ప్రశ్నిస్తే మీడియాపై కేసులు పెడతాం: నాయిని Updated :23-10-2015 13:17:33 |
హైదరాబాద్, అక్టోబర్ 23: చంచల్‌గూడ జైలులో నూతన బ్యారక్‌ను ప్రారంభించడానికి వచ్చిన తెలంగాణ హోం మంత్రి నాయిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. న్యూకాంప్లెక్స్ నిర్మాణంలో అవకతవకలపై ప్రశ్నించిన జర్నలిస్టులపై హోంమంత్రి నాయిని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలి వార్తలపై వివరణ అడిగితే కేసులు పెడతామంటూ తన అక్కసును వెళ్లగక్కారు. ప్రభుత్వం అవకాశం దొరికినప్పుడల్లా మీడియాపై తన ఆక్రోశాన్ని బయటపెడుతూనే ఉంది. గతంలో కూడా మీడియాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తన అక్కసును వెళ్లగక్కారు. ఒక సభలో మాట్లాడుతూ మీడియాను ఆరడుగుల గోతిలో పాతిపెడతాం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద దుమారమే రేగింది. బాధ్యతగా మెలగాల్సిన మంత్రులే ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేస్తూ మీడియాతో దురుసుగా ప్రవర్తించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్నందుకు మీడియాపై కేసులు పెడతామనడం హోం మంత్రి నాయినికి తగదని పలువురు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో మీడియా పాత్రను కేసీఆర్ ప్రభుత్వం మర్చిపోతోందని దుమ్మెత్తిపోస్తున్నారు. ఓడదాటే దాకా ఓడ మల్లయ్య, ఓడ దాటిన తర్వాత బోడి మల్లయ్య అన్న చందంగా కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తోందని జర్నలిస్టులు విమర్శిస్తున్నారు. ప్రజలకు అండగా నిలుస్తున్న మీడియాపై సర్కార్ ఇదే వైఖరిని కొనసాగిస్తే, ప్రజాగ్రహానికి గురి కాక తప్పదని హెచ్చరిస్తున్నారు.
|
No comments:
Post a Comment