని ఎక్సైజ్‌ పాలసీలో స్పష్టంగా పేర్కొంది. పోలవరం ముంపు మండలాల్లో కూడా మద్యం దుకాణాలకు లైసెన్సులు జారీ చేయాలని సర్కారు నిర్ణయించింది.
 
రాష్ట్రంలో తొలిసారి టెట్రా మద్యం ప్యాక్‌ను ప్రవేశపెట్టనుంది. ఈసారి కొత్తగా షాపింగ్‌ మాల్స్‌, హైబ్రిడ్‌ హైపర్‌ మార్కెట్లలోనూ మద్యం దుకాణాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం దుకాణాలను నియంత్రించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లా లో వైద్యఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో డీ ఆడిక్షన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు.
 
మద్యం సిండికేట్లకు చెక్‌: మంత్రి రవీంద్ర
రాష్ట్రంలో పాతుకుపోయిన మద్యం సిండికేట్లకు చెక్‌ పెట్టేలా నూతన మద్య విధానాన్ని ప్రకటించామని ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. మద్యం సిండికేట్లు, ఏసీబీ కేసుల్లో చిక్కుకున్న వ్యాపారులకు అనుమతులివ్వకుండా మార్గదర్శకాలు రూపొందించామన్నారు. రెండేళ్ల వ్యాట్‌ రిటర్న్స్‌, పాన్‌, ఆధార్‌ను తప్పనిసరి చేశామన్నారు. 2బి బారు లైసెన్సులను 3 నెలలకు పొడిగిస్తున్నట్లు తెలిపారు. ఎ4 షాపుల ఏర్పాటుకు దరఖాస్తులకు సోమవారం నోటిఫికేషన్‌ జారీ చేశామని మంత్రి రవీంద్ర చెప్పారు. దీనికి ఈనెల 27ను తుది గడువుగా నిర్ణయించామని చెప్పారు. 28న దరఖాస్తులను పరిశీలించి, 29న లాటరీ తీస్తామని, ఎంపికైన వ్యాపారులకు 30వ తేదీన ప్రొవిజనల్‌ లైసెన్సులు ఇస్తామని, జూలై ఒకటి నుంచి విక్రయించొచ్చన్నారు.
 

No comments:

Post a Comment