Wednesday, 24 June 2015

భాగ్యనగరి.. గవర్నర్‌ గిరీ

భాగ్యనగరి.. గవర్నర్‌ గిరీ
రాజభవన్‌ కోర్టులో బంతి.. నరసింహన్‌ ఏం చేస్తారు?

  • గవర్నర్‌దే నిర్ణయం.. అదే ఫైనల్‌
  • సంచలన సూచనలు చేసిన ఏజీ 
  • గవర్నరే నోటిఫికేషన్‌ రూపొందించాలి
  • తెలంగాణ అభిప్రాయాలు తీసుకోవాలి
  • సీఎంకు 3 రోజులు సమయం ఇవ్వొచ్చు
  • ఆ తర్వాత గవర్నరే దాన్ని జారీ చేయొచ్చు
  • తెలంగాణ సర్కారునూ ఆదేశించవచ్చు
  • అనుమతి లేకుండా జోక్యం వద్దనొచ్చు
  • కేసుల్లో ప్రత్యక్ష పర్యవేక్షణ చేయవచ్చు
  • గవర్నర్‌కు ముకుల్‌ రోహత్గీ లేఖ

సెక్షన్‌ 8పై ‘ఫైట్‌’ టైట్‌గా మారుతోంది. ‘ఉమ్మడి’ గవర్నర్‌ నరసింహన్‌కు అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ లేఖతో వాతావరణం వేడెక్కింది. సెక్షన్‌ 8 ప్రకారం హైదరాబాద్‌లో గవర్నర్‌కు ‘ప్రత్యేక బాధ్యతలు’ మాత్రమే కాదు... విశేష అధికారాలూ ఉంటాయనేలా రోహత్గీ అభిప్రాయపడ్డారు. ‘సకలం, సర్వం గవర్నరే’ అని తేల్చి చెప్పారు. తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ గవర్నర్‌ను కలిశారు. హైదరాబాద్‌లో సెక్షన్‌ 8 అమలు చేస్తే... ఢిల్లీ స్థాయిలో పోరాటం తప్పదని హెచ్చరించారు. స్వయంగా తానే ఆమరణ దీక్ష చేస్తానని కేసీఆర్‌ చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ మంత్రులు, ఇతర ప్రముఖులూ ఇదే స్థాయిలో స్పందించారు. మరోవైపు... సెక్షన్‌ 8 అమలు చేసి తీరాల్సిందేనని ఏపీ మంత్రులు తేల్చి చెప్పారు. ఈ సెక్షన్‌ చెల్లదంటే, రాష్ట్ర విభజన చట్టం కూడా చెల్లదని తెలిపారు. ఎవరి వాదన వారిదే. బంతి మాత్రం ‘రాజ్‌ భవన్‌ కోర్టు’కు చేరింది. ఇక ఏం జరగనుంది? గవర్నర్‌ ఏం చేస్తారు? నోటిఫికేషన్‌పై ముందుకెళతారా? సెక్షన్‌ 8ను అమలు చేస్తారా? ఇదీ ఇప్పుడు ప్రశ్న!

హైదరాబాద్‌, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): ‘మీదే నిర్ణయం. మీరు చెప్పిందే ఫైనల్‌. ఇక అంతా మీ ఇష్టం!’ అని గవర్నర్‌ నరసింహన్‌కు అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీ విస్పష్టంగా తెలిపారు. ఉమ్మడి రాజధానిలో ‘ప్రత్యేక బాధ్యతల’పై సంచలన సూచనలు చేశారు. సెక్షన్‌-8కు సంబంధించి సందేహాలన్నీ తీర్చి, గవర్నర్‌కు ‘స్పష్టత’ ఇచ్చారు. ‘మీరు నోటిఫికేషన్‌ జారీ చేసుకోవచ్చు’ అని గవర్నర్‌కు తెలిపారు. ఈ లేఖ ప్రతిని ‘ఆంధ్రజ్యోతి’ సంపాదించింది. నరసింహన్‌ను ‘మైడియర్‌ గవర్నర్‌’ అంటూ ముకుల్‌ రోహత్గీ సంబోధించారు. ‘‘2015 జూన్‌ 16వ తేదీన మీరు రాసిన లేఖతోపాటు జతచేసిన పత్రాలను పరిశీలించాను. మొదట చెప్పేదేమిటంటే... ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం మీరు జారీ చేయాలనుకుంటున్న నోటిఫికేషన్‌పై మీరు తొలుత విధిగా తెలంగాణ మంత్రివర్గాన్ని సంప్రదించాలి. తెలంగాణ సీఎంకి నోటిఫికేషన్‌ ముసాయిదాను పంపి, దీనిపై ఆయన అభిప్రాయాలను కోరవచ్చు. కావాలంటే ఈ అంశంపై స్పందించడానికి ఆయనకు మూడు రోజులు సమయం ఇవ్వొచ్చు. ఆ తర్వాత మీ విచక్షణ మేరకు నోటిఫికేషన్‌ జారీ చేసేయవచ్చు. తెలంగాణ సీఎం నుంచి విలువైన సూచనలు వచ్చిన పక్షంలో, వాటిని నోటిఫికేషన్‌లో చేర్చవచ్చు. కానీ... దీనిపై తుది నిర్ణయం మాత్రమే మీదే’’ అని నరసింహన్‌కు రాసిన లేఖలో అటార్నీ జనరల్‌ స్పష్టంగా చెప్పారు.
అంతా మీరు చెప్పినట్లే!
‘నోటిఫికేషన్‌ మీ సంతకంతోనే జారీ చేయాలి’ అని ముకుల్‌ రోహత్గీ గవర్నర్‌కు సూచించారు. నోటిఫికేషన్‌ ముసాయిదాను తన సలహాదారులతో కలిసి గవర్నరే రూపొందించుకోవాలని ఏజీ తెలిపారు. ‘‘ముసాయదా నోటిఫికేషన్‌ మీ సలహాదారులే రూపొందించాలి. ఆ పని మా కార్యాలయంలో చేయం. (నోటిఫికేషన్‌లో..) తెలంగాణ ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులను మాత్రమే కాదు... తెలంగాణ ప్రభుత్వాన్నీ మీరు ఆదేశించేలా జాగ్రత్త తీసుకోండి. మరోరకంగా చెప్పాలంటే, (మీరు ఒకసారి ఉద్యోగులకు దిశా నిర్దేశం చేశాక) తెలంగాణ ప్రభుత్వం తన అధికారులకు మళ్లీ ఆదేశాలు జారీ చేయక్కర్లేదు’’ అని ఏజీ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంకానీ, అధికారులుకానీ, ఉద్యోగులుకానీ, ఇతర యంత్రాంగం కానీ... ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఉమ్మడి గవర్నర్‌ ముందస్తు అనుమతి లేకుండా (ఆయా అంశాలపై) జోక్యం చేసుకోరాదని నిర్దేశించవచ్చునని తెలిపారు. అంతేకాదు... పై అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, ప్రభుత్వ అధికారులు/ఉద్యోగులు క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లయితే, వాటి దర్యాప్తు తన పర్యవేక్షణలోనే జరగాలంటూ గవర్నర్‌ ఆదేశించవచ్చునని ముకుల్‌ రోహత్గీ తెలిపారు.

గవర్నర్‌ ‘కోరిన’ మేరకే!
గవర్నర్‌ లేఖ మేరకే అటార్నీ జనరల్‌ తన అభిప్రాయం పంపినట్లు తెలుస్తోంది. ముకుల్‌ రోహత్గీ స్పందనను పరిశీలిస్తే... సెక్షన్‌ 8కు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ చేసేందుకు గవర్నర్‌ సిద్ధమైన తర్వాతే రోహత్గీ అభిప్రాయం కోరారు. నోటిఫికేషన్‌ ముసాయిదాను కూడా ఏజీ కార్యాలయమే రూపొందించాలని కూడా ఆయన ఆకాంక్షించారు. నోటిఫికేషన్‌ ఎలా ఉండాలి, ఏయే అంశాలు పొందుపరచాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలన్నీ అటార్నీ జనరల్‌ వివరించడం విశేషం. ‘రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 8 ప్రకారం’ అని లేఖ రెండో లైన్‌లోనే తెలిపారు. ఈ లేఖలో ఎక్కడా ‘ఉమ్మడి రాజధాని’ అనే మాట లేనప్పటికీ... సెక్షన్‌ 8 ఉమ్మడి రాజధానికి సంబంధించినది కాబట్టి, లేఖలో వ్యక్తం చేసిన అభిప్రాయాలన్నీ దానికే పరిమితమని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

No comments:

Post a Comment