Friday 30 October 2015

బెజవాడకు బైబై...నూతన రాజధాని అమరావతి చెంతకు ఛలోఛలో

బెజవాడకు బైబై...నూతన రాజధాని అమరావతి చెంతకు ఛలోఛలో 
Updated :31-10-2015 08:38:08
విజయవాడ నుంచి తరలివెళ్ళటానికి
వర్తక, వాణిజ్యవేత్తల నిర్ణయం
500 ఎకరాల కొనుగోలుకు
ప్రభుత్వానికి ప్రతిపాదన
ఆసియాలోనే భారీ వర్తక, 
వాణిజ్య వాడ నిర్మాణంపై దృష్టి
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
వర్తక, వాణిజ్య కేంద్రంగా ఉన్న విజయవాడ.. ఇక అందుకు బైబై చెప్పనున్నది. ఎన్నో సంవత్సరాలుగా వ్యాపారాలు చేస్తూ ఉన్న నిర్వాహకులు ఇక్కడి నుంచి తరలి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ప్రాచీన నగరం విజయవాడతో రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన వర్తక, వాణిజ్యం తరలిపోనున్నది. నగరం విస్తరించకపోవటం, ఇరుకు రోడ్లు , జనావాస ప్రాంతాలలోనే వ్యాపారాలు నిర్వహించాల్సి రావటంతో రాజధాని ప్రాంతానికి తరలి పోవాలని నిర్ణయించుకున్నారు. ఆసియాలోనే అత్యంత భారీ వర్తక, వాణిజ్య వాడను నందిగామ, కంచికచర్లలో సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని వీరంతా నిర్ణయించారు. ఈ మేరకు ఇటీవలే వీరంతా సమావేశమై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడే విజయవాడ వర్తక, వాణిజ్య వాడగా పేరుగాంచింది. రోమ్‌ దేశంతో వ్యాపార సంబంధాలు ఎక్కువుగా జరిగేవని బకింగ్‌హామ్‌ కాలువలో లభించిన నాణాల ఆధారంగా అనేక విషయాలు బహిర్గతమయ్యాయి. అలాంటి వర్తక, వాణిజ్యం విజయవాడ నుంచి తరలిపోతే, నగరానికి జరిగే నష్టమేమిటన్నది కూడా ఆలోచించాల్సి ఉంది. వర్తకులు, వాణిజ్యవేత్తలంతా తీసుకున్న నిర్ణయాన్ని కూడా స్వాగతించాల్సిందే. వారికి ఉన్న ఇబ్బందులు, నగరంలో ఉన్న ట్రాఫిక్‌ రద్దీ, ఇరుకు రోడ్లు వంటివి వర్తక, వాణిజ్యానికి అనువుగా లేవు. దీనిని దృష్టిలో ఉంచుకుని కూడా వర్తక వాణిజ్యం అంతా ఏకతాటిపైకి వచ్చింది. నగరంలో వర్తకులంతా వివిధ ప్రాంతాలలో వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పాతబస్తీలో కాళేశ్వరరావు మార్కెట్‌, వన్‌టౌన్‌ మార్కెట్‌, వస్త్రలత, ఐరన్‌ యార్డు, హార్డ్‌వేర్‌, కూరగాయలు, పండ్ల మార్కెట్‌, పప్పుల మార్కెట్‌ ఇలా అనేక వ్యాపారాలన్నీ వేర్వేరు చోట్ల ఉన్నాయి. ఈ ప్రాంతాలలో రద్దీ కూడా విపరీతంగా ఉంది. ఈ ప్రాంతాల నుంచి సరుకు తీసుకు వెళ్ళాలన్నా.. తరలించాలన్నా, దిగుమతి చేసుకోవాలన్నా కూడా ఇబ్బందికరమైన విషయమే. దీంతో రాజధాని ప్రాంతానికి సమీపంలో వీరంతా తరలిపోవాలనుకోవటం కూడా ఒక రకంగా నూతన రాజధానికి శుభపరిణామమే.
వర్తక, వాణిజ్య ప్రతినిధులంతా కలిసి 500 ఎకరాల కోసం ప్రతిపాదన చేశారు. ఈ 500 ఎకరాలను పూర్తిగా తమ సొంత డబ్బుతో కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొనుగోలు చేసిన భూములలో సీఆర్‌డీఏ నిబంధనల ప్రకారం లే అవుట్లు వేయటం, రహదారులు, డ్రెయినేజీ, మంచినీటి సదుపాయం, విద్యుత్‌ తదితర సదుపాయాలను కల్పించేందుకు ఆయా శాఖలకు డబ్బులు చెల్లించటానికి కూడా వర్తక, వాణిజ్య ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ద్వారా సంప్రదింపులు 
విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను కొద్ది కాలం కిందట వర్తక, వాణిజ్యవేత్తల ప్రతినిధులు కలుసుకుని ఈ ప్రతిపాదన చేశారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. గతంలో గద్దె రామ్మోహన్‌ విజయవాడ ఎంపీగా ఉన్నప్పుడు కొంతమంది హోల్‌సేల్‌ వ్యాపారులు ఇలాంటి ప్రతిపాదన చేస్తే అప్పట్లో సీఎంతో మాట్లాడించి గొల్లపూడిలో హోల్‌సేల్‌ మార్కెట్‌ను నిర్మించటానికి కృషి చేశారు. ఆ తర్వాత వారంతా గొల్లపూడికి వెళ్ళిపోయారు. దీంతో గద్దె రామ్మోహన్‌ను మళ్ళీ మిగిలిన సింహ భాగ వర్తక, వాణిజ్య ప్రతినిధులంతా కలిసి విజ్ఞప్తి చేశారు.
సీఎం సానుకూలత.. వర్తక, వాణిజ్య వేత్తలతో సమావేశం : 
వర్తక, వాణిజ్య ప్రతినిధుల ప్రతిపాదన ను గద్దె రామ్మోహన్‌ గురువారం సీఎం దృష్టికి తీసుకు వెళ్ళారు. ఆయన వెంటనే ఈ ప్రతిపాదన పట్ల సుముఖత వ్యక్తం చేశారు. భూములు కేటాయింపు నుంచి, వర్తక వాణిజ్యవాడ ఏర్పాటు చేసే వరకు ఖర్చులన్నింటినీ తామే భరిస్తామని ఐక్యంగా ముందుకు రావటంతో ప్రభుత్వంపై పడే భారం కూడా ఏమీ లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని సీఎం సానుకూలత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వర్తక, వాణిజ్య ప్రతినిధులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించటం గమనార్హం.
నందిగామ, కంచికచర్లలో నూతన వర్తక, వాణిజ్య వాడ 
నూతన వర్తక, వాణిజ్యవాడను నందిగామ, కంచికచర్ల ప్రాతంలో ఏర్పాటు చేయటానికి సంఘ ప్రతినిధులు నిర్ణయించారు. వర్తక వాణిజ్యవాడను నూతన రాజధానికి అభిముఖంగా, ముఖద్వార సమీపంలో ఏర్పాటు చేయటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం దగ్గర కృష్ణానది మీదుగా ఐకాన్‌ బ్రిడ్జి నిర్మాణంతో రాజధానికి ముఖద్వారం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వ్యాపారులంతా అటువైపు వెళ్ళాలని నిర్ణయించటం గమనార్హం.

No comments:

Post a Comment