- ఆగని హిందూత్వ శక్తుల ఆగడాలు
- ముగిసిన కసూరీ పుస్తకావిష్కరణొ ఆరుగురి అరెస్టు
ముంబయి : ఇటీవలే గులాం అలీ సంగీత కచేరీని బలవంతంగా రద్దు చేయించిన శివసేన ఉన్మాద చర్యలకు అంతే లేకుండా పోతోంది. సోమవారం ఉదయం కొందరు శివసేన కార్యకర్తలు ఒఆర్‌ఎఫ్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై ఆయన నివాసం ముందరే దాడి చేసి ముఖంపై నల్లరంగును పులిమారు. పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్ముద్ కసూరీ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించగూడదని శివసేన జారీ చేసిన 'ఫత్వా'ను తిరస్కరించడమే సుధీంద్ర చేసిన నేరం. కసూరీ రాసిన 'నైదర్ ఎ హాక్ నార్ ఎ డోవ్: ఎన్ ఇన్‌సైడర్స్ అకౌంట్ ఆఫ్ పాకిస్తాన్స్ ఫారిన్ పాలసీ' అనే పుస్తకాన్ని ఈ మధ్యే ఢిల్లీలో ఆవిష్కరించారు. 'ఉదయం నేను ఇంట్లోంచి బైటికి వస్తుండగా శివసైనికుల గుంపొకటి నా కారును అడ్డుకుంది. నేను కార్లోంచి బైటికి రాగానే దౌర్జన్యపూరితంగా నా ముఖంపై నల్లని పెయింట్ పూశారు' అని సుధీంద్ర కులకర్ణి అన్నారు. ఆయన 'అబ్జర్వర్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్' (ఒఆర్‌ఎఫ్) అనే సంస్థకు చైర్మన్‌గా ఉన్నారు. ఇది విదేశీ విధానాలను అధ్యయనం చేసే సంస్థ. దాడి తర్వాత ముఖంపై రంగుతోనే మీడియా ముందుకు వచ్చిన సుధీంద్ర, తాను ఇటువంటి వాటికి భయపడే వ్యక్తిని కాదని, పుస్తకావిష్కరణ కార్యక్రమం యథావిధిగా సోమవారం సాయంత్రం జరుగుతుందని అన్నారు. ఈ సంఘటన ముంబయి శివార్లలో ఉన్న మాతుంగాలో కులకర్ణి నివాసం ఎదుట ఉదయం 9.30 గంటలకు జరిగిందని పోలీసు ప్రతినిధి ధనంజరు చెప్పారు. గుర్తు తెలియని 5-7 మంది నినాదాలు చేస్తూ కులకర్ణిపై రంగు లేదా ఇంకు కుమ్మరించారని ఆయన చెప్పారు. సుధీంద్ర కులకర్ణి గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్.కె. అద్వానీ వంటి బిజెపి అగ్రనేతలకు ప్రసంగాలు రచించిన వ్యక్తి కావడం విశేషం. ఆదివారం సాయంత్రం ఆయన శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేను ఆయన నివాసం 'మాతోశ్రీ'లో కలిశారు. అయితే పుస్తకావిష్కరణ కార్యక్రమ నిర్వహణపై ఎలాంటి హామీ లేకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ సంఘటన చాలా దురదృష్టకరమైందని, దీనితో బాగా నిరాశకు గురయ్యానని కసూరీ అన్నారు. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది కానీ అది ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. తన పర్యటన ముఖ్య లక్ష్యం తన పదవీ కాలంలో భారత్, పాక్‌ల మధ్య జరిగిన శాంతి ప్రక్రియ గురించి మాట్లాడడమే అని ఆయన చెప్పారు. 'పాకిస్తాన్, భారత్‌లు పరస్పరం ద్వేషించుకోవడం కోసమే పుట్టలేదు. ఇరువైపులా సదుద్దేశాలు గలవారుంటే పరిస్థితి సులువుగా మారిపోతుంది. పుస్తకంలో నేను రాసింది కూడా ఇదే. ఈ సందేశాన్నివ్వడం చాలా ముఖ్యమని నా భావన' అని కసూరీ అన్నారు. కాగా, సిఎం దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ, పుస్తకావిష్కరణ కార్యక్రమానికి పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. ఇటీవల శివసేన 'ఫత్వా' మూలంగా గులాం అలీ కార్యక్రమం రద్దయిన నేపథ్యంలో ఫడ్నవిస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలె దుర్కొం టోంది. తన కూటమి భాగస్వామిని అది అదుపు చేయలేకపో తోందని ఒకవైపు, శివసేనతో లోపాయికారీ ఒప్పందంలో భాగంగానే ఈ విద్వేష ఎజెండా నిరాటం కంగా అమలయ్యేలా చేస్తోందని మరోవైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగా సిరాదాడికి పాల్పడ్డ ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.
అది సైనికుల రక్తం : శివసేన
తమ కార్యకర్తలు చేసిన దుశ్చర్యను శివసేన సమర్థించుకుంది. 'ఇంకు పోయడం అనేది చాలా స్వల్ప స్థాయి ప్రజాస్వామిక నిరసన రూపం. ఇంకుకే ఇంతగా బాధపడిపోతున్నారు! మన సైనికులు హతులవుతుంటే, రక్తం చిందిస్తుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అది ఇంకు కాదు, మన సైనికుల రక్తం' అని శివసేన నేత సంజరు రావుత్ వ్యాఖ్యానించారు.
ఇది బ్రేకింగ్ ఇండియానే : సిపిఎం
సుధీంద్ర కులకర్ణిపై దాడి చేసిన శివసేన కార్యకర్తలపై తక్షణం చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది. ముంబయిలో జరిగిన ఈ దాడి ఘటనను ఖండిస్తూ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలను ఉదాహరిస్తూ సిపిఎం, నరేంద్ర మోడీ చేపట్టిన 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమం ఆచరణలో 'బ్రేకింగ్ ఇండియా' రూపంలో సాగుతోందని ఎద్దేవా చేసింది. 'నరేంద్ర మోడీ చేపట్టిన మేకింగ్ ఇండియా కార్యక్రమం నిజానికి బ్రేకింగ్ ఇండియానే. దీనికి మతతత్వం, అసహనం, స్త్రీద్వేషం, కులతత్వం మూలస్తంభాలుగా ఉన్నాయ'ని పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందా కరత్ చేసిన ట్వీట్లను సిపిఎం ఉటంకించింది.
ఆందోళనల మధ్య పుస్తకావిష్కరణ
శివసేన హెచ్చరికల మధ్యే ఎట్టకేలకు కెఎం కసూరీ పుస్తకావిష్కరణ కార్యక్రమం ముగిసింది. సుధీంద్ర కులకర్ణిపై దాడి నేపథ్యంలో ఈ కార్యక్రమంపై చివరి దాకా అనుమానాలు కొనసాగాయి. సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సుధీంద్ర భారత్, పాక్‌ల మధ్య సంబంధాలకు సంబంధించిన ఈ పుస్తకానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు. ఈ విషయమై ఉద్ధవ్ ఠాక్రేను మొదటే కలిసి ఈ కార్యక్రమాన్ని ఎందుకు నిర్వహిస్తున్నామో వివరించానని సుదీంధ్ర చెప్పారు. ముంబయి నగరం లౌకిక విలువల గురించి మాట్లాడుతూ, 'ముంబయి సహనశీలత, సమ్మిళితత్వం, ఉదారత, ప్రజాస్వామ్యం వంటి విలువలకు పేరున్న నగరం. భారత్-పాకిస్తాన్‌ల మధ్య శాంతి సంభాషణలు జరగాలనే అభిప్రాయానికి ముంబయి కట్టుబడి ఉంది. హెచ్చరికల మధ్యే ఈ కార్యక్రమం జరగడం ఇందుకు తాజా నిదర్శనం' అని అన్నారు. తర్వాత పాకిస్తాన్ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షీద్ మహ్ముద్ కసూరీ తన పుస్తకం గురించి మాట్లా డారు. ఆయన ఈ కార్యక్రమానికి రక్షణ కల్పించినందుకు మహారాష్ట్ర సిఎంకి ధన్యవాదాలు తెలిపారు. 'ఇరు దేశాల్లోనూ చరిత్ర హననం జరిగింది. ప్రజల దృష్టికోణాన్ని సరిచేయాలనే ఉద్దేశంతోనే ఈ పుస్తకం రాశాను' అని ఆయనన్నారు. తాను పుస్తకంలో వాస్తవాలను తప్పుగా ఉదాహరించలేదని, భారత్ ప్రాతినిధ్యాన్ని తక్కువ చేయలేదని చెప్పారు. భారత్, పాక్ సంబంధాల గురించి మాట్లాడుతూ, 'సాధారణ ప్రజలు, సైనికులు చనిపోతున్నారు. దీనికి పరిష్కారం ఏమైనా ఉందా? మనసుంటే మార్గం తప్పక ఉంటుంది. నా సూచన ఏమంటే యుఎన్ మిలిటరీ అబ్జర్వర్ గ్రూపును నమ్మడం మానెయ్యండి. పాకిస్తాన్‌లోనూ, భారత్‌లోనూ గౌరవనీయులైన వారున్నారు. మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయమూర్తులు ఉన్నారు. పర్యవేక్షణ కోసం వారిని అడగలేమా?' అని కసూరీ అన్నారు.
'శివసేన...భారతీయ తాలిబాన్'
- సుధీంద్ర కులకర్ణి దాడి ఘటనపై సర్వత్రా ఆగ్రహం
సుధీంద్ర కులకర్ణిపై శివసైనికుల దాడిని దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ ఖండించాయి. ఆఖరుకు పాలక బిజెపి నేతలు వెటరన్ ఎల్.కె. అద్వానీ సహా ముఖ్తార్ అబ్బాస్ నక్వీ, మంత్రి కిరెన్ రిజిజు తదితరులు సైతం దీనిని ఖండించక తప్పలేదు. వామపక్ష పార్టీలు, సినీరంగ ప్రముఖులు కూడా సుధీంద్రపై శివసేన దాడి పట్ల నిరసన తెలిపినవారిలో ఉన్నారు.
విద్వేష ఘటనలు పెరిగాయి : దిగ్విజయసింగ్
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయసింగ్ శివసేనను భారతీయ తాలిబాన్‌గా అభివర్ణించారు. 'మొదట గులాం అలీ సంగీత కార్యక్రమాన్ని అడ్డుకున్నారు, ఇప్పుడు కసూరీ పుస్తకావిష్కరణను అడ్డుకుంటున్నారు. భారత్‌లో మనకు ఇలాంటి దేశీయ తాలిబాన్ అవసరం లేదు' అని ఆయన ఘాటుగా ట్వీట్స్ చేశారు. ఇలాంటి తాలిబానీ గుండాయిజాన్ని వ్యతిరేకించే వాళ్లంతా పుస్తకావిష్కరణకు మద్దతు ప్రకటించాలని ఆయన కోరారు. ఉద్ధవ్ ఠాక్రే తన గూండాలను అదుపు చేయాలని ఆయన ఒక ట్వీట్ ద్వారా డిమాండ్ చేశారు. కాగా, బిజెపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత 18 నెలలుగా ఇటువంటి విద్వేష సంఘటనలు బాగా పెరిగిపోయాయని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వి అన్నారు. 'ఇది కులకర్ణి లేదా కసూరీకి సంబంధించిన విషయం కాదు. ఇది భారత ఉదార ప్రజాస్వామ్య విలువలకు సంబంధించిన విషయం. వారు పరస్పర వైషమ్యాలను ఎగదోస్తున్నారు. నాగ్‌పూర్ రిమోట్ కంట్రోల్‌తో నడిచే అధికార పార్టీకి ఈ సంఘటనతో స్పష్టమైన సంబంధాలున్నాయి' అని ఆయన తన ప్రకటనలో తెలిపారు. వీటిని ఆపగల ఒకే ఒక్క వ్యక్తి ప్రధాని మోడీనే అంటూ, ఈ సమస్యలపై ఆయన మౌనం వహిస్తున్నారని సింఘ్వి ఆరోపించారు. మరో కాంగ్రెస్ నేత సంజరు ఝా 'నల్ల రంగు పూసింది సుధీంద్ర కులకర్ణి ముఖానికి కాదు, ఇది భారత ప్రజాస్వామ్యంపైనే నల్లటి మచ్చ' అని అన్నారు. దేశంలో ఫాసిస్టు శక్తులు చెలరేగిపోతున్నాయని ఆయన విమర్శించారు.
బాలీవుడ్ ఖండనలు
ఒఆర్‌ఎఫ్ చైర్మన్ సుధీంద్ర కులకర్ణిపై దాడిని పలువురు బాలీవుడ్ దిగ్గజాలు ఖండించారు. షబానా ఆజ్మీ, మహేష్ భట్, రిషి కపూర్ వంటి సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో తమ నిరసనల్ని ప్రకటించారు. 'సుధీంద్ర కులకర్ణిపై దాడి మన రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది. ఇటువంటి చర్యలతో మనది ప్రజాస్వామ్య దేశమని చెప్పుకోవడానికే ఇబ్బంది పడాల్సి వస్తుంది' అని ఫిల్మ్‌మేకర్ మహేష్ భట్ అన్నారు. కాగా, ప్రముఖ నటి షబానా ఆజ్మీ ఈ సంఘటన విచారకరం అని అన్నారు.
'నేను ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేలతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ వాళ్లిద్దరూ నా కాల్స్‌కు స్పందించలేదు' అని ఆమె తెలిపారు. గాయని సోనా ముఖర్జీ కూడా దీనిపై స్పందించారు. 'ప్రియమైన శివసేనా! సుధీంద్రపై ఇంకు పోయడం తోనే మీరు దేశభక్తులైపోరు. మీకు అణుమాత్రమైనా శ్రద్ధ ఉంటే, మన అతి పెద్ద శత్రువైన పేదరికంతో పోరాడండి' అని ఆమె ట్వీట్ చేశారు. కాగా, దీనిపై రిషికపూర్, 'ఇది హాస్యాస్పదమైంది, క్షమించరానిది' అని ట్వీట్ చేశారు.
సేన చర్యలు శోచనీయం : సిపిఐ
రాజ్యాంగ సమ్మతం కాని ఇలాంటి చర్యలకు పాల్పడడం శివసేనకు తగదని సిపిఐ అంది. 'ఈ తరహా అసహనాన్ని మన దేశం భరించలేదు. అట్లాగే, ఇది పాకిస్తాన్‌తో సత్సంబంధాలను ఏర్పర్చుకునేందుకు జరిగే ఏ ప్రయత్నానికైనా విరుద్ధమైనదే' అని ఆ పార్టీ నేత డి. రాజా అన్నారు.
కొద్ది రోజులుగా ఇవి పెరిగిపోయాయి : అద్వానీ
బిజెపి సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ ఈ సంఘటనను ఖండించారు. దేశంలో పెరుగుతున్న అసహనం పట్ల ఆయన అసంతృప్తి వెలిబుచ్చారు. 'నేనీ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా... ఏ వ్యక్తి గానీ లేదా ఏ అభిప్రాయమైనా ఆమోదయోగ్యం కాకుంటే హింసకు పాల్పడడం, వారి పట్ల అసహనం వ్యక్తం చేయడం వంటి సంకేతాలు గత కొద్ది రోజులుగా కనబడుతున్నాయి. ఇది దేశానికి ఆందోళన కలిగించే విషయం. ప్రజాస్వామ్యంలో విభిన్న అభిప్రాయాల పట్ల సహనం చాలా అవసరం' అని అద్వానీ అన్నారు.
శివసేన దాడికి గురైన సుధీంద్ర కులకర్ణి గతంలో అద్వానీకి ఉపన్యాసాల రచయితగా పని చేయడం గమనార్హం. హౌంశాఖ సహాయ మంత్రి కిరెన్ రిజిజు ఈ సంఘటనను ఖండించారు. రాజధానిలో బిఎస్‌ఎఫ్‌కు సంబంధించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రిజిజు ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు.
No comments:
Post a Comment