జూన్‌లోపు రావాల్సిందే Updated :30-10-2015 00:57:50 |
హైదరాబాద్, విజయవాడ, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఇక్కడ.. మీరు అక్కడ ఉంటే పాలన వీలు కాదు. దయచేసి ఇబ్బంది పెట్టవద్దు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు. కేంద్రం నుంచి ఆశించిన స్థాయిలో ఆర్థిక సాయం అందడం లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా మీరు అడిగినవన్నీ ఇచ్చాను. పరిస్థితిని అర్థం చేసుకొని సహకరించండి. వచ్చే జూన్‌లోగా ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లో అమరావతి ప్రాంతానికి రావాల్సిందే’’ అని సీఎం చంద్రబాబు ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘ నాయకులకు స్పష్టం చేశారు. ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉంటే పాలనకు ఇబ్బందులు కలుగుతున్నాయని చెప్పారు. ఉద్యోగులు వచ్చే జూన్‌లోపులో రాజధాని ప్రాంతానికి రావాలంటూ సాధారణ పరిపాలన శాఖ మూడు ఆప్షన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై సచివాలయంలో గందరగోళం చెలరేగింది. జూన్‌లోపులో విజయవాడకు రావడం సాధ్యం కాదని, శాశ్వత తరలింపునకు రెండు మూడేళ్లు పడుతుందని ఉద్యోగ సంఘాల నాయకులు వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ, మరికొంత మంది నాయకులు గురువారం సీఎంను ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. వచ్చే జూన్‌లోగా ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ తరలి రావాల్సిందేనని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర నిర్మాణానికి ఉద్యోగులు కూడా కొన్ని త్యాగాలు చేయాలని కోరారు. రాజధాని ప్రాంతంలో ఉద్యోగులకు కొంతకాలం తాత్కాలిక వసతి కల్పించగలమని, శాశ్వత వసతి ఏర్పాటు చేయలేమని స్పష్టం చేశారు. అటు హైదరాబాద్‌లోనూ, ఇటు అమరావతిలోనూ హెచ్‌ఆర్‌ఏ కల్పించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను పరిశీలిస్తామన్నారు.
|
No comments:
Post a Comment