Wednesday, 7 October 2015

బాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజొస్తుంది - జగన్

బాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజొస్తుంది

Sakshi | Updated: October 07, 2015 15:50 (IST)
బాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజొస్తుందివీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు : చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందని, ఈయన పాలనకు చరమగీతం పలికే రోజు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరు సమీపంలోని నల్లపాడు రోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరంలో బుధవారం మధ్యాహ్నం ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే...

గుంటూర్.. ఈవాళ ఈ నిరవధిక దీక్షకు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఈ పోరాటంలో సంఘీభావం తెలిపేందుకు తోడుగా మేమంతా ఉన్నామంటూ సంకేతాలివ్వడం కోసం కష్టం అనిపించినా, ఎండను కూడా ఖాతరు చేయకుండా, దూరాలు లెక్క చేయకుండా, చెరగని చిరునవ్వులతో ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
  • ఈవాళ ప్రత్యేక హోదా విషయంగా నిరవధిక దీక్షలు చేస్తున్నాం. ఇంతకన్నా ముందు అందరం కలసికట్టుగా రాష్ట్రంలో బంద్ చేశాం
  • అసెంబ్లీలో సైతం కేంద్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశాం
  • మంగళగిరిలో దీక్ష చేశాం.. ఢిల్లీ వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లాం. ఢిల్లీ వాళ్లకు అర్థం కావాలని అక్కడ సైతం దీక్షలు చేశాం. అయినా ఏ ఒక్కరికీ బుద్ధి రాలేదు.
  • చివరకు ఈ పోరాటం కొనసాగింపులో భాగంగా గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష ఈరోజు ప్రారంభించాం.
  • ఇప్పటికైనా చంద్రబాబుకు ఏం జరుగుతోందో తెలిసి వస్తుందని, ఆయన మనసు మారుతుందని, ఆయన మీద ఒత్తిడి తెస్తే.. ఆయన కేంద్రం మీద ఒత్తిడి తెస్తారని అప్పుడైనా మనకు ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశ.
  • ఈవాళ ప్రత్యేక హోదా కోసం మనమంతా పోరాడుతున్నాం. ఒక్కోసారి నాకు అర్థం కాదు. చంద్రబాబుకు ఈ విషయం తెలిసినా, ఆయన ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, తర్వాత ప్లేటు ఎందుకు మారుస్తున్నారో తెలియట్లేదు
  • అప్పుడు ఐదు కాదు, పదేళ్లు హోదా ఉండాలన్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీటింగులలో చెప్పారు
  • రాష్ట్రాన్ని విడగొట్టద్దని కోరితే వినలేదు
  • ఆరోజు పార్లమెంటులో ఏంజరిగిందో గుర్తు తెచ్చుకుంటే.. అడ్డగోలుగా విడగొట్టారు
  • నాటి ప్రధాని పార్లమెంటులో మైకు పట్టుకుని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతున్నాం, మీకు జరిగిన అన్యాయానికి పరిహారంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు
  • హైదరాబాద్ లాంటి నగరం మనకు లేకపోతే.. చదువుకున్న ప్రతి పిల్లాడు పట్టాతో ఉద్యోగం కోసం వెళ్లేది హైదరాబాద్ నగరానికే అని అందరికీ తెలుసు
  • 95 శాతం సాఫ్ట్ వేర్ పరిశ్రమలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని అందరికీ తెలుసు
  • ఇలాంటి అన్యాయం జరుగుతోంది, జరగబోతోందని.. దానికోసం ప్రత్యేక హోదాతో ఈ అన్యాయాన్ని పూడుస్తామన్నారు
  • ఆరోజు ప్రధాని ఆ హామీ ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, బాబు ఐదు కాదు.. పదేళ్లు చేస్తామన్నారు
  • చివరకు ఇద్దరూ కలిసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టారు.
  • ఎన్నికలకు వెళ్లారు.. ఎన్నికల్లో మేనిఫెస్టోలు కూడా తయారుచేశారు. అందులో కూడా పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పెట్టారు
  • ఏ టీవీలో చూసినా అదే ప్రకటన కనిపించేది
  • అంతటితో ఆగలేదు..ఇంటింటికీ పాంప్లెట్లు తీసుకెళ్లారు. ఏ టీవీ ఆన్ చేసినా జాబు కావాలంటే బాబు సీఎం కావాలని వినిపించేది
  • ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2 వేల భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లున్నాయి.
  • బాబుకు సీఎం జాబ్ వచ్చింది.. మాకేమో ఉన్న జాబులు కూడా పీకేస్తున్నారని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు
  • బాబు ముఖ్యమంత్రి అయ్యారు.. ఒక్క కొత్త ఉద్యోగమూ ఇవ్వలేదు, ఉన్నవి ఊడబీకుతున్నారు
  • రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలున్నాయని విభజించేటప్పుడు లెక్క చూపించారు.
  • డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాది దాటినా ఇంతవరకు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేదు.
  • పైగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్కూళ్లను, హాస్టళ్లను తగ్గించేస్తున్నారు.
  • మిగులు ఉద్యోగాలు వేల సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు.. అంటే, డీఎస్సీ పరీక్షలు రాసిన పిల్లలకు ఎగనామం పెడతామన్న సంకేతాలిస్తున్నారు
  • ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు పెడతారోనని పిల్లలు ఎదురుచూస్తున్నారు.
  • వాటికోసం జిల్లాల నుంచి పెద్ద ఊళ్లకు వచ్చి, అక్కడ కష్టం అనిపించినా బాడుగకు ఇళ్లు తీసుకుని కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఏళ్ల తరబడి కోచింగులు తీసుకుంటున్నారు
  • ఇంతవరకు ఆ పిల్లలకు ఏపీపీఎస్సీ పరీక్షలు పెట్టలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కనీసం క్యాలెండర్ కూడా ప్రకటించలేదు
  • కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన చేస్తున్న వాళ్ల ఉద్యోగాలు లెఫ్ట్, రైట్, సెంటర్ ... ఇలా ఊడబెరుకుతున్నారు
  • 30 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 30 వేల మంది ఆదర్శ రైతులను ఇప్పటికే పీకేశారు. మిగిలినవాళ్లు కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు
  • 40 వేల మంది సంఘమిత్రలు ఉన్నారు.. బాబు సీఎం కాకముందు వాళ్లు రెగ్యులరైజ్ అవుతారనుకున్నారు. అంతకుముందు 4 వేలు వచ్చేది.. దాన్ని 2 వేలకు కోసేశారు
  • పిల్లలు ఉద్యోగాలు దొరక్క, చదివే పిల్లలు కూడా భవిష్యత్తు కోసం సతమతం అవుతున్నారు
  • దాదాపు మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావేమోనని, చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురాడేమో అని భయంతో బెంగతో రాష్ట్రంలో ఐదుగురు చనిపోయారు. నెల్లూరులో లక్ష్మయ్య, తిరుపతిలో కోటి, లోకేశ్వరరావు కర్నూలులో, రామయ్య నెల్లూరులో.. ప్రాణాలు కోల్పోయారు.
  • అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి, దానివల్ల కలిగే మేలేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుసో, తెలియదో నాకు తెలీదు.
  • తెలిసి ఉంటే చంద్రబాబు కాలర్ ఎందుకు పట్టుకోలేదని అడుగుతున్నాను
  • ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. దానివల్ల ప్రధానంగా రెండు మంచి కార్యక్రమాలు జరుగుతాయి
  • ఒకటి.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా ఇస్తారు. 10 శాతం మాత్రమే రుణం అవుతుంది.
  • ప్రత్యేక హోదా లేకపోతే గ్రాంటు 30 శాతమే అవుతుంది, రుణం 70 శాతం అవుతుంది. దానివల్ల రాష్ట్రానికి అప్పులు తగ్గుతాయి. ఇవన్నీ వాళ్లకు తెలుసు.
  • చట్ట ప్రకారం మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రోరైళ్లు, ఇంకా రకరకాల సంస్థలు కట్టిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు.
  • హంద్రీ నీవా, గాలేరు- నగరి, వెలిగొండ అన్నీ చట్టంలో పెట్టారు.
  • ఈ మూడు నాలుగు ప్రాజెక్టులకే కనీసం 10వేల కోట్లవుతుంది. చట్టంలో పెట్టారు కదా అని ఏఐబీపీలో పెట్టిస్తే.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి ఇందులో 90 శాతం గ్రాంటుగా వస్తుంది. అదే ప్రత్యేక హోదా లేకపోతే ఏఐబీపీలో పెట్టినా 25-55 శాతం లోపే గ్రాంటు వస్తుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
  • రాష్ట్రానికి జరిగే ఇంకో మేలు.. మెట్రో రైళ్లు కట్టిస్తామన్నారు. ఉజ్జాయింపుగా ఈ ప్రాజెక్టులకు 15 వేల కోట్లు అవుతుందని లెక్క వేసుకున్నారు. ఇవి తేవడానికి జపాన్, సింగపూర్ వెళ్లి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. అలా చేస్తే ఆ డబ్బులు ఎలాగూ ఈ ప్రాజెక్టులు మన చట్టంలో ఉన్నాయి కాబట్టి ఆ డబ్బు విదేశాల నుంచి తెచ్చుకున్నా కేంద్రం మనకు ఇస్తుంది. ప్రత్యేక హోదా ఉంటే ఆ డబ్బును కేంద్రమే కడుతుంది, వడ్డీలు కూడా కట్టక్కర్లేదు
  • అదే హోదా లేకపోతే.. విదేశాల నుంచి తెచ్చే డబ్బులు, వడ్డీ కూడా మనమే కట్టాల్సి వస్తుంది.
  • ఇవన్నీ చంద్రబాబుకు తెలియనిది కాదు.. అయినా అలాగే మాట్లాడతారు
  • ఇక రెండోది.. మనందరికీ సంబంధించిన మేలు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలైతే మాత్రమే పరిశ్రమలకు రాయితీలు భారీగా వస్తాయి. మన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమ పెడితే, ప్రత్యేక హోదా ఉంటే వాటికి 100 శాతం ఆదాయపన్ను, ఎక్సైజ్ డ్యూటీ, రవాణా ఖర్చులు అన్నీ మినహాయింపు ఉంటాయి. కరెంటు సగం ధరకే 20 ఏళ్ల పాటు లభ్యమవుతుంది
  • ఇలాంటి భారీ ప్రోత్సాహకాలుంటే పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు. పక్క రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వస్తారు
  • 972 కిలోమీటర్ల సముద్ర తీరం మనకుంది. లక్షల కోట్ల పెట్టుబడులతో పిల్లలకు లక్షల ఉద్యోగాలు వస్తాయి
  • ఇలాంటి ప్రోత్సాహకాలు కేవలం ప్రత్యేక హోదా ఉంటేనే వస్తాయి.
  • అప్పుడు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నది మనం మర్చిపోకూడదు.
  • చంద్రబాబు ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు.
  • కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తెస్తే.. పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయంటే అదీ చేయరు
  • ప్రత్యేక హోదా వస్తే నో వేకెన్సీ బోర్డులు ఎక్కడా కనిపించవు.. వాంటెడ్ అనే బోర్డులు కనిపిస్తాయి. అప్పుడు మనమే కంపెనీలను ఎంచుకోవచ్చు
  • చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోరు.. ఇంత మంచి జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు పోరాటం చేయరని ఒక్కోసారి అనిపిస్తుంది
  • ఎందుకో తెలుసా.. ఈమధ్య కాలంలో మనమంతా టీవీలలో చూశాం.
  • చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకుని  ఆ లంచాల ద్వారా తీసుకున్న డబ్బులతో పట్టిసీమ దగ్గర్నుంచి పోలవరం దాకా లంచాలే. బొగ్గు నుంచి ఇసుక, మట్టి వరకు అన్నీ లంచాలే. చివరకు మద్యాన్ని తగ్గిస్తామని.. దాన్ని పెంచేందుకు లైసెన్సుల కోసం కూడా లంచాలే
  • ఈ లంచాల డబ్బును ఏం చేయాలోతెలియక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యేకు 5 నుంచి 20 కోట్ల వరకు వెచ్చించి కొనడానికి ప్రయత్నించి అడ్డంగా వీడియో, ఆడియోలలో దొరికిపోయారు
  • ఆ టేపులు వింటే మనకంతా వినిపిస్తుంది.. 'మనోళ్లు దే బ్రీఫ్ డ్ మీ ' అని వినిపిస్తుంది. ఆ మాటలు విని ఎంత గొప్ప ఇంగ్లీషు మాట్లాడాడో మన ముఖ్యమంత్రి అని అంతా అన్నారు
  • ఆ కేసు నుంచి తప్పించుకోడానికి కేంద్రం దగ్గర మొరపెట్టుకుని.. ప్రత్యేక హోదాను పక్కన పెట్టి కేంద్రంతో లాలూచీ పడ్డారు.
  • చంద్రబాబు తనమీద కేసులు రాకూడదని దిగజారిపోయారు
  • ఆయనకు కూడా ఇది అర్థం కావాలి. కేసులు పెట్టడం కాదు.. ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్లమీద కేసులు పెడతారు. నామీద కూడా కేసులు పెట్టారు
  • అధికారంలో ఉన్న సోనియాతో కుమ్మక్కై, కిరణ్ ప్రభుత్వాన్ని రక్షించి ఇద్దరూ ఒకటై నామీద కేసులు పెట్టారు.
  • అప్పుడు రాజశేఖరరెడ్డి బతికున్నంత వరకు జగన్ మంచోడే, రాజశేఖరరెడ్డి మంచోడే
  • జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టగానే రాజశేఖరరెడ్డి మంచోడు కాకుండా పోయాడు
  • రాజకీయంగా నన్ను అణగదొక్కేందుకు ఈ చంద్రబాబు చీకటిలో చిదంబరాన్ని కలిసి నామీద కేసులు పెట్టారు
  • అయినా నేను భయపడలేదు.. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని గట్టిగా నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నా
  • ఆరోజు నేను భయపడలేదు. కారణం ఏమిటంటే.. వాళ్లు కేసులు పెట్టగలరు గానీ, తలరాతలు రాసేది పైనున్న దేవుడని ఎవరూ మర్చిపోకూడదు
  • చంద్రబాబు పైనున్న దేవుడిని నమ్ముకోకుండా... ప్రధాని కాళ్లు పట్టుకుంటున్నారు
  • హోదా ఇవ్వకపోగా దానిమీద అనేక అబద్ధాలు చెబుతున్నారు
  • తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసా ఒప్పుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు
  • రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసా లేవా.. అని అడుగుతున్నా
  • ఆరోజు ఆరాష్ట్రాలన్నీ ఉండగానే మన రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు
  • ఇప్పుడెందుకు ప్లేటు మారుస్తున్నారు
  • 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు
  • అసలు ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా అనే అంశం 14వ ఆర్థిక సంఘం పరిధిలో లేదు
  • దేశం మొత్తంమీద వసూలైన పన్నుల మొత్తాన్ని రాష్ట్రాల మధ్య ఎలా పంచాలో మాత్రమే ఆర్థిక సంఘం చూస్తుంది
  • అది కాక.. నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాల విషయం మాట్లాడుతుంది
  • ప్రత్యేక హోదా అంశం నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, కేంద్ర మంత్రివర్గం పరిధిలోనిది. వీటన్నింటికీ ప్రధానమంత్రే అధ్యక్షుడు.
  • అలాంటి ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే ఎందుకు హోదా రాదని అడుగుతున్నాను
  • ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు వాజ్ పేయి ఒక్క సంతకంతో రాష్ట్రం ఇచ్చేశారు.
  • తర్వాత ప్లానింగ్ కమిషన్ కు పంపారు.
  • 2014 మార్చి 2న అప్పటి ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లానింగ్ కమిషన్ కు ఉత్తర్వులు కూడా జారీ చేశారు..
  • ఇప్పటికి ఆ ఉత్తర్వులు ఇచ్చి 19 నెలలు అయిపోయింది. ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు
  • డిసెంబర్ లో మోదీ గారు ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేశారు. అంటే ప్రధాని అయిన తర్వాత కూడా 7 నెలలు ఆ ఫైలు పెండింగులో పడి ఉంది
  • కేంద్ర కేబినెట్ నిర్ణయమని తెలిసి కూడా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నావని చంద్రబాబును నిలదీస్తున్నా
  • అడగాల్సింది మనం... ఇవ్వాల్సింది వాళ్లు. మనం ఏం చేయాలంటే చంద్రబాబు మీద ఒత్తిడి తేవాలి
  • కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటానని చంద్రబాబు అల్టిమేటం ఇస్తే ఆరోజు ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని చెబుతున్నా.
  • ఆ మాట చెప్పిన 24 గంటల్లో తాను జైలుకు పోతానేమోనని ఈయన భయపడుతున్నాడు
  • కానీ మనం ఈ పోరాటం ఆపకూడదు
  • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు జరిగే మేలేంటో చూద్దాం
  • హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే.. ప్రత్యేక హోదా వల్ల 30వేల కోట్ల పెట్టుబడులు వచ్చి 130 శాతం అధికంగా పరిశ్రమలు, 490 శాతం అధికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి.
  • ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకోసం ఎంతవరకైనా పోరాడేందుకు నేను సిద్ధం
  • చంద్రబాబు పాలన మోసం, మోసం, మోసం, వెన్నుపోటు. అంతే!
  • ఎన్నికలకు ముందు బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పాడా లేదా?
  • మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా?
  • మోసం చేశాడు.. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడా లేదా?
  • డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయ్యాయా?
  • మోసం.. బాబు వస్తేనే జాబు వస్తుందని చెప్పాడా లేదా?
  • మరి జాబు వచ్చిందా..? పోనీ 2 వేల నిరుద్యోగ భృతి వచ్చిందా?
  • ఏవీ రాలేదు. చివరకు పింఛన్లు కూడా కొంతమందికి ఇస్తారు, ఎక్కువ మందికి ఎగ్గొడతారు
  • ఇళ్లు కట్టించడం కాదుకదా, కట్టిన వాటికి బిల్లులు కూడా ఇవ్వడంలేదు.
  • ఈ పాలనకు చరమగీతం పలికే రోజులు రావాలి. ఈ పాలన బంగాళాఖాతంలో కలిసే రోజు వస్తుంది
  • మనమంతా కలిసి కట్టుగా పోరాడదాం. చంద్రబాబే కాదు.. ఆయన నాయన మనసు కూడా మారుతుంది
  • ఈయన అల్టిమేటం ఇస్తారు, కేంద్రం కూడా దిగివస్తుందని చెబుతున్నా
  • మీరంతా ఇక్కడికొచ్చి సంఘీభావం చెబుతున్నందుకు పేరుపేరునా హృదయపూర్వంగా నమస్కారాలు.

1 comment: