Tuesday, 27 October 2015

ఆకాశం నుంచి ఊడిపడిందా విరసం? చలసాని ప్రసాద్ ఇంటర్వ్యూ

ఆకాశం నుంచి ఊడిపడిందా విరసం? 
Updated :26-10-2015 01:41:22
యాభై సంవత్సరాల కాలం ఏ బంధంలోనైనా చాలా అపురూపమైనదే. అది స్నేహానికి సంబంధించినదైతే, మరీ ముఖ్యంగా సీ్త్ర పురుషుల మధ్య వారి వ్యక్తిగత, రాజకీయ ఆచరణలతో పెనవేసుకుని, ఎటువంటి పొరపొచ్చాలూ లేకుండా సాగినదైతే... దాన్నుంచి తెలుసుకోవలసినవీ నేర్చుకోవలసినవీ చాలా ఉంటాయి. ఆ ఉద్దేశంతోనే 2011 ఫిబ్రవరిలో చలసాని ప్రసాద్‌ గారిని, కృష్ణాబాయి గారిని కలిపి వీడియో ఇంటర్‌వ్యూ తీసుకున్నాను. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఆ ఇంటర్‌వ్యూలో వారి బాల్యం దగ్గర నుంచి వర్తమానం వరకూ అనేక విషయాల మీద మాట్లాడారు. ప్రసాద్‌ గారి మరణం తరువాత జరుగుతున్న చర్చలకి ఈ సమాచారం ఏవైనా ఉపయోగపడుతుందేమో అన్న ఉద్దేశంతో ఇపుడు ఇంటర్‌వ్యూలో కొంత భాగాన్ని ప్రచురణకి ఇస్తున్నాను. ఇందులో కేవలం విరసం ఆవిర్భావానికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉంటాయి. ఈ భాగంలో ప్రసాద్‌ గారే ఎక్కువ మాట్లాడారు. వేగంగా మాట్లాడే క్రమంలో పదాలు మింగేసినపుడూ, వాక్యం అర్ధం కానంత అస్పష్టంగా ఉన్నపుడూ భావం చెడకుండా వ్యాకరణ నిమిత్తం సరి చేసాను. మిగతాది యధాతధంగా...
- కె.ఎన్‌. మల్లీశ్వరి
- 1970లో విరసం ఆవిర్భవించినపుడు దానికి బాక్‌ గ్రౌండ్‌ వర్క్‌ చేసిన వాళ్ళలో మీరూ ఉన్నారు కదా?
విరసం పుట్టినపుడు (1970 జూలై నాలుగు) వ్యవస్థాపక సభ్యులుగా అప్పుడు విరసంతో ఉండి ఇప్పుడు బతికుండి ఇప్పుడు విరసంతో ఉన్నవాళ్ళలో ముగ్గురం ఉన్నాం. నేను, మా వదిన (కృష్ణాబాయి), వరవరరావు. రాష్ట్రం మొత్తం మీద ముగ్గురున్నామని ఒకరకంగా మాకు సంతృప్తి. మార్క్సిజానికి మూడు హెల్ప్‌ చేశాయని చెపుతారు. జర్మన్‌ క్లాసికల్‌ ఫిలాసఫీ, ఫ్రెంచ్‌ పాలిటిక్స్‌, బ్రిటీష్‌ ఎకనామిక్స్‌. మూడిటినీ కలిపి మధించి మార్క్సిజాన్ని తయారు చేసాడని చెప్పి చాలా మంది అంటారు. అది నిజం. విరసంలో కూడా మూడు పాయలు కలిసాయి. పాత అరసంతో ఉండి, వాళ్ళ వర్గ సంకర రాజకీయాలు విభేదించిన శ్రీశ్రీ, కుటుంబరావు, రమణారెడ్డి ముగ్గురూ, దిగంబర కవుల ఆధ్వర్యంలో ఉండి సంచలనం తీసుకు వచ్చిన ఒక గ్రూపు, శ్రీకాకుళ గిరిజన పోరాటంలో ప్రభావితమైన ఒక గ్రూపు ఈ మూడూ కలిసి విరసం ఏర్పడింది. (తరువాతి మాటల్లో తిరుగబడు కవుల కంట్రిబ్యూషన్‌ గురించి కూడా ప్రస్తావించారు)
 
- దిగంబర కవుల్లో ఆరుగురూ విరసంలో చేరారా?
నలుగురున్నారు. ఇద్దరు విరసంలో చేరలేదు. భైరవయ్య, మహాస్వప్న విరసం లో చేరలేదు. మిగతా నలుగురు చేరారు. చేరినాళ్ళలో జ్వాలాముఖి, నిఖిలేశ్వర్‌ 1975లో వెళ్ళిపోయారు. బట్‌ ఏదైనా మా మధ్య వైమనస్యాలు లేవు. వాళ్ళు జనరల్‌గా విరసంలో లేరు. విరసంతో ఉండొచ్చు. చెరబండరాజు నూటికి నూరు పాళ్ళు విరసంలో ఉన్నారు. రావిశాసి్త్ర, కారా మాస్టారికి కూడా శ్రీకాకుళ పోరాటం మీద అభిమానం ఉంది. న్యాయంగా విరసం పుట్టక మునుపే నిజమైన విముక్తి మార్గమేదో శ్రీకాకుళ గిరిజనులకే తెలుసు. అలాగే కాళీపట్నం రామారావు మాస్టారిమీద కూడా శ్రీకాకుళ గిరిజన పోరాట ప్రభావం ఉంది. వాళ్ళ సాహిత్యం మీద ఉంది. వాళ్ళు విరసంలో చేరటం మీద ఉంది.
మాకు పాత అరసంతో సంబంధ బాంధవ్యాలుండేవి. సాంతం లేవని చెప్పడానికి వీలు లేదు. చిన్నాళ్ళం కనక రమణారెడ్డి గారిలాగా టాప్‌ స్థాయికి వెళ్లి కార్యవర్గంలో లేము గాని అప్పుడు అరసంతో మేం పూర్తిగా ఉన్నట్లే లెక్క. ఆత్రేయ నాటకాలు, పరివర్తన నాటకాలు, ముందడుగు, మాభూమి వీటన్నింటితో మాకు ఒకరకమైన చైతన్య సంబంధం ఉండేది. అట్లా నేనూ వదినా కూడా పాత అరసానికి చెందిన వాళ్ళమే. విరసం ఏర్పడటానికి ఆరునెల్ల ముందు విశాఖపట్నంలో శ్రీశ్రీ షష్టి పూర్తి సందర్భంగా ఏర్పాట్లు జరుగుతుండేవి కదా..... శిశువు పుట్టడం హైదరాబాద్‌లో అయినా పురుటి నొప్పులు విశాఖపట్నంలోనే అనేవారు. అట్లాగే శ్రీశ్రీ ఒకమాటన్నాడు ‘ద్రౌపది అగ్నిలో పుట్టిందని వ్యాసులవారు రాసారు.ఆ పుట్టడాన్ని వ్యాసులవారు చూసేరో లేదో నాకు తెలీదు కానీ నేను మాత్రం విరసం విప్లవాగ్నిలో పుట్టడం చూశానని’ అన్నాడు. చాలా సార్లు రాసాడు ఆ మాట.
 
- రచయితలకు సవాల్‌ కరపత్రం వేసారు కదా?
(మధ్యలో అందుకుని) అది విరసం స్థాపనకు దోహదం చేసింది.
 
- అది వేసిన వాళ్ళలో ఎవరున్నారు?
ఇక్కడ మెడికల్‌ స్టూడెంట్స్‌ కొంత మంది ఉండేవాళ్ళు.
 
- ఎన్నెస్‌ ప్రకాశరావు లేరా?
ఎన్నెస్‌ ప్రకాశరావుకి ఏం సంబంధం లేదు.
 
- అంత అవగాహనతో కరపత్రం వచ్చిందంటే ఎవరు కృషి చేసారు?
మెడికల్‌ స్టూడెంట్స్‌ ఎక్కువ మంది ఉన్నారు. ముఖ్యంగా భారతి చంద్రశేఖర్‌ అని సత్తెనపల్లిలో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఆయనకు శ్రీకాకుళం మూమెంట్స్‌తో సంబంధాలుండేవి అప్పటికి. అది మాకు కూడా తెలియదు. సానుభూతి ఉన్నా మాకు తెలియదు దాని గురించి. శ్రీకాకుళంతో సంబంధాలుండి రచయితలకు సవాల్‌ రాసింది మెడికల్‌ స్టూడెంట్స్‌. ఫ్రేం చేయడంలో ఎవరైనా హెల్ప్‌ చేస్తే చేసుండొచ్చు. ఎన్నెస్‌ ప్రకాశరావుకి ఏం సంబంధం లేదు. అట్లాగే వెల్చేరు నారాయణరావుకి కూడా ఏం సంబంధం లేదు. కొంత మందేమో జ్వాలాముఖి అంటారు. జ్వాలాముఖికి కూడా సంబంధం లేదు. ఎవరితోనైనా దిద్దించుకుని ఉండొచ్చు గానీ ఆ ఊపు, ఉత్తేజం డ్రాఫ్టింగ్‌ మెడికల్‌ స్టూడెంట్స్‌ చేసారు. మెడికల్‌ స్టూడెంట్స్‌లో కూడా నాకు గుర్తున్నవాళ్ళు జ్యేష్ట బావమరిది మల్లంపల్లి కృష్ణారావు, భారతి చంద్రశేఖర్‌, జ్ఞానేశ్వర్‌. ఏ మాటకామాటే చెప్పుకోవాలి ఈ ముగ్గురే ఆ పని చేసారు. (కృష్ణాబాయి గారు అందుకుని ‘వాళ్ళు వచ్చేవరకు, స్టేజ్‌ మీద చదివేవరకూ మాకు కూడా తెలియదు’ అన్నారు) అంత పకడ్బందీగా చేసారు. కేతవరపు రామకోటిశాసి్త్ర... కాత్యాయని వాళ్ళ ఫాదర్‌ మాకు తెలుసేమోనని అడిగారు. మా టీచర్‌ కదా ఆయన ...అథెంటిక్‌గా ఉంటారు కదా. మాకు తెలీదండీ అన్నాము.
 
అమెరికన్స్‌ అన్నారు ఒకరోజుని యు హావ్‌ ఎవిరీ రైట్‌ టూ బి రాంగ్‌ ఇన్‌ ద క్వశ్చన్‌ అఫ్‌ ఒపీనియన్‌. బట్‌ యు హావ్‌ నో రైట్‌ టూ బి రాంగ్‌ ఇన్‌ ద క్వశ్చన్‌ అఫ్‌ ఫాక్ట్‌. ఫాక్ట్‌ని గౌరవించాలి మనం. మేం కూడా రాజకీయ విషయాలు గానీ సాహిత్య విషయాలు గానీ డ్రాఫ్ట్‌లలో గానీ పుస్తకాల్లో గానీ కరపత్రాల్లో గానీ ఆ నియమాన్ని పాటిస్తున్నాం. ఒపీనియన్‌ మనిష్టం. ఫాక్ట్‌ని వక్రీకరించే ఇది మనకెక్కడుంది? విరసం ఏర్పాటుకు కారణం... ఆకాశం నుంచి ఊడిపడిందా విరసం? పాత అరసంతో మొహం మొత్తినాళ్ళు దిగంబర కవిత్వంతో ఇన్స్పైర్‌ అయినాళ్ళు తిరుగబడు కవులలో కొందరు శ్రీకాకుళం పోరాటంతో ఇన్‌స్పైర్‌ అయినాళ్ళు ఈ పాయలన్నీ కలిసి విరసం ఏర్పడింది.
 
- హైదరాబాద్‌లో సెవన్‌ స్టార్‌ సిండికేట్‌ సంస్థ ఏర్పాటు చేసిన సన్మానానికి శ్రీశ్రీ వచ్చేశారు కదా? అపుడేమి జరిగిందో మీకు తెలుసు కదా?
కుటుంబరావుతో శ్రీశ్రీతో రావిశాసి్త్ర కారా గార్లతో మా ఇద్దరికీ కలిపి వారితో ఉన్న సంబంధాలు విరసానికి ఎక్కువతోడ్పడ్డాయి. వరవరరావు వరంగల్‌ నుంచి తిరుగబడు కవులకు నాయకుడు. దిగంబర కవుల్లా ఊరూరాతిరిగి ఉపన్యాసాలు ఇచ్చాడని చెప్పలేం కానీ సాహిత్యపరంగా వరవరరావుది సిగ్నిఫికెంట్‌ రోల్‌.
 
- విరసం ఏర్పడడం అనేది అప్పటికపుడు తీసుకున్న నిర్ణయమా?
అది కాదూ.. శ్రీశ్రీ సన్మాన కార్యక్రమంలో చదివారు కదా రచయితలకు సవాల్‌ అని.. మీరు ఏ వైపు ఉంటారు సినిమా ఓణీల వైపా, బార్ల వైపా అని బాగా తిట్టారు కదా అపుడు ఆలోచన మొదలైంది. జ్వాలాముఖి అపుడు మాకు బాగా దగ్గరగా ఉండేవాడు. రాజకీయాల్లో బాగా హెల్దీ మనిషి. అపుడు దిగంబర కవులు బాగా ప్రచారం చేస్తే దిగంబర కవుల్ని ఏమైనా చేస్తారేమోనని మాకు అనుమానం వచ్చింది. శ్రీశ్రీ సన్మానం అయ్యాక, జ్వాలాముఖి రెండురోజులు ఉండి స్కూటర్‌ వేసుకుని రావిశాసి్త్ర గారి దగ్గరకు వెళ్లి ఒక ఊపు వదిలాడు. మనసులో ఆలోచన చేసాడు. అరసానికి బ్రేక్‌ అవ్వాలని... ఐడియా ఒకరకంగా జ్వాలాముఖిదే. శాసి్త్ర గారు కూడా కలిపి ఆలోచిద్దాం అన్నారు. కానీ ఏమైందీ శ్రీశ్రీ సన్మానాన్ని ఓ సినిమా (వీడియో) తీసాం. ఆ సినిమాని విశాఖపట్నం నుంచి మద్రాసు దాకా అన్ని ఊళ్లలోనూ అంటే ఇంట్రస్ట్‌ ఉన్నవాళ్ళకి తెనాలి, గుంటూరు, మద్రాసు, వరంగల్‌, హైదరాబాద్‌ అన్ని చోట్లా చూపించాము. రమణారెడ్డి గారి దగ్గరకెళ్ళినపుడు ఏవన్నారంటే సరే చేద్దాం. పేరేంటి అనే ఆలోచన వచ్చింది. విరసం అని పెట్టాలని ఒక ఆలోచన. శ్రీశ్రీ లావారసం అనేదో అన్నాడు. లాక్షనికవాద రచయితల సంఘం అని. నేను విరసమే పెట్టాలని అన్నాను. కుటుంబరావు గారు కూడా దానికి ఒప్పుకున్నారు. అట్లా శ్రీశ్రీ సన్మానంతో ఆగిపోలేదు. విరసం ఏర్పాటుకు అవసరమైన బాక్‌ గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేసాము. అయితే రమణారెడ్డి గారు బాగా అనుకూలించారు. ఆయన మీద శ్రీశ్రీకి కుటుంబరావు గారికి అపారమైన గౌరవం ఉండేది. రమణారెడ్డి గారికి అరసాన్ని చూసిన తర్వాత వాళ్ళతో మొహం మొత్తింది. వీళ్ళకి పోటీగా పెట్టాలని సన్మానానికి ముందు కూడా ఆయనకి వ్యూ ఉంది. అందుకే రావిశాసి్త్రగారితో పెద్దగా పరిచయం లేకపోయినా ఆయనతో కాంటాక్ట్‌ పెట్టుకుని అరసం వాళ్ళు వర్గ సంకర రాజకీయాలు ప్రవేశపెడుతున్నారు అని రావిశాసి్త్ర గారికి కూడా రాసారు. అట్లా ఇనీషియేటివ్‌ తీసుకున్నారు. సైలెంట్‌ గానైనా లిమిటెడ్‌ గానైనా పని చేయాలనుకున్నారు. రావిశాసి్త్ర గారికి కూడా రమణారెడ్డి గారిని చూస్తే ఈ పెద్దమనిషిని నమ్ముకుని పని చేయొచ్చు అని నమ్మకం ఉండేది. విరసం సంస్థ నిర్మాణానికి ఇవన్నీ హెల్ప్‌ చేసాయి. ఇబ్బందులు లేకుండా గట్టెక్కించాయి.
 
- ఆ రోజు హైదరాబాద్‌ సన్మానాన్ని శ్రీశ్రీ బాయ్‌ కాట్‌ చేసారా? సన్మానంలో పాల్గొనడానికి మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చేశారు కదా? అప్పటికపుడు బాయ్‌ కాట్‌ చేయడం వెనుక కారణం ఏంటి?
ఆ రోజు ద్వారకా హోటల్‌లో ఉన్న శ్రీశ్రీ వెళ్ళలేదు కదా వెళ్ళకుండా చేసాంకదా
 
- అదే.. అట్లా చేసింది ఎవరు?
నేనూ, హరి, నగ్నముని
 
- పర్టిక్యులర్‌గా ఆ రోజు జరిగింది ఏంటి?
ఆ రోజు ద్వారకా హోటల్లో దింపాము శ్రీశ్రీని. అంతకు ముందు రమణారెడ్డి గారు నాకు ఉత్తరం రాసారు. బెజవాడ నుంచి బస్‌లో అట్లా అట్లా నిద్రబోతూ హైదరాబాద్‌ చేరాము. నేనూ రమణారెడ్డి శ్రీశ్రీ దగ్గరకు వెళ్ళాము. ‘నెరూడా కూడా ఇలాంటివి నిరాకరించాడు’ ఇలా చాలా చెప్పాము. ‘సర్లెండి విదూషకుడి నాటకం చూస్తాను, సన్మానానికి వెళ్ళను’ అని హామీ ఇచ్చాడు. వెర్రివాడు కదా పసి పిల్లవాడు కదా ఆ నాటకం చూడాలని అన్నాడు. నాటకం చూడ్డానికి వెళ్తే కట్టేస్తారండీ అన్నాము. సరే అట్లా మీటింగ్‌ జరుగుతుందిలే నువ్వు వచ్చేసేయ్‌ మనం వెళ్ళిపోదాం అన్నాడు శ్రీశ్రీ. కుట్ర అనికాదు గానీ శ్రీశ్రీ లేకపోయినా ఆ రోజు విరసం ఏర్పడేది. తర్వాతైనా శ్రీశ్రీ వచ్చేవాడే. శ్రీశ్రీ ఉండటం చాలా గౌరవం. అయితే మనకి వాళ్ళతో ఉన్న పరిచయాలు పురస్కరించుకుని కొంత చేసాం కనుక ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్పి ఆ విషవలయం నుంచి తప్పించి నాంపల్లి స్టేషన్‌ దగ్గర రాయల్‌ హోటల్‌ ఉంది. మామూలు హోటలే అది. ఆ హోటల్లో దిగి వరవరరావు వీళ్ళందరికీ ఫోన్లు చేసాము. శ్రీశ్రీకి ఇష్టం లేకుండా చేసిందేమీ లేదు. ఇవన్నీ కలుపుకుని విరసం ఏర్పడింది. అపుడు శ్రీశ్రీ ఆ రూమ్‌ ఖాళీ చేసి మన దగ్గరకు వచ్చేసాడు. మర్నాడు నేను స్కూటర్‌ మీద తీసుకెళ్ళి బండి ఎక్కించి వచ్చాను. అయితే శ్రీశ్రీ వజ్‌ నెవ్వర్‌ గ్రీడీ బట్‌ హి ఈజ్‌ ఆల్వేస్‌ నీడీ. అది తెలుసు కదా మనకి. విరసం ఏర్పడిన తర్వాత ఆయన బాగా సఫర్‌ అయ్యాడు. సీపీఐ వాళ్ళు కావాలని ఆయన సినిమాలు బాయ్‌ కాట్‌ చేసారు. ఏడాది పాటు బాగా సఫర్‌ అయ్యాడు. సఫర్‌ చేసారయన్ను సీపీఐ వాళ్ళు కాంగ్రెస్‌ వాళ్ళూ కలిసి. విరసం ఏర్పడడం వాళ్లకి పెద్ద షాక్‌. శ్రీశ్రీ లేకుండా అరసం ఏంటి? 55లో శ్రీశ్రీ వాళ్ళ ప్రెసిడెంట్‌. శ్రీశ్రీ లేకుండా విరసం ఏర్పడినా ఇంత రెస్పెక్ట్‌ ఉండేది కాదు. రావిశాసి్త్ర శ్రీశ్రీ కెవిఆర్‌ అప్పుడు సాహిత్యంలో మేరుపర్వతాలు. వాళ్ళు ముగ్గురు ఉండడం వల్ల రెస్పెక్ట్‌ వచ్చింది.

No comments:

Post a Comment